హన్సిక బాటలో రకుల్
నటి రకుల్‌ప్రీత్ సింగ్ హన్సికను ఆదర్శంగా తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఆదిలో తడైయార తాక్క, పుత్తకం, ఎన్నమో ఏదో వంటి తమిళ చిత్రాల్లో నటించి, ఐరన్ లెగ్ ముద్రతో కోలీవుడ్ నిరాకరించిన నటి రకుల్. పోయిన చోటే వెతుక్కోవాలన్న సామెత రకుల్‌ప్రీత్ సింగ్ విషయంలో రివర్స్ అయ్యిందని చెప్పవచ్చు. ఎందుకంటే టాలీవుడ్‌లో టాప్ కథానాయకిగా రాణిస్తున్న రకుల్ కోసం ఇప్పుడు కోలీవుడ్ రెడ్‌కార్పెట్ పరుస్తోంది. త్వరలో యువ నటుడు కార్తీతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా రకుల్ తన మనోగతాన్ని వెల్లడించారు. అదేంటో చూద్దామా ‘సినిమాలో ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో అంచనా వేయడం సాధ్యం కాదు. ఇక్కడి వారి పరిస్థితి ఒకే రోజు తలకిందులుగా మారిపోతుంది. నాకిక్కడ ప్రారంభంలో అవకాశాలు తక్కువగానే వచ్చాయి.
నేను నటించిన మూడు చిత్రాలు వరుసగా అపజయం పొందాయి. దీంతో రాశి లేని నటిగా పక్కన పెట్టేశారు. నేను నటించిన చిత్రాలు ఆడవు అని ముద్ర వేశారు. అందుకు నేనేమీ మనోధైర్యాన్ని కోల్పోలేదు. సడలని ఆత్మవిశ్వాంతో పోరాడాను. ఫలితం ఇటీవల నేను నటించిన చిత్రాలు విజయాలు సాధించాయి. ఇప్పడు తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు వరుస కడుతున్నాయి. నన్నిప్పుడు అదృష్ట నటి అని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. రేపు చిత్రాలు ఆడకపోతే మళ్లీ ఐరన్ లెగ్ నటి అంటారు. నిజం చెప్పాలంటే నేనీ స్థాయికి రావడానికి చాలా శ్రమించాను. ఎంతో కష్టపడ్డాను కూడా. అయితే సక్సెస్ నా తలకెక్కదు. ఇటీవల అపజయం పాలైన పలు చిత్రాల్లో నన్నే నటించమని అడిగారు. కథలు నచ్చకపోవడంతో తిరస్కరించాను. నేనిప్పుడు మంచి కథలను ఎంపిక చేసుకునే పరిపక్వత పొందాను. ఇంకా చెప్పాలంటే నేను అదృష్టాన్ని నమ్మను. శ్రమనే నమ్ముతాను. కఠిన శ్రమకు కాస్త ఆలస్యం అయినా ఫలితం కచ్చితంగా దక్కుతుంది. చిత్ర విజయానికి హీరోహీరోయిన్లు, దర్శకులు, సాంకేతిక వర్గం అంటూ సమష్టి కృషే కారణం అవుతుంది.
ముఖ్యంగా దర్శకుడిలో ప్రతిభ లేకుంటే చిత్రం ఆడదు. నా గ్లామర్ రహస్యం గురించి అడుగుతున్నారు. పండ్లు, కాయగూరలు అధికంగా తింటాను. శారీరక కసరత్తుల కోసం సొంతంగా జిమ్ ఏర్పాటు చేసుకున్నాను. అనా«థ పిల్లల దత్తత, సామాజిక సేవకు కొంత సమయం కేటాయిస్తున్నాను. అలాంటి వారిని దత్తత తీసుకుని వారి విద్యాబాధ్యతలను స్వీకరిస్తున్నాను. భవిష్యత్తులో మరికొంతమంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలను చేపడతాను అని రకుల్ మానవత్వాన్ని చాటుకున్నారు.