హైదరాబాద్: వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ. అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప నటుడిని ఇడియట్ అనడం ఆయనకే చెల్లు. అండర్ వరల్డ్ తో తనకు సంబంధాలు ఉన్నాయని కూడా బహిరంగంగా చెప్పగలడు. అలాంటి రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు ఆత్మకథ రాశారు. అది కూడా మొత్తం సిద్ధమైపోయింది. పుస్తకం మాత్రం వచ్చే నెలలోనే విడుదలై మార్కెట్లను ముంచెత్తనుంది. ఈ విషయాన్ని స్వయంగా వర్మే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. పుస్తకం కవర్ పేజిని కూడా ఆయన చూపించారు. రూపా పబ్లికేషన్స్ అనే సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోందని తెలిపారు.
అందులోని కొన్ని చాప్టర్లలో... తాను అమితాబ్ బచ్చన్ ను ఇడియట్ అన్న విషయం, తన సినీ జీవితంలో తనకు అండర్ వరల్డ్ తోను, మహిళలతోను ఉన్న సంబంధాల గురించి కూడా ఉంటుందంటూ ఓ టీజర్ వదిలేశారు. ఇంకేముంది.. నెటిజన్లు దీనిపై రకరకాల వ్యాఖ్యలు చేశారు, చేస్తున్నారు. అసలు వర్మ ఓ ఐదు నిమిషాలు మాట్లాడితేనే సంచలనం అనుకుంటే.. ఆయన తన జీవితంలోని అన్ని విషయాలు, విశేషాలతో కలిపి ఆత్మకథ రాశారంటే అది ఇంకెంత సంచలనం అవుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.