దర్శకుడంటే వాళ్లిద్దరే గుర్తొస్తారు
– రామ్‌చరణ్
‘‘దర్శకుడు అనే మాట వినగానే నాకిద్దరు గుర్తొస్తారు. ఒకరు... లెజెండ్ దాసరిగారు. ఇంకొకరు... రాఘవేంద్రరావుగారు. వీళ్లిద్దరి బ్లెస్సింగ్స్ లేకుండా ఏ దర్శకుడూ పైకి రాలేరు. వీరిని చూసి దర్శకులంతా స్ఫూర్తి పొందుతుంటారు. నా మాటలతో దర్శకులందరూ ఏకీభవిస్తారనుకుంటున్నా’’ అన్నారు రామ్‌చరణ్. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి నిర్మించిన సినిమా ‘దర్శకుడు’.
సాయికార్తీక్ సంగీతమందించిన ఈ సినిమా పాటల సీడీలను విడుదల చేసిన అనంతరం రామ్‌చరణ్ మాట్లాడు తూ – ‘‘తక్కువ రోజుల్లో నాకు నచ్చేసిన వ్యక్తి సుకుమార్. నా అభిమాన దర్శకుడు. ఆయన బ్రెయిన్ వెళ్లే స్పీడు, ఐడియాలు వచ్చే తీరు సూపర్బ్. ఆ ఐడియాలన్నిటినీ డైరెక్ట్ చేయాలంటే... ఒక్క లైఫ్ టైమ్ చాలదు. మంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి కొత్త దర్శకులను, నటులను పరిచయం చేస్తున్నారు. ‘ఖైదీ నంబర్ 150’తో నేను నిర్మాతనయ్యా. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చేస్తు న్నా. నిర్మాత టెన్షన్లు నాకు తెలుసు. వాటిని పక్కనపెట్టి మా ‘రంగస్థలం’ను ఎంతో బాగా చేస్తున్నారు.
సుకుమార్ రాస్తే అందులో లవ్ లేకుండా ఉండదు. ఆయన తొలి సినిమా నుంచి ఇప్పటివరకు... ఈకాలం సినిమా రాసినా, 1980 నేపథ్యంలో ‘రంగస్థలం’ లాంటి సినిమా రాసినా స్ట్రాంగ్ లవ్ పాయింట్ ఉంటుంది. ‘దర్శకుడు’కు ఆ లవ్ పాయింట్ ప్లస్ అవుతుంది. సాయికార్తీక్ పాటలు బాగున్నాయి. అతనితో పని చేయాలనుంది’’ అన్నారు. చిత్రసమర్పకులు సుకుమార్ మాట్లాడుతూ– ‘‘సిల్వర్‌స్పూన్‌తో పుట్టిన చిరంజీవిగారబ్బాయి. తనతో ఎలా మాట్లాడాలి? ఎలా డీల్ చేయాలి? షూటింగ్‌లో ప్రాబ్లమ్ అవుతుందేమోన నుకున్నా. ఐశ్వర్యంతో పుట్టినా... తను మట్టి మనిషి.
డౌన్ టు ఎర్త్. నేను మ్యాథ్స్ లెక్చరర్ అయితే... హరిప్రసాద్ ఫిజిక్స్ లెక్చరర్. మానసికంగా నేను డౌన్‌లో ఉన్నప్పుడు నన్నెంతో సపోర్ట్ చేశాడు. నా కథల వెనక తన సపోర్ట్ ఉంది. ఒక్క సినిమాకు కూడా అసిస్టెంట్‌గా వర్క్ చేయకుండా ఈ సినిమాను బాగా తీశాడు. దేవిశ్రీప్రసాద్ కాకుండా మరో సంగీత దర్శకుడితో పని చేయడం ఇదే మొదటిసారి. దేవి లేకుండా సినిమా చేయడం సాహసమే. అటువంటి టైమ్‌లో సాయికార్తీక్ కనిపించాడు.ఈ పాటలు విన్న చరణ్ ‘ఎవరీ మ్యూజిక్ డైరెక్టర్’ అనడిగాడు.
సాయికార్తీక్ అంత మంచి పాటలు ఇచ్చాడు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే... చరణ్ ఎనిమిదేళ్లు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాడు’’ అన్నారు. ‘‘సరదాగా ఓ కథ రెడీ చేసి సుకుమార్‌కి చెప్పా. ‘నువ్వే డైరెక్ట్ చేసేయ్’ అన్నారు’’ అన్నారు హరిప్రసాద్ జక్కా. ‘‘నేను నటుడు కావాలని, హరిప్రసాద్‌గారు దర్శకుడు కావాలని అనుకోలేదు. మూడేళ్ల క్రితం ఏం కుట్టిందో తెలీదు. ఆయన నన్ను నటుణ్ణి చేయాలనుకున్నారు’’ అన్నారు అశోక్. పలువురు సినీప్రముఖులతో పాటు చిత్రబృందం పాల్గొన్నారు.
‘‘మనకు నచ్చిన వ్యక్తుల గురించి మనం రోజు మాట్లాడుకోం. మన అమ్మ గురించి మనం రోజూ మాట్లాడుకోం. ఆవిడ పక్కనుంటే, మనసులో ఉంటే చాలు. మాటల్లో కాదు. నా ఫ్యామిలీ అనేది నా మనసులో ఎక్కువుంటుంది. నా మాటల్లో తక్కువుంటుంది. ప్లీజ్... అర్థం చేసుకోండి’’
– ‘దర్శకుడు’ ఆడియో వేడుకలో ‘బాబాయ్’ అని అరుస్తున్న అభిమానులను ఉద్దేశించి రామ్‌చరణ్.