ఆ రోజులను గుర్తుచేసుకున్న రేణు దేశాయ్‌.. | Renu Desai Share Memories With Badri Movie | Sakshi
Sakshi News home page

ఆ రోజులను గుర్తుచేసుకున్న రేణు దేశాయ్‌..

Published Mon, Apr 20 2020 12:25 PM | Last Updated on Mon, Apr 20 2020 12:50 PM

Renu Desai Share Memories With Badri Movie - Sakshi

పవన్‌ కల్యాణ్‌, రేణు దేశాయ్‌, అమీషా పటేల్‌ జంటగా నటించిన ‘బద్రి’ చిత్రం విడుదలై నేటికి 20 ఏళ్లు. ఈ చిత్రంతో పూరి జగన్నాథ్‌.. దర్శకుడిగా పరిచమయ్యారు. అప్పట్లో సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ మూవీలో డైలాగ్స్‌ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బద్రితో హీరోయిన్‌గా పరిచయమైన రేణు దేశాయ్‌.. తనకు ఈ చిత్రంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పుడు జరిగిన సంభాషణలు తనకు స్పష్టంగా గుర్తున్నాయని చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫొటోలు షేర్‌ చేసిన రేణు దేశాయ్‌.. అప్పుడు జరిగిన సంభాషణలను, ఘటనలను గుర్తుచేసుకున్నారు. కాగా, ఈ చిత్రం షూటింగ్‌ సమయంలోనే పవన్‌, రేణుల మధ్య ప్రేమ చిగురించిన సంగతి తెలిసిందే.


‘మేము మారుమూల ప్రాంతంలో షూట్‌ చేస్తున్నప్పుడు.. షూటింగ్‌ మధ్యలో కూర్చొవడానికి కనీసం కుర్చీలు కూడా లేవు. అప్పుడు నేను షార్ట్‌ స్కర్ట్‌ ధరించి ఉండటం వల్ల రాయిపై కూర్చోలేకపోయాను. అప్పుడు నేను ఒక అమ్మాయి మీ పక్కన నిలబడి ఉండగా.. మీరు కూర్చోవడం మంచి ప్రవర్తన కాదని కల్యాణ్‌ గారితో సరదాగా మాట్లాడుతున్నాను. ఆ ప్రాంతం షూటింగ్‌ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉండింది. బలమైన గాలులు వీచడంతో నేను నిలబడటానికి, డ్యాన్స్‌ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను.’-రేణు

‘మేము ఒక రోజు షూటింగ్‌ ముగించుకుంటున్న సమయంలో తీసిన ఫొటో ఇది. కల్యాణ్‌ గారు ఏ చికితా సాంగ్‌కు సంబంధించి తన పార్ట్‌ పూర్తిచేశారు. నేను ‘వరమంటే’ సాంగ్‌ పూర్తిచేశాను. ఆరోజు ఎండగా ఉండటం, లోకేషన్‌ చాలా దూరం నడవాల్సి ఉండటంతో  మేము చాలా అలసిపోయాం. ఆకలి, నీరసంతో మేమిద్దరం ప్రపంచాన్ని మరచిపోయాం.’-రేణు

‘మళ్లీ అదే లోకేషన్‌.. కానీ మరో రోజు షూటింగ్‌ సందర్భంగా తీసిన ఫొటో. ఇది జరిగి 20 ఏళ్లు అవుతుంది. కానీ అప్పుడు మేము మాట్లాడుకున్న సంభాషణ నాకు ఇప్పటికి స్పష్టంగా గుర్తుంది. ఇది నాకు చాలా ఇష్టమైన ఫొటో. నాకు చాలా హ్యీపీగా ఉంటుంది.. ఎందుకంటే మాకు ప్రైవసీ ఇస్తూ.. దూరం నుంచి మా ఫొటోగ్రాఫర్‌ ఈ ఫొటోను తీశారు.’-రేణు

అన్నా అంతా ద్వేషం ఎందుకు?
రేణు దేశాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో బద్రి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్న సమయంలో ఓ నెటిజన్‌ ఆమెను ఉద్దేశించి ఓ కామెంట్‌ చేశాడు. దీనిపై రేణు స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. ‘నాకు ఇప్పుడే ఈ మెసేజ్‌ వచ్చింది. అవసరమా?.. అవును.. అవసరం. మీకు తెలియకపోతే చెప్తున్నా.. బద్రీ వచ్చి ఇప్పటికి 20 ఏళ్లు. చాలా మంది మరచిపోతారు.. కావున ఈ మూవీ నాకు చాలా స్పెషల్‌. అంతా ద్వేషం ఎందుకు అన్నా?. ఈ వైరస్‌ వల్ల మనం ఒక సంక్షోంభంలో ఉన్నాం.అందరి కోసం మనం మంచి ఆలోచనలు పెట్టుకోండి. ఇంత కోపం మీ ఆరోగ్యానికి మంచిది కాదు’ అని పేర్కొన్నారు. మరోవైపు దర్శకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్‌కు కూడా పలువురు సినీ ప్రముఖులు విషెస్‌ తెలుపుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement