రజినీ, కమల్ జోక్యం చేసుకోవాలి
నడిగర్‌సంఘం వ్యవహారం రోజురోజుకు జటిలం అవుతోంది. ఇటు ప్రస్తుత సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, రాధారవి వర్గం, అటు నటుడు విశాల్ వర్గం మద్య పోటీతత్వం పెరిగిపోతోంది. ఎవరూ తగ్గేది లేదన్నట్టుగా వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. గెలుపుపై కూడా ఎవరికి వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వివాదం కోర్టు గుమ్మం ఎక్కింది. చెన్నై హైకోర్టు సంఘం ఎన్నికలపై స్టే విధించడంతో ఒక వర్గం పండగ చేసుకుంటుంటే మరో వర్గం కోర్టులో మరో పిటీషన్ వేయడానికి సిద్ధం అవుతోంది. సంఘం సభ్యులతో పాటు సినీ పరిశ్రమ వర్గాలు ఈ వ్యవహారం ఎటు వైపు దారి తీస్తుందోనంటూ కలత చెందుతున్నారని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు, నామ్‌తమిళర్ పార్టీ నేత సీమాన్ శనివారం తిరుచ్చిలో పాల్గొన్న ఒక కార్యక్రమంలో నడిగర్ సంఘం వ్యవహారంపై స్పందిస్తూ చిత్ర పరిశ్రమ మేలుకోరే నటులు కమలహాసన్, రజినీకాంత్‌లు జోక్యం చేసుకుని సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.