హీరో సూర్యపై కేసు కొట్టివేత
తమిళసినిమా: నటుడు సూర్య, శరత్‌కుమార్‌లతో పాటు మరో 8మంది నటీనటులపై ఊటీ కోర్టులో నమోదైన కేసును బుధవారం చెన్నై హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2009లో ఓ సంతాప కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సూర్య, శరత్‌కుమార్, సత్యరాజ్, వివేక్, అరుణ్‌విజయ్, దర్శకుడు చేరన్, నటి శ్రీప్రియ వీరంతా తమ గురించి తప్పుగా రాశారంటూ విలేకరులను, వారి కుటుంబ సభ్యులను దూషించారు.
దీనిపై నీలగిరికి చెందిన మరియకుసై అనే విలేకరి ఊటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటీషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు 8మందిని కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అయితే వారు కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. దీంతో సూర్య, శరత్‌కుమార్ బృందం చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ముందు హైకోర్టు నటులపై అరెస్ట్ వారెంట్‌ను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా బుధవారం ఈ కేసు విచారణకు రాగా న్యాయమూర్తి ఎంవీ మురళీధరన్ ఇరువర్గాల వాదనలు విన్న తరువాత నటీనటులపై కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు వెల్లడించారు.