
కాస్ట్యూమ్స్, మేకప్ అన్నీ ఆవిడవే!
కథానాయికగా పలు క్రేజీ బాలీవుడ్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న తాప్సీ తాజాగా మరో అవతారం ఎత్తారు. ‘పికు’ ఫేమ్ సుజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పింక్’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఢిల్లీ అమ్మాయిగా కనిపించనున్నారు. ఆమె సొంత ఊరు కూడా ఢిల్లీ కావడంతో తాప్సీ ఈ సినిమా చిత్రీకరణను ఎంజాయ్ చేస్తున్నారట. ఈ చిత్రం కోసం స్టయిలిస్ట్‌గా కూడా మారారు.
తన దుస్తుల డిజైనింగ్, మేకప్ విషయాల్లో తాప్సీకి దర్శకుడు స్వేచ్ఛ ఇచ్చేయడంతో చక్కగా ఢిల్లీలో తన నచ్చిన షాపింగ్ మాల్స్‌కు వెళిపోయి, హాయిగా షాపింగ్ చేస్తున్నారట. ‘‘నా జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర కావడంతో ఈ సినిమాలో నా మేకప్, లుక్ విషయంలో దర్శకుడు నాకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు. ఏ సినిమాకు రానీ అవకాశమిది’’ అని చెప్పారు. అన్నట్లు ఈ ‘పింక్’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.