దుబాయ్‌లో దుమ్ము దుమారమే! | robo 2.0 audio release in dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో దుమ్ము దుమారమే!

Published Wed, Oct 25 2017 12:22 AM | Last Updated on Wed, Oct 25 2017 2:45 AM

robo 2.0 audio release  in dubai

తక్కువ కాదు... హాలీవుడ్‌ ఫిల్మ్స్‌కి రజనీకాంత్‌ ‘2.0’ ఏమాత్రం తక్కువ కాదు. తగ్గలేదు... బడ్జెట్‌ పరంగా (రూ. 400 కోట్లు) ‘2.0’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ఎక్కడా తగ్గలేదు. ‘2.0’ చిత్రదర్శకుడు శంకర్‌ అయితే... ఊహాల్లోనూ, విజువలైజేషన్‌లో ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌కి మనమేం తక్కువ అన్నట్టు సినిమా తీశారు! మరి, అటువంటి సినిమా ఆడియో ఫంక్షన్‌ జరిగితే ఎలా ఉండాలి? అమెరికన్, కొరియన్, జపనీస్, ఎక్ట్స్రా... సిన్మా జనాలు అందరూ రెండు కళ్లతో ‘2.0’ను వెంటనే చూసేయాలనేంత క్యూరియాసిటీ కలగాలి కదా! కరెక్టుగా అలానే ఈ శుక్రవారం దుబాయ్‌లో ‘2.0’ ఆడియో రిలీజ్‌ను  ప్లాన్‌ చేశారు. అదెలా జరుగుతుందంటే... దుమ్ము దుమారమే!!

‘2.0’ ఆడియోలో హైలైట్‌ కానున్న అంశాలు
►దుబాయ్‌లోని బుర్జ్‌ పార్క్‌లో ఆడియో వేడుక జరుపుకోనున్న సినిమాగా ‘2.0’ రికార్డులకు ఎక్కనుంది. దుబాయ్‌ గవర్నమెంట్‌ ‘2.0’ ఆడియో ఫంక్షన్‌కి పర్మిషన్‌ ఇచ్చింది.
►దుబాయ్‌లోని హోటల్‌ నుంచి బుర్జ్‌–అల్‌–అరబ్‌ (టవర్స్‌ ఆఫ్‌ ద అరబ్‌)కి రజనీకాంత్, ‘2.0’లో విలన్‌గా నటించిన హిందీ హీరో అక్షయ్‌కుమార్, దర్శకుడు శంకర్‌ హెలికాఫ్టర్‌లో చేరుకుంటారు. ఆడియో రిలీజ్‌కి ముందు ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ కూడా ఉంటుందని టాక్‌.
►చిత్రసంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఆడియో వేదికపై 125 మంది సింఫనీ సంగీత కళాకారులతో లైవ్‌ పర్ఫార్మెన్స్‌ ఇవ్వనున్నారు. పాటలకు కొరియోగ్రాఫర్‌ బాస్కో టీమ్‌ స్టెప్పులతో రెడీ.
►దుబాయ్‌లోని పలు షాపింగ్‌ మాల్స్‌లో ఆడియో లైవ్‌ ఇవ్వనున్నారు. అందుకోసం 2 కోట్ల రూపాయలతో చాలా చోట్ల ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
►ఆల్రెడీ 12 వేలమందికి ఆడియో ఫంక్షన్‌ పాసులను ఫ్రీగా ఇచ్చారు. 65 వేలకు కొంతమందికి పాసులను అమ్మారట! వాళ్లతో రజనీ, అక్షయ్, అమీ జాక్సన్‌ అండ్‌ టీమ్‌ డిన్నర్‌ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
►దుబాయ్‌ రాజు మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్టౌమ్, తమిళ నటుడు కమల్‌ హాసన్‌ ఈ వేడుకకు అటెండ్‌ అయ్యే అవకాశాలున్నాయట!

మనుషులకూ... రోబోలకూ...
ప్రపంచం మనుషులకు మాత్రమే కాదట! మరి, ఇంకెవరికి అంటే ‘రోబోలకు కూడా’ అట! ‘ద వరల్డ్‌ ఈజ్‌ నాట్‌ ఓన్లీ ఫర్‌ హ్యూమన్స్‌’ – ‘2.0’కి శంకర్‌ ఇచ్చిన క్యాప్షన్‌. అంటే... దానర్థం ఏంటి? రోబోలకూ అనేగా! ఇందులో హీరోయిన్‌ అమీ జాక్సన్‌ రోబోగా నటించారట! ‘రోబో’లో మనుషుల్ని రోబోలు ప్రేమిస్తే? ఎలా ఉంటుందనేది చూపించారు దర్శకుడు శంకర్‌. ‘2.0’లో రోబో మనుషుల్ని ప్రేమిస్తే? అనే కాన్సెప్టును చూపించబోతున్నారట! ఈ రోబోటిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌లో అక్షయ్‌ బర్డ్‌మ్యాన్‌/క్రౌమ్యాన్‌గా నటించిన సంగతి తెలిసిందే. మనిషిగా, రోబోగా రజనీకాంత్‌ ఐదు గెటప్పుల్లో కనిపించనున్నారట! మరి, మనుషులకూ, రోబోలకూ ప్రేమ మాత్రమేనా? యుద్ధం కూడా ఉంటుందా? వచ్చే జనవరి 25 వరకు వెయిట్‌ చేయాలి!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement