'చూద్దాం ఎవరు నన్ను జైల్లో పెడతారో'
ముంబై: డెరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్‌సింగ్ రాంరహీం సింగ్‌ను అనుకరించి హాస్యం పండించినందుకు టీవీ నటుడు, కామెడియన్ కికు శార్దాను అరెస్టు చేయడంపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్రంగా ప్రతిస్పందించింది. కికు శార్దాకు అండగా నిలిచింది. తనను తాను 'రాక్‌స్టార్ బాబా'గా పేర్కొంటూ సినిమాలు చేస్తున్న గుర్మీత్‌సింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలీవుడ్ ప్రముఖులు రిషీ కపూర్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ వంటి వారు గుర్మీత్‌సింగ్ తీరును తప్పుబట్టారు.
కికు శార్దాకు మద్దతుగా బాలీవుడ్ అలనాటి హీరో రిషీకపూర్ ట్విట్టర్‌లో స్పందించారు. గుర్మీత్ సింగ్ ఫొటోను చూపిస్తూ 'ఈ ఫొటోను చూడండి. ఈ రాక్‌స్టార్ తరహాలో నేను సినిమాలో నటించాలనుకుంటున్నా. చూద్దాం నన్ను ఎవరు జైల్లో పెడతారో' అని ట్వీట్ చేశారు. ఆరో తరగతి పాసై.. ఎంఎస్‌జీ వంటి సినిమాలు తీసే గుర్మీత్ రాం రహీంను ఎందుకు అరెస్టు చేయలేదని అనురాగ్ కశ్యప్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఘోర కలియుగంలోనే ఇలాంటి దారుణాలు జరుగుతాయంటూ నెటిజన్లు కూడా కికు శార్దాను అరెస్టును తప్పుబడుతూ ట్వీట్ చేశారు. కామెడీ నైట్స్ విత్ కపిల్ షోతో ఫేమస్ అయిన కికు శార్దా తాను గుర్మీత్‌సింగ్‌ను అనుకరించడంపై క్షమాపణలు చెప్పారు. అయినా ఆయనను అరెస్టుచేసి.. బెయిల్‌పై విడుదల చేశారు. దీనిపై స్పందించిన గుర్మీత్‌సింగ్ కికు శార్దాను క్షమిస్తున్నట్టు తెలిపారు.
See this picture!I would like to play this rockstar in a film. Let me see who puts me behind bars? Go Kiku Sharda! pic.twitter.com/8Dfre237NY
— rishi kapoor (@chintskap) January 13, 2016