మూడురోజుల్లో రూ. 32 కోట్ల వసూళ్లు
చెన్నై: 'రుద్రమదేవి' సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లు రాబడుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే సుమారు రూ. 32 కోట్లు వసూలు చేసిందని సినీ ట్రేడ్ పండితుడు త్రినాధ్ వెల్లడించారు. ఇప్పటికే హిందీలోకి కూడా డబ్ అయిన ఈ హిస్టారికల్ మూవీ ఓవర్ సీస్లో మంచి ఓపెనింగ్స్ సాధించింది. మున్ముందు కలెక్షన్లు పెరుగుతాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఓపెనింగ్ వీకెండ్లో తెలుగులో మంచి లాభాలను ఆర్జిస్తున్న 'రుద్రమదేవి'కి విదేశాల్లోకూడా ఆదరణ లభిస్తోందంటున్నారు.
3డిలో తెరకెక్కిన తొలి తెలుగు చారిత్రాత్మక చిత్రం కావడంతో అన్ని చోట్లా ముందుగానే టికెట్లు బుక్ కావడంతో తెలుగులో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా 'రుద్రమదేవి' నిలిచింది. కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా 'రుద్రమదేవి'.
ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క లీడ్ రోల్లో నటించింది. గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రునిగా దగ్గుబాటి రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్య మీనన్ తదితరులు నటించారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయా రాజా సంగీతం అందించిన ఈ చిత్రం అక్టోబర్ 9న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. ఈ త్రీడి సెన్సేషనల్ మూవీ తమిళంలో శుక్రవారం విడుదల కానుంది.