
2 మినిట్స్ యాగీ..!మ్యాగీ మాయ
‘‘రకరకాల బ్రాండ్స్‌కు ప్రచారం చేస్తున్నప్పుడు స్టార్స్ కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిందే! లక్షల మంది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని తెలిసీ కొంతమంది స్టార్స్ పాన్‌మసాలాలు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, ఆల్కహాల్ ఉత్పత్తులకు ఎలా ఎండార్స్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మరికొన్ని కోట్లు సంపాదన కోసం అలా ఎలా జనాన్ని తప్పుదోవ పట్టిస్తాం’’ అంటున్నారు ప్రముఖ నటి రవీనా టాండన్. 1990లలో కథానాయికగా ఉత్తరాది తెరను ఉర్రూతలూగించడంతో పాటు అడపా దడపా మన తెలుగుతో సహా దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు రవీనా.
ఇప్పుడు సినిమాకి కీలకంగా నిలిచే పాత్రలు చేస్తున్నారు. సినిమాల సంగతెలా ఉన్నా, వాణిజ్య ప్రకటనల్లో మాత్రం తరచూ తెరపై మెరుస్తున్నారు రవీనా. దాదాపు డజను ఉత్పత్తులకు ఆమే ప్రచారకర్త. తాజా ‘మ్యాగీ’ నూడుల్స్, ఆ ఉత్పత్తులకు ప్రచారం చేసిన తారలపై వివాదం నేపథ్యంలో ఈ ఎండార్స్‌మెంట్ల గురించి కదిలిస్తే, రవీనా టాండన్ కాస్తంత ఘాటుగానే స్పందించారు. అది ఆమె మాటల్లోనే...
ఓ ఉత్పత్తి నాణ్యత ఏ పాటిదో నిర్ణయించి, దాన్ని మార్కెట్లో అమ్మడానికి అనుమతినిచ్చేది ప్రభుత్వమే. కొన్ని ఆహార పదార్థాలను ప్రభుత్వమే ఆమోదించినప్పుడు, మేము ప్రచారకర్తలుగా చేస్తే అందులో తప్పేముంది?
‘మ్యాగీ’ వ్యవహారంలో దానికి ప్రచారకర్తలుగా వ్యవహ రించిన స్టార్స్ మీద కేసులు వేయడం సరైన పని కాదు. దాదాపు 25, 30 ఏళ్లుగా మ్యాగీ మార్కెట్లో ఉంది. ప్రభుత్వ ఆమోదంతోనే ఆ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. మరి, ఇన్నేళ్లూ దాని నాణ్యత గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ప్రభుత్వమే ఆమోదించింది కాబట్టి, తారలు కూడా ప్రమోట్ చేశారు.
తీరా, ఇప్పుడు హఠాత్తుగా నిద్ర లేచి, ఆ ఉత్పత్తుల్లో నాణ్యత లేదంటూ, మమ్మల్ని నిందిస్తే మేమేం చేస్తాం?
పదిహేడేళ్ళ వయసులోనే వాణిజ్య ప్రకటనల్లో నటించడం మొదలుపెట్టా. తొలిరోజుల్లో ఒక్కో యాడ్‌కీ నాకు దక్కిన పారితోషికం ఐదువందల రూపాయలు. అప్పట్లో నేను ఏ ఉత్పత్తికి ప్రచారకర్తగా వ్యవహరించాలన్న దాని దగ్గర నుంచి ఆర్థిక లావాదేవీల దాకా అంతా మా నాన్నగారే చూసుకునేవారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా... సిగరెట్లు, మద్యం లాంటి అనారోగ్యకరమైన వాటికి నేనెన్నడూ ప్రచారం చేయలేదు.
అయినా ప్రచారం చేస్తున్న స్టార్‌కు అన్నీ ఎలా తెలుస్తాయి. త్వరలో ఓ ‘యోగర్ట్’ (పెరుగు) ఉత్పత్తికి ప్రచారకర్తగా వ్యవహరించనున్నా. తాజా పరిణామాల నేపథ్యంలో దాని నాణ్యత తెలుసుకోవాలనుకున్నా. ఆ ఉత్పత్తిదారులు నాకు ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చారు. కానీ, ఆ రిపోర్ట్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి నేనేం శాస్త్రవేత్తను కాదు కదా! అందుకని ఒక దశ దాటాక, ఉత్పత్తిదారులు చెబుతున్న మాటల్ని నమ్మాల్సి ఉంటుంది.
ఏమైనా ప్యాకేజ్డ్ ఫుడ్స్, టిన్ ఫుడ్స్ ఆరోగ్యానికి అంత మంచివి కావు. మార్కెట్లోకి ఇవి రావడం మొదలయ్యాకే ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని నా ఫీలింగ్. కానీ, ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. సహజమైన ఆహారం తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఇది మంచి పరిణామం. కంపెనీ ఫేస్ వ్యాల్యూను బట్టి ఎవరమైనా నమ్మేస్తాం. కానీ, ఇక నుంచి నేను కూడా ఏ ఉత్పత్తికి ప్రచారం చేస్తున్నా మరింత జాగ్రత్త తీసుకోదలిచా!