'బ్రూస్ లీ' మూవీ రివ్యూ | Ramcharan Srinu vaitla Bruclee Review | Sakshi
Sakshi News home page

'బ్రూస్ లీ' మూవీ రివ్యూ

Published Fri, Oct 16 2015 8:41 AM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM

'బ్రూస్ లీ' మూవీ రివ్యూ

'బ్రూస్ లీ' మూవీ రివ్యూ

టైటిల్: బ్రూస్ లీ
జానర్: ఫ్యామిలీ యాక్షన్ డ్రామా
తారాగణం:  రామ్ చరణ్, చిరంజీవి (అతిథి పాత్ర), రకుల్ ప్రీత్ సింగ్, కృతీకర్బందా
దర్శకత్వం:  శ్రీనువైట్ల
సంగీతం:  ఎస్ ఎస్ థమన్
నిర్మాత: డివివి దానయ్య

గోవిందుడు అందరివాడేలే సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ మరోసారి ఫ్యామిలీ డ్రామానే నమ్ముకొని చేసిన సినిమా బ్రూస్ లీ. మెగా అభిమానులకు నచ్చే మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్న ఈ సినిమా సక్సెస్ మీద చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ముఖ్యంగా చిరు గెస్ట్ అప్పియరెన్స్ కూడా సినిమా మీద అంచనాలను భారీగా పెంచింది. ఆగడు లాంటి డిజాస్టర్ తరువాత శ్రీను వైట్ల తనని తాను ప్రూవ్ చేసుకోవటానికి తెరకెక్కించిన సినిమా బ్రూస్ లీ. ఇలా అన్ని రకాలుగా భారీ అంచనాలు ఉన్న బ్రూస్ లీ ఆడియన్స్ను  ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ:
చిన్నప్పటి నుంచి బ్రూస్ లీ యాక్షన్ చూసి ఆకర్షితుడైన హీరో కార్తీక్ (రామ్ చరణ్) తన పేరును కూడా బ్రూస్ లీగా మార్చేసుకుంటాడు. కార్తీక్ది అందమైన కుటుంబం అమ్మ (పవిత్ర లోకేష్), నాన్న రామచంద్రరావు (రావు రమేష్), అక్క (కృతి కర్బందా). కార్తీక్ తండ్రి, జయరాజ్ (సంపత్), వసుంధర (నదియా)కు చెందిన వసుంధర ల్యాబ్స్లో పనిచేస్తుంటాడు. అదే సమయంలో కార్తీక్ కూడా స్టంట్ మాస్టర్గా పనిచేస్తూ తండ్రికి సహాయపడుతుంటాడు. వీడియో గేమ్ డెవలపర్ రియా (రకుల్ ప్రీత్ సింగ్)కు పోలీస్నే పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే అదే సమయంలో కార్తీక్ను చూసిన రియా తొలిచూపులోనే ఇష్టపడుతుంది. కార్తీక్నే హీరోగా పెట్టి ఓ గేమ్ డెవలప్ చేస్తుంది. అదే సమయంలో పోలీస్నే పెళ్లి చేసుకోవాలనే తన పిచ్చి వల్ల అనుకోని సమస్యలను ఎదుర్కొంటుంది. ఆ సమస్యల నుంచి రియాను కాపాడాలనుకున్న కార్తీక్... దీపక్ రాజ్ (అరుణ్ విజయ్) గ్యాంగ్తో గొడవ పడతాడు.

వసుంధర ల్యాబ్స్లో పనిచేస్తున్న రామచంద్రరావు కూతురు కృతిని ఆ కంపెనీ ఓనర్ జయరాజ్ తన కోడలిగా చేసుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో జయరాజ్కు సంబందించి కొన్ని నిజాలు బయటికి వస్తాయి. ఒకేసారి జయరాజ్, దీపక్ రాజ్ల నుంచి కార్తీక్ కుటుంబానికి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యల నుంచి కార్తీక్ అలియాస్ బ్రూస్ లీ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు, అసలు విలన్లతో బ్రూస్ లీకి ఉన్న శతృత్వం ఏంటి. అన్నదే మిగతా కథ.

నటీనటులు :
రామ్ చరణ్ ఈ సినిమాలో చాలా ఫ్రెష్ లుక్ లో కనిపించాడు. గత సినిమాల మాదిరిగానే డ్యాన్స్లు, ఫైట్లలో తన మార్క్ చూపించాడు. అయితే కొత్తగా కామెడీ ట్రై చేసిన చరణ్ మంచి విజయం సాధించాడు. నటనకు పెద్దగా అవకాశం లేకపోయినా రకుల్ తన అందాలతో మాత్రం బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా పాటల్లో రకుల్ చేసిన గ్లామర్ షో సినిమాకు బిగెస్ట్ ప్లస్ పాయింట్. చెర్రీ సిస్టర్గా కృతి ఆకట్టుకుంది. తన పరిధి మేరకు మెప్పించింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అరుణ్ విజయ్ చిన్న పాత్రే అయినా ఆకట్టుకున్నాడు. యంగ్ విలన్ గా మెప్పించాడు. బ్రహ్మనందం కామెడీ రొటీన్గా ఉంది. రావు రమేష్, పవిత్రా లోకేష్, సంపత్, నదియా, బ్రహ్మజీ, పోసాని కృష్ణమురళి మెప్పించారు.

సినిమాకు మెయిన్ హైలైట్ చిరు గెస్ట్ అప్పియరెన్స్, ఆరేళ్ల తరువాత మేకప్ వేసుకున్న చిరు ఏజ్ ఏ మాత్రం పెరగలేదా అనిపించాడు. పర్ఫార్మెన్స్లోనూ యాక్షన్ సీక్వన్స్లోనూ చెర్రీకి పోటీ ఇచ్చి 150 సినిమా మీద ఆశలు కల్పించాడు. ఇక 'జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్లో మాత్రం గ్యాప్ ఉండదు' లాంటి పంచ్లు విసిరిన చిరు 5 నిమిషాల పాటు థియేటర్లలో కేక పెట్టించాడు.

సాంకేతిక నిపుణులు :
ఆగడు తరువాత శ్రీను వైట్ల చేస్తున్న సినిమా కావటంతో రూట్ మార్చి కొత్త తరహా కథ చేస్తాడని భావించిన ఆడియన్స్కు నిరాశే కలుగుతుంది. మరోసారి రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీను. అయితే కథనంలో మాత్రం తన మార్క్తో ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ వరకు బాగానే సాగినా, సెకండాఫ్లో మాత్రం ఆడియన్ను కథతో కనెక్ట్ చేయలేకపోయారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తక్కువ టైంలోనే మంచి అవుట్ పుట్ ఇచ్చాడు మనోజ్ పరమహంస. పాటలు, నేపధ్య సంగీతం ఓ కమర్షియల్ సినిమాకు కావాల్సిన స్థాయిలో ఉన్నాయి. సెకండాఫ్ లో ఇంకాస్త ఎడిట్ చేసి ఉంటే బాగుండనిపించింది. ఫైట్స్ బ్రూస్ లీ అన్న టైటిల్ ను జస్టిఫై చేసేలా ఉన్నాయి.

విశ్లేషణ :
రొటీన్ కథ కథనాలకు కొత్త సాంకేతిక జోడించి తెరకెక్కించిన సినిమా బ్రూస్ లీ. క్వాలిటీ పరంగా మెప్పించినా, అభిమానులు ఆశించిన స్ధాయి సినిమాగా అలరించలేకపోయింది. ముఖ్యంగా సినిమాలో కీలకమైన ట్విస్ట్ను ఫస్టాఫ్లోనే రివీల్ చేయటంతో సెకాండఫ్ ఇంట్రస్టింగ్గా అనిపించదు. ఇక కామెడీతో పాటు సిస్టర్ సెంటిమెంట్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. కొన్ని పాత్రలకు సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోవటం కూడా సినిమాకు మైనస్. ఫస్టాఫ్ మాస్ ఆడియన్స్ను మెప్పించటంతో పాటు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా బాగా రావటంతో ఆడియన్స్ కాస్త సంతృప్తి పడతారు.


ప్లస్ పాయింట్స్:

చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్
చరణ్ ఫ్రెష్ లుక్
రకుల్ గ్లామర్
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్
కామెడీ ట్రాక్
ఎడిటింగ్

ఓవరాల్ గా బ్రూస్ లీ మెగా అభిమానులను మెప్పించే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement