నాకంటే ఆయనే క్యూట్‌ : రష్మిక | Rashmika Mandanna Cute Reply About Vadivelu | Sakshi
Sakshi News home page

నాకంటే ఆయనే క్యూట్‌ : రష్మిక

Published Thu, Feb 27 2020 11:21 AM | Last Updated on Thu, Feb 27 2020 11:45 AM

Rashmika Mandanna Cute Reply About Vadivelu - Sakshi

చెన్నై : నాకంటే ఆయనే ఎంతో క్యూట్‌ అంటోంది హీరోయిన్‌ రష్మిక మందన. శాండిల్‌వుడ్‌ నుంచి టాలీవుడ్, కోలీవుడ్‌ అంటూ దక్షిణాదిని చుట్టేస్తున్న ఈ అమ్మడు వరుస విజయాలతో దూసుకుపోతోంది. గీతగోవిందం ఫీవర్‌ తగ్గకముందే ఈ మధ్య మహేశ్‌బాబుతో నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది రష్మిక. తాజాగా నితిన్‌తో రొమాన్స్‌ చేసిన భీష్మతో మరో హిట్‌ను అందుకుంది. ఇలా వరుస విజయాలతో మంచి జోరు మీదున్న ఈ కన్నడ భామ పారితోషికాన్ని కోటికి పైగా పెంచేసి నిర్మాతలకు దడ పుట్టిస్తుందనే ప్రచారం ఒక పక్క జరుగుతోంది. ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్న రష్మిక తరచూ ప్రచారంలో ఉండే ప్రయత్నాలను మాత్రం మిస్‌ కావడం లేదు. భీష్మ చిత్ర హిట్‌ హాంగోవర్‌లో ఉన్న ఈ భామ ఇటీవల  ప్రత్యేకంగా ఫొటో సెషన్‌ ఏర్పాటు చేసుకుని రకరకాల భంగిమల్లో ఫొటోలు దిగింది. 

అయితే అవి సాధారణానికి భిన్నంగా ఇంతకు ముందు హాస్య నటుడు వడివేలు పోజుల మాదిరి ఉండడం విశేషం. ఈ అమ్మడు ఆయన చిత్రాలను చూసి అలాంటి భంగిమల్లో ఫొటోలు తీసుకుందా అని అనిపించేలా ఉన్నాయి. దీంతో నెటిజన్లు రష్మిక ఫొటోల పక్కన అలాంటి భంగిమలతో ఉన్న నటుడు వడివేలు ఫొటోలను పోస్ట్‌ చేసి మీమ్స్‌ చేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ మీమ్స్‌ నటి రష్మిక దృష్టిలో పడ్డాయి. దీంతో ఆమె స్పందిస్తూ “నేను ఒప్పుకోను. నాకంటే వడివేలు చాలా క్యూట్‌గా ఉన్నారు’ అని పేర్కొంది. ఇకపోతే సినిమాలో క్లోజ్‌ ఫ్రెండ్‌ ఎవరంటే ఏం చెబుతారు అన్న ప్రశ్నకు తనకు తెలుగు నటుడు నితిన్‌ మంచి ఫ్రెండ్‌ కావాలని కోరుకుంటున్నాననీ, అదే విధంగా నటుడు విజయ్‌ అంటే చాలా ఇష్టం అనీ చెప్పింది. ఆయనతో నటించాలన్న కోరిక చాలా కాలంగా ఉందని అంది. ఎలాంటి భర్త కావాలనుకుంటున్నారన్న ప్రశ్నకు బదులు దాటేసిన రష్మిక తమిళ నటుడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పింది.


దీంతో  ఈ అమ్మడు  కోలీవుడ్‌ నటుడెవరితోనైనా ప్రేమలో పడిందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. కాగా  నటి రష్మిక ఇప్పటికే శాండిల్‌వుడ్‌ నటుడితో ప్రేమాయణం జరిపి, ఆ తరువాత అతనితో బ్రేకప్‌ చేసుకుందన్నది గమనార్హం. ఇకపోతే ఇప్పటికే ఈ అమ్మడు కోలీవుడ్‌లో నటుడు కార్తీతో సుల్తాన్‌ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఆయన సోదరుడు సూర్యకు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. హరి దర్శకత్వంలో సూర్య నటించనున్న చిత్రంలో నటి రష్మిక ఆయనకు జంటగా నటించనుంది. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇక తెలుగులోనూ ఈ అమ్మడు స్టార్‌ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement