
కల్యాణ్‌గారి భార్య ఆనా... నేను కాదు!
నాలుగేళ్లుగా ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియాలో...
అందరికీ నమస్కారం...
నాలుగేళ్లుగా ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియాలో నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి వరుసగా అభ్యర్థనలు, విన్నపాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. నేను నా ఇంటర్వ్యూల్లో, సోషల్ మీడియాలో ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ఇవి ఆగడం లేదు. అందుకే మరోసారి చాలా స్పష్టంగా నా అభిప్రాయాన్ని చెప్పడానికి క్రింది పోస్ట్ పెడుతున్నాను. ‘‘మిత్రులకు, నా శ్రేయోభిలాషులందరికీ నమస్కారం...
మీరు నిరంతరం నా పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, నాకు అందిస్తున్న సహాయ సహకారాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా వ్యక్తిగత జీవితం గురించి మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. కల్యాణ్‌గారు నాలుగు సంవత్సరాల క్రితం ‘ఆనా’ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక చక్కటి కూతురు కూడా ఉంది. ఆయన వివాహ బంధాన్ని, ఆయన కుమార్తెకు జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ నేను మీకు చేసుకునే విన్నపం ఒక్కటే. నేను, కల్యాణ్‌గారు తిరిగి ఏకం కావాలని మీరు పదేపదే కోరుకోవద్దు. దయచేసి మీరు ఒక విషయం అర్థం చేసుకుని ఆమోదించాలి. అదేంటంటే కల్యాణ్‌గారి భార్య ‘ఆనా’... నేను కాదు.ఒకటి మాత్రం నిజం. ఆయన నా పిల్లలకు తండ్రి. నేనూ ఆయన మంచి స్నేహితులం మాత్రమే. కానీ మేమెప్పటికీ తిరిగి భార్యాభర్తలం కాలేము. ఈ సత్యాన్ని నేను మనసా, వాచా, కర్మణా అంగీకరిస్తున్నాను.
మీరు కూడా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నన్ను తిరిగి కల్యాణ్‌గారి దగ్గరకు వెళ్లమని మాటిమాటికీ మీరు కోరడం సబబు కాదని గుర్తించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరో వైవాహిక బంధంలో ఉన్న ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళడం అసమంజసం, అసాధ్యం, అర్థరహితం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. భవిష్యత్‌లో ఈ విషయమై ఎలాంటి ఇబ్బందులు కలిగించే ఒత్తిడితో కూడిన కోరికలేవీ మీ వద్ద నుంచి ఎదురు కావని ఆశిస్తున్నాను. ఎంతో నిజాయితీగా, మనస్ఫూర్తిగా మీకు నేను చేసిన ఈ విన్నపాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని, ఎప్పటిలా మీ నిర్మలమైన స్నేహ వాత్సల్యాలను అందిస్తారని కోరుకుంటూ...
‘ఫేస్‌బుక్’లో రేణూ దేశాయ్ ఇది పోస్ట్ చేసిన తర్వాత ‘మీరెంతైనా మా అన్న వైఫ్ కాబట్టి, మీ ఇద్దరూ కలవాలని కోరుకుంటాం. మిమ్మల్ని ఎప్పటికీ మా ‘వదిన’లానే భావిస్తాం’ అంటూ కొందరు కామెంట్స్ పోస్ట్ చేయడం విశేషం. అలాగే, ‘మీ పోస్ట్‌లో మీ బాధ తెలుస్తోంది’ అని మరికొందరు, ‘మీ నిర్ణయాన్ని గౌరవిస్తాం’ అని ఇంకొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.