
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధికకు సర్జరీ జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని చెబుతూ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. కష్ట సమయంలో మహిళలు ఎలాంటి దృఢ సంకల్పంతో ఉండాలో ఆమె తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఆమె కాలికి తీవ్రమైన గాయం అయినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు దాని గురించి రాధికా ఎక్కడా స్పందించలేదు.
అయితే, తాజాగా రాధికా శరత్ కుమార్ తన గాయం గురించి ఇలా చెప్పారు. 'గత రెండు నెలలుగా చాలా బాధలు పడుతున్నాను. ఎవరూ నా వర్క్, నా గురించి మాట్లాడలేదు. రెండు సినిమాల్లో పనిచేస్తున్న సమయంలో నేను అధిక బరువు ఉన్న బ్లింకర్లు ధరించడం వల్ల నా మోకాలికి తీవ్రమైన గాయం అయింది. అప్పుడు నా మోకాలి వద్ద విపరీతమైన నొప్పి కలిగింది. నొప్పి నివారణ కోసం ఎన్నో మందులతో పాటు మోకాలి బ్రేస్, క్రయోథెరపీ వంటి వాటిని పాటించాను. కానీ, ఎలాంటి ఫలితం లేదు. తప్పని పరిస్థితిలో రెండు నెలల క్రితం సర్జరీ చేపించుకున్నాను.' అని ఆమె తెలిపారు. ప్రస్తుతం తాను బాగున్నట్లు కూడా చెప్పారు.
నొప్పి భరిస్తూనే సినిమా ఎలా పూర్తి చేశారని తన స్నేహితుడు ఒకరు ఆశ్చర్యపోయాడని రాధిక గుర్తుచేసుకున్నారు. ఆ నిర్మాతలు కృతజ్ఞతలు ఏమైనా చెప్పారా..? అని కూడా ఆ స్నేహితుడు అడిగినట్లు రాధిక చెప్పుకొచ్చారు. కానీ, తనకు కృతజ్ఞతలు వంటి వాటిని పట్టించుకోనని రాధిక చెప్పారు. అలాంటివి ఎప్పుడూ తాను ఆశించలేదని, ఉత్తమంగా పనిపై మాత్రమే దృష్టి పెడతానని ఆమె పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి స్త్రీ తనను తాను మరింతగా ప్రేమించుకోవాలని, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలని కోరుకుంటున్నట్లు ఆమె అన్నారు. ఇతరులు చూపే సింపతీ తీసుకోవద్దని తెలిపారు. అయితే, శస్త్రచికిత్స జరిగినప్పుడు తన భర్త శరత్ కుమార్ తనను చిన్నపిల్లలా చూసుకున్నారని ఆమె గుర్తుచేసుకున్నారు. తన జీవితంలో మూలస్థంభంలాంటి వ్యక్తి తన భర్తే అంటూ ఆమె చెప్పారు.