సుకుమార్ మాట నిలబెట్టుకున్నాడు
‘‘హీరోల యాటిట్యూడ్, ఆలోచనలు, క్యారెక్టరైజేషన్ వల్ల సుకుమార్ సినిమాలకు కొత్తదనం వస్తుంది. ‘ఆర్య’లో ఆర్య, ‘100% లవ్’లో బాలు, ‘1 నేనొక్కడినే’లో గౌతమ్, ‘నాన్నకు ప్రేమతో’లో అభిరామ్... ప్రతి పాత్ర కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో హీరో పాత్ర కూడా అంతే కొత్తగా ఉంటుంది’’ అన్నారు నిర్మాత థామస్‌రెడ్డి ఆదూరి.
అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలసి సుకుమార్ నిర్మించిన ‘దర్శకుడు’ ఆగస్టు 4న విడుదల కానుంది. బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘సుకుమార్ నా తమ్ముడే. చిన్నప్పట్నుంచి దర్శకుడు కావాలనుకున్నాడు. ఓ రోజు ‘నేను దర్శకుడు అయితే నిన్ను నిర్మాతను చేస్తా’ అన్నాడు. ‘దర్శకుడు’తో తన మాట నిలబెట్టుకున్నాడు. హరిప్రసాద్ మాకు పదిహేనేళ్లుగా తెలుసు.
ఓ దర్శకుడి ప్రేమకథే ఈ సిన్మా. నాకు తెలిసి ప్రపంచంలో 18 ప్రేమకథలే ఉన్నాయి. తెరపై వాటిని వైవిధ్యంగా ఆవిష్కరించిన వారు విజయాలు అందుకుంటున్నారు. ఆ జాబితాలో మా సినిమా ఉంటుంది. కుటుంబమంతా కలసి చూసే చిత్రమిది’’ అన్నారు. ‘‘కొత్త పాయింట్‌తో, ప్రేక్షకుల్ని టచ్ చేసే సినిమాలు తీయాలని సుకుమార్‌గారు ‘సుకుమార్ రైటింగ్స్’ సంస్థ స్థాపించారు. ఆయన ఆలోచనలకు తగ్గ చిత్రమిది. భారీ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన మాకు అవసరమైన సలహాలు ఇస్తున్నారు. ఇందులో దర్శకులు, చిత్రపరిశ్రమపై సెటైర్స్ లేవు. కొన్ని సీన్లను నిజజీవిత సంఘటనల స్ఫూర్తిగా రాశారు’’ అన్నారు థామస్‌రెడ్డి.