420 రోజుల తర్వాత స్టార్ట్ చేశాడు!
సరిగ్గా 420 రోజులు... ‘బెంగాల్ టైగర్’ విడుదలై నిన్నటికి 420 రోజులు! ఆ సినిమా విడుదల తర్వాత ఏడాదికి పైగా విరామం తీసుకున్న మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా సెట్‌లో అడుగుపెట్టారు. సీన్ పేపర్ టచ్ చేశారు. తర్వాత డైలాగ్ చెప్పారు. మొత్తానికి షూటింగ్ స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండని దర్శకునిగా పరిచయం చేస్తూ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న సినిమా ‘టచ్ చేసి చూడు’. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర నిర్మాతల్లో ఒకరైన వల్లభనేని వంశీ క్లాప్ ఇవ్వగా, ఎడిటర్ గౌతంరాజు కెమేరా స్విచ్చాన్ చేశారు.
ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘శుక్రవారం చిత్రీకరణ మొదలైంది. హైదరాబాద్‌లో వారం రోజులకు పైగా షూటింగ్ చేసి, తర్వాత పాండిచ్చేరి వెళతాం. అక్కడ 25 రోజులు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. రవితేజ ఇమేజ్‌కి తగ్గట్టు వక్కంతం వంశీ మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ కథ తయారుచేశారు’’ అన్నారు. రాశీఖన్నా, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, స్క్రీన్‌ప్లే: దీపక్‌రాజ్, మాటలు: శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు, ఆర్ట్: రమణ వంక, కూర్పు: గౌతంరాజు, కెమేరా: ఎం. సుకుమార్, యాక్షన్: పీటర్ హెయిన్స్, సంగీతం: జామ్8.