ఆ విషయంలో బాధ ఉంది: అమితాబ్
న్యూఢిల్లీ: రాజకీయాల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం పట్ల తనకు విచారం ఉందని బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అన్నారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ కోరిక మేరకు 1984లో రాజకీయాల్లోకి వచ్చిన అమితాబ్.. అలహాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మూడేళ్ల తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
‘ఓట్ల కోసం ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చాలా హామీలు ఇచ్చాను. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోనందుకు నేను చాలా బాధ పడ్డాను. నాకు ఏదైనా విచారం ఉందంటే ఇదే. అలహాబాద్ నగర ప్రజలకు చాలా హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయాను. మాట నిలబెట్టుకునేందుకు నా వంతు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నేను రాజకీయాల్లోకి రావడం భావోద్వేగ నిర్ణయం. అయితే రాజకీయాల్లో భావోద్వేగాలకు చోటు లేదని నాకు తర్వాత తెలిసింది. దీంతో రాజకీయాల నుంచి తపుకున్నాన’ని అమితాబ్ బచ్చన్ వెల్లడించారు.
ప్రముఖ జర్నలిస్టులు శేఖర్ గుప్తా, బర్కాదత్ నిర్వహించిన ‘ది కఫ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మనదేశంలో రాజకీయాల గురించి సినిమా నటులు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితులు లేవని అమితాబ్ అభిప్రాయపడ్డారు.