‘బాజీరావ్’ రణ్‌వీర్, 'మస్తానీ' దీపికా!
‘బాజీరావ్’ రణ్‌వీర్, 'మస్తానీ' దీపికా!
Published Fri, Mar 7 2014 5:01 PM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించబోయే ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంపై బాలీవుడ్లో ఈ మధ్య చర్చ ఎక్కువగానే జరుగుతోంది. 1720లో నాలుగవ మరాఠా చత్రపతి షాహుకు ప్రధానిగా సేవలందించిన బాజీరావు పీష్వా, ఆయన ప్రేయసి మస్తానీ జీవిత, ప్రేమకథా నేపథ్యంగా ఈ చిత్రాన్ని భన్సాలీ రూపొందించేందుకు గత 15 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. తొలుత ’హమ్ దిల్ దే చుకే సనమ్’ చిత్రంలో నటించిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్‌లతో చిత్రాన్ని నిర్మించాలని భావించారు. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం తెర రూపం దాల్చలేదు. కాని భన్సాలీ తన ప్రయత్నాలను ఆపలేదు.
తాజాగా మళ్లీ బాజీరావు మస్తానీ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దమవుతున్నారు. ఈ చిత్రంలో నటింప చేసేందుకు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో సంప్రదింపుల జరిపినట్టు.. రణవీర్ కూడా ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం రణవీర్ గుండుతో నటించడానికి ఒప్పుకున్నారట. ఈ వార్తను రణ్‌వీర్ మేనేజర్ ధృవీకరించినప్పటికి అధికారికంగా వెల్లడించడానికి నిరాకరించారు.
బాజీరావు పాత్ర కోసం బాలీవుడ్ అగ్రహీరోలు షారుక్ ఖాన్, అజయ్ దేవగన్, హృతిక్ రోషన్‌లను పరిగణనలోకి తీసుకున్నారు. అయితే ఇటీవల రామ్‌లీలా చిత్రంలో రణ్‌వీర్పెర్ఫార్మెన్స్‌కు ఇంప్రెస్ అయిన భన్సాలీ తాజా కండలవీరుడుతో ఫిక్స్ అయినట్టు సమాచారం. అయితే మస్తానీ పాత్రలో కూడా దీపికా పదుకొనే నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్ని కుదిరితే ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్దమవుతోంది.
Advertisement
Advertisement