అత్యాచార బాధితులకు అండగా రకుల్‌ప్రీత్‌సింగ్
రాబందుల్లాంటి వారి రాక్షసత్వానికి బలైన ఆడపడుచులను ఆదుకోవడానికి తనవంతుగా ముందుకొస్తున్నారు నటి రకుల్ ప్రీత్‌సింగ్. సినీ తారల్లో చాలా మంది సామాజిక సేవకు ఉపక్రమిస్తున్న విషయం తెలిసిందే. నటి హన్సిక అనాథ బాలలను దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలను చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 34 మంది పిల్లల్ని దత్తత తీసుకుని వారి కోసం ఆశ్రమాన్ని నిర్మించే పనిలో ఉన్నారు. ఇక నటి త్రిష శునకాల సంరక్షణకు నడుం బిగించారు. నటి సమంత స్వచ్ఛంద సేవా సంస్థను నెలకొల్పి పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
నటి నమిత తన సొంత ఖర్చులతో స్త్రీలకు మరుగుదొడ్లు కట్టించారు. ఇదే కోవలో తాజాగా నటి రకుల్ ప్రీత్‌సింగ్ తన వంతు సామాజిక సేవ చేయడానికి సిద్ధమవుతున్నారు. కోలీవుడ్‌లో పెద్దగా రాణించకపోరుునా, టాలీవుడ్‌లో క్రేజీ నాయకిగా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ అత్యాచారాలకు గురైన అభాగ్యపు అమ్మారుులకు తగిన సాయం అందించడానికి నడుం బిగించారు. వారి కోసం నిధిని సేకరించడానికి తను బహిరంగ వేదికపై వివిధ భంగిమల్లో కసరత్తులను చేయనున్నారు.
ఈ నెల 20వ తేదీన జరగనున్న రకుల్ ప్రీత్ వ్యాయామాల కార్యక్రమానికి హైదరాబాద్‌లోని క్రీడామైదానం వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో రకుల్‌ప్రీత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారని సమాచారం. సహృదయంతో రకుల్ తలపెడుతున్న ఈ నిధి సేకరణ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం.