జ్ఞానోదయంతో ఎటాక్ తీశా..!
- రామ్‌గోపాల్‌వర్మ
‘‘‘శివ’ సినిమా తీసిన వాడు ఆ రేంజ్‌లో ఎందుకు సినిమాలు తీయడంలేదని చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రేక్షకులకు కావాల్సినట్టుగా సినిమా తీయాలని సి.కల్యాణ్ నాకు జ్ఞానోదయం చేశారు. అందుకే ఈ సినిమా చేశాను’’ అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. మంచు మనోజ్, ప్రకాశ్‌రాజ్, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘ఎటాక్’.
ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ‘‘రామ్‌గోపాల్‌వర్మగారికి నేను పెద్ద అభిమానిని. స్టోరీ చెప్పగానే బాగా నచ్చింది’’ అని మనోజ్ అన్నారు. ‘‘సినీ పరిశ్రమ అంతా రామూ గారి గురించి మాట్లాడుకోవాలని ఈ సినిమా తీశాం. ఈ నెలలోనే పాటలను, నవంబరులో చిత్రాన్ని విడుదల చేయనున్నాం. చాలా సెలైంట్‌గా ఎక్కువ ఖర్చుపెట్టి తీశాం’’ అని సి.కల్యాణ్ తెలిపారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సి.వి.రావు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.