
వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ!
కొన్ని బంధాలను అంత సులువుగా వదులుకోలేం. ఆ బంధం జీవితాంతం కొనసాగాలనుకుంటాం. ఒకవేళ మధ్యలో వదులుకోవాల్సి వస్తే, ఆ బాధ మామూలుగా ఉండదు. ప్రస్తుతం కత్రినా కైఫ్ ఆ పరిస్థితిలోనే ఉన్నారని సమాచారం. రణ్‌బీర్ కపూర్ నుంచి విడిపోయాక ఈ బ్యూటీ చాలా బాధలో ఉన్నట్లున్నారు. వీలైతే ఈ మాజీ ప్రియుడితో నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ తాగాలనుకుంటున్నారని ‘జగ్గా జాసూస్’ చిత్రబృందం అంటోంది.
ప్రస్తుతం ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం షూటింగ్ లొకేషన్‌లో ఇటీవల కత్రినా విచిత్రంగా బిహేవ్ చేశారట. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పగానే, ఇంటికి వెళ్లకుండా కొంతమందితో మాటలు కలిపారట. సరిగ్గా రణ్‌బీర్ కారు స్టార్ట్ చేస్తున్న సమయంలో, దానికి అడ్డంగా నిలబడి కబుర్లు మొదలుపెట్టారని సమాచారం.
కారు వెళ్లే దారి లేక చాలాసేపు రణ్‌బీర్ తన వాహనంలోనే కూర్చుండిపోయారట. అతను దిగి వచ్చి, తనను జరగమంటాడనీ, ఆ విధంగా మాటలు కలపొచ్చనీ కత్రినా భావించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. కానీ, రణ్‌బీర్ అలాంటి ప్రయత్నం చేయకపోవడంతో చేసేదేం లేక కత్రినానే అక్కణ్ణుంచి వెళ్లారట. సో.. కత్రినా నుంచి విడిపోయిన రణ్‌బీర్ తన పని తాను చూసుకుంటుంటే.. కత్రినా మాత్రం ఇంకా అతనితో అనుబంధాన్ని కోరుకుంటున్నారేమో.