
శతచండీ యాగంలో రాంచరణ్ దంపతులు
పూర్ణాహుతి, హోమం నిర్వహణ మహాదేవునికి అభిషేకాలు
దోమకొండ: నిజామాబాద్ జిల్లా దోమకొండ గడికోటలోని మహాదేవుని ఆలయంలో జరిగిన మహారుద్ర శత చండీయాగంలో గురువారం ప్రముఖ సినీహీరో రాంచరణ్‌తేజ పాల్గొన్నారు. పది రోజులుగా జరుగుతున్న చండీయాగం ముగింపు కార్యక్రమం, పూర్ణాహుతి గురువారం నిర్వహించారు. దీనికి రాంచరణ్‌తేజ తన భార్య ఉపాసనతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. దాదాపు గంటపాటు ఆయన పూర్ణాహుతి, మహారుద్ర శతచండీ యాగంలో పాల్గొని పూజలు చేశారు. మహాదేవుని ఆలయంలో ప్రత్యేకంగా శివుడికి రుద్రాభిషేకం చేశారు. యాగం ముగింపులో పాల్గొని పూజలు చేయడం సంతోషంగా ఉందని రాంచరణ్ తెలిపారు.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 మంది పండితులు ఈ యాగంలో పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు గడికోట వారసులైన రిటైర్డ్ ఐఏఏస్ అధికారి కామినేని ఉమాపతిరావు, ఆయన భార్య పుష్పమ్మ, అపోలో ఆస్పత్రుల డెరైక్టర్ శోభన, జాతీయ అర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి కామినేని అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచరణ్ దోమకొండ గ్రామ పంచాయితీ వారికి 16 చెత్త బండ్లను పంపిణీ చేశారు. గ్రామ అభివృద్ధికి తమవంతు సహకారం అందజేస్తామన్నారు.