బాహుబలి హద్దులు చెరిపేసింది : రామ్ చరణ్
బాహుబలి 2 సినిమాకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ స్టార్స్ బాహుబలి యూనిట్పై అభినందనల జల్లు కురిపిస్తుండగా, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా స్పందించాడు. మంగళవారం రాత్రి చిరంజీవి, రామ్ చరణ్లు బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ చూసిన తరువాత చరణ్ తన సోషల్ మీడియా పేజ్లో స్పందించాడు. బాహుబలి నిజంగా ఇండియాస్ బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న చరణ్, రాజమౌళి ఊహ, విజువలైజేషన్లు సినిమా మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయన్నాడు.
ఒక గొప్ప సినిమా అన్ని రకాల హద్దులను చెరిపేస్తుందని మరోసారి రుజువైందని, బాహుబలి ఫిలింమేకర్స్కు ఇన్సిపిరేషన్ అంటూ కీర్తించాడు.నటీనటులపై కూడా అదే స్థాయిలో స్పందించాడు చరణ్. డార్లింగ్ ప్రభాస్ బాహుబలిగా అద్భుతంగా కనిపించాడు, నటించాడు. నా మిత్రుడు రానా తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ల నటన కట్టిపడేస్తుంది అంటూ తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేశాడు.