జయ ఆత్మ సమాధి నుంచి రావడమే క్లైమాక్స్
జయలలిత సమాధి నుంచి లేచి రావడమే నా చిత్రక్లైమాక్స్ అంటున్నారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. జరుగుతున్న పరిణామాలపై తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించే వర్మ శశికళ, ఆమె కుటుంబం గురించి చాలా విషయాలను వెల్లడించారు. వర్మ ఇప్పటికే శశికళ జీవితంతో చిత్రం చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. జయలలిత, శశికళల మధ్య సంబంధాలను ఆ చిత్రంలో ఆవిష్కరిస్తానని తెలిపారు. తాజాగా అక్రమ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీరు్పతో బెంగళూరు జైలులో శిక్షను అనుభవిస్తున్న శశికళ అక్కడి జైలు అధికారులతో తాను చిన్న దొంగను కాను అని అన్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
దీనికి స్పందించిన దర్శకుడు వర్మ శశికళ తాను చిన్న దొంగను కాను అని అనడాన్ని చిల్లర దొంగలు, జేబుదొంగలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. దీని గురించి ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొంటూ ‘ఏది నేరం? బతకడం కోసం 600 దొంగిలించే జేబుదొంగలదా? ప్రజలు నమ్మకం పెట్టుకున్న వాళ్లు తమ ఉల్లాస జీవితం కోసం 60 కోట్లు కొట్టేసిన దొంగలదా’ అని ప్రశ్నించారు. తమిళనాడులో జరుగుతున్న భయంకర రాజకీయాలను తలచుకుంటే, ఓపీఎస్, ఈపీఎస్‌ల మధ్య జరుగుతున్న నాటకంతో సమాధిలో ఉన్న జయలలిత ఆత్మ శాంతిస్తుందా? అలా రాజకీయాలకు జయలలిత ఆత్మ సమాధి నుంచి లేచి రావడమే మంచి క్లైమాక్స్ అని వర్మ పేర్కొన్నారు.