rudramadevi movie
-
‘రుద్రమదేవి’ బాలనటి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
వెబ్ సిరీస్‌లలో ట్రెండింగ్‌లో ఉన్న సిరీస్.. తెలుగు ఆంథాలజీ ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’. అందులో నటించిన మహామహులు సుహాసిని, రేవతి.. నేటి స్టార్స్ నిత్యామీనన్, రీతూ వర్మలతో పాటుగా వినిపిస్తున్న పేరు ఉల్కా గగన్ గుప్తా. ఈ సిరీస్ కన్నా ముందే తెలుగు తెరకు ఆమె పరిచయం.. ‘ఆంధ్రాపోరి’ సినిమాతో. ఇంకొన్ని వివరాలు ఈ ‘కాలమ్’లో.. ఉల్కా పుట్టింది, పెరిగింది ముంబైలో. తల్లిదండ్రులు.. మంజు గుప్తా, గగన్ గుప్తా. తండ్రి కూడా నటుడే. నిజానికి ఉల్కా ఐఏఎస్ ఆఫీసర్ కాలనుకుంది. కానీ సినిమా రంగంతో సంబంధమున్న వాతావరణంలో పుట్టి, పెరగడంతో ఆమె ఆసక్తి, అభిరుచి నటనవైపు మళ్లింది. తన ఎనిమిదవ ఏట.. ‘రేషమ్ డంఖ్’ అనే టీవీ సిరియల్‌తో యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చింది. ‘రాణి లక్ష్మీబాయి’ సీరియల్లో చిన్నప్పటి లక్ష్మీబాయిగా నటించి దేశమంతా పాపులర్ అయింది. ఆ పాత్ర కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, సంస్కృతం నేర్చుకుంది. ఆ సీరియల్ తర్వాత క్షణం తీరికివ్వనన్ని అవకాశాలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టాయి. వాటిలో ఒకటి తెలుగులో వచ్చిన రుద్రమదేవి సినిమా కూడా. అందులో చిన్నప్పటి రుద్రమదేవిగా మెప్పించింది. ఓ వైపు చదువుకుంటూనే ఇంకో వైపు యాక్టింగ్ కెరీర్ కొనసాగించింది. హీరోయిన్గా వెండి తెరకు పరిచయం అయింది తెలుగు చిత్రం ‘ఆంధ్రాపోరి’తోనే. ఆ తర్వాతనే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది ‘ట్రాఫిక్’ అనే సినిమాతో. అటు సినిమాలు.. ఇటు టెలివిజన్ ప్రేక్షకులనే కాదు ఇప్పుడు వెబ్ స్క్రీన్ వీక్షకులనూ అలరిస్తోంది ఉల్కా. నటనంటే ప్రాణం. అందుకే ఏ పాత్రయినా సరే.. మనసుపెట్టి నటిస్తానంటోంది ఉల్కా. View this post on Instagram A post shared by Ulka (@ulkagupta) చదవండి: ఆ సంస్థకు భారీ మొత్తంలో డబ్బులిచ్చా.. సమంత షాకింగ్ కామెంట్స్ ఆ గ్యాప్‌లో నన్ను నేను తెలుసుకున్నాను -
నేను క్షేమంగానే ఉన్నా: దర్శకుడు
రుద్రమదేవి రైటర్ రాజసింహా తాను క్షేమంగా ఉన్నట్లు ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆయన కొంతకాలంగా సినిమాల్లో అవకాశాలు లేక డిప్రెషన్లో ఉన్నట్టు, ముంబైలోని తన రూంలో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు నిన్న వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమీ లేదంటూ సోషల్‌మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ‘నేను రాజసింహా. నేను క్షేమంగా ఉన్నాను. నాకు డయాబెటిక్ ఉంది. షుగర్ లెవల్ డౌన్ అవ్వడం, రాత్రి పక్కన ఎవరూ లేకపోవడంతో కాస్త సీరియస్ అయింది. నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను. నా గురించి కంగారు పడ్డ వాళ్లందరికి ధన్యవాదాలు. ఇంకో 2, 3 రోజుల్లో హైదరాబాద్ వస్తాను’ అంటూ వీడియోలో తెలిపారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఒక అమ్మాయి తప్ప సినిమాతో రాజసింహా దర్శకుడిగా పరిచయం అయ్యారు. శంకర్‌దాదా ఎంబీబీయస్, బొమ్మరిల్లు, ఝుమ్మందినాధం, అనగనగా ఓ ధీరుడు, రుద్రమదేవి సినిమాలకు రాజసింహా రచయితగా పనిచేశారు. సంబరం, నీ స్నేహం, టక్కరిదొంగ లాంటి సినిమాల్లో నటుడిగానూ కనిపించారు. జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన పలు చిత్రాలకు సెకండ్‌యూనిట్ దర్శకుడిగా పనిచేశారు. -
నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను
-
జరిగిన అన్యాయం అందరికీ తెలియాలి
‘‘జీవితారాజశేఖర్గారంటే నాకు గౌరవం. ఆవిడ ‘నంది’ అవార్డుల ప్రకటన అవగానే బయటికొచ్చి ‘చంద్రబాబునాయుడుగారు రాకింగ్.. తెలుగుదేశం రాకింగ్’ అన్నారు. ‘మీరు తెలుగుదేశంలో చేరబోతున్నారా? అని కొందరు అడిగితే.. వాళ్లు చేరమంటే ఎందుకు చేరను? అని ఆమె అన్నట్టుగా కొన్ని పేపర్లలో నేను చదివాను. ఇది చదివాక ఆమెపై నాకు విశ్వసనీయత పోయింది. అది పోయినప్పుడు మనం వాళ్ల మాటలని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తోంది’’ అని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నంది అవార్డులపై తన అభిప్రాయాలను చెప్పారు. వర్మగారిని నిందించడం తగదు దర్శకులు రామ్‌గోపాల్‌వర్మగారి మీద మరో దర్శకుడు మద్దినేని రమేశ్‌గారు చేసిన ఆరోపణలు, ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు సాటి దర్శకుడిగా బాధ కలిగించాయి. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన ఎందుకంత తీవ్ర పదజాలంతో వాడకూడని భాష వాడాల్సి వచ్చిందన్నదే నా బాధ. దాసరి నారాయణరావుగారి తర్వాత యువ దర్శకులందరికీ మంచి గుర్తింపు తీసుకొచ్చారు వర్మ. ఆయనే మాకు స్ఫూర్తి అని ఈ రోజుకి కూడా కొత్త దర్శకులు చెప్పుకుంటున్నారు. అలాంటి ఆయన్ను తీవ్ర పదజాలంతో మాట్లాడటం తగదు. దయచేసి ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని రమేశ్‌గారిని కోరుతున్నా. వర్మగారి మాటలు వ్యంగ్య బాణాల్లాంటివి. ఆయన మాటల్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. కానీ, మద్దినేని రమేశ్‌గారు ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. ఆయన వ్యంగ్య మాటల నుంచి కొన్ని రియలైజ్ అవ్వాలి, మరికొన్ని నవ్వి ఊరుకోవాలి తప్పితే ఇలా మాట్లాడకూడదు. ఆ మధ్య ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు’ సినిమాలోని ఓ పాటలో ఆయన్ని ఆయనే విమర్శించుకుని మమ్మల్నీ తీవ్రంగా విమర్శించడంతో మేం నవ్వుకున్నాం. నా గురించి ఏం రాశారా? అని బోయపాటి శ్రీను తెలుసుకుని మరీ నవ్వుకున్నారట. వర్మలా ప్రశ్నించే వ్యక్తిని మనమెప్పుడూ దూషించకూడదు. మనం వాళ్లకీ, వీళ్లకీ భయపడుతుంటాం. కానీ, ఆయన కల్మషం లేకుండా మాట్లాడేస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఇక మాట్లాడకుండా చేయకూడదు. ఆయన లాంటోళ్లు మాట్లాడితే మంచిది. ఆర్కే లక్ష్మణ్‌గారు, కార్టూనిస్ట్ శ్రీధర్‌గారు, దర్శకుడు బాలాగారు.. వారివన్నీ వ్యంగ్యాస్త్రాలు. అవి హాని కలిగించేవి కావు. వాళ్ల ధోరణిలో సమాజాన్ని చూస్తుంటారు. మహామహులు దాన్ని స్పోర్టివ్‌గా తీసుకున్నారు. నా వెనక శక్తులేం లేవు! నిన్న, మొన్న చాలామంది అన్నారు. అస్సలు ఈ గుణశేఖర్ ఎవడు? ‘రుద్రమదేవి’ సినిమా రిలీజ్ అయి రెండు మూడేళ్లయింది. ఇప్పుడు మళ్లీ ట్యాక్స్ మినహాయింపు, నాకు అన్యాయం జరిగిందని అంటాడేంటి? అసలు తను దరఖాస్తు సరిగ్గా చేయలేదు. రిలీజ్ అయ్యాక చేశాడు. ముందే చేసుంటే పన్ను మినహాయింపు మా తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకివ్వదు? తప్పంతా ఆయనలోనే పెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే ఆయన వెనక ఏమైనా శక్తులున్నాయా? అంటున్నారు. నా వెనుక శక్తులేమీ లేవు నేనొక్కడినే. జ్యూరీ సభ్యులు టి.ప్రసన్నకుమార్‌గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ‘రుద్రమదేవి’ విడుదలయ్యాక దరఖాస్తు చేశారని. నేను రిలీజ్‌కి ముందే అప్లై చేశాను. 2015 అక్టోబర్ 9న రిలీజ్. 7వ తేదీ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్ ఉంటే తప్ప పన్ను మినహాయింపుకు దరఖాస్తు చేసుకోలేం. అక్టోబర్ 8న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు దరఖాస్తు చేశా. వాళ్లు ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. కానీ, ఏపీ స్పందించలేదు. 12న చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లంగారు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి ఒక నోటీస్ కూడా పంపించారు. నాకూ ఒక సీసీ పంపించారు. పన్ను మినహాయింపు కోసం ఒక స్క్రీనింగ్ కమిటీ వేసి పరిశీలించ మని ఆ నోటీస్‌లో ఉంది. కానీ, హైదరాబాద్ నుంచి ఆఫీసు విజయవాడకి సర్దుతున్నాం ఒక నెల ఆగమన్నారు. ఆ తర్వాత ఫైళ్లన్నీ సర్దుతున్నాం మరో నెల పడుతుందంటూ కాలయాపన చేశారు. మూణ్నెల్ల తర్వాత ఫైల్ క్లోజ్ చేయమని మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. షాక్ అయి, నేను దరఖాస్తు చేసిన, చీఫ్ సెక్రటరీగారు ఇచ్చిన కాపీలతో వైజాగ్ వెళ్లి మంత్రి అయ్యన్న పాత్రుడిని కలిశా. అజయ్ కల్లంగారిచ్చిన నోటీస్ చూసి, ‘ఆదేశాలున్నా ఎందుకు కమిటీ వేయలేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుందాం. నేను అమరావతికి వెళ్లినప్పుడు చెబుతాను నువ్వు కూడా రా’ అన్నారు. ఆ తర్వాత ఆయన్నుంచి నాకు కాల్ రాలేదు. నేనే ఫోన్ చేస్తే, లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ పెట్టినా స్పందించకపోవడంతో వదిలే శా. ఆ తర్వాత మంత్రి గంటా శ్రీనివాసరావుగారిని కలిశా. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకి పన్ను మినహాయింపు ఇచ్చేందుకు అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ పెట్టారు. ఆ సమావేశంలోనే ‘రుద్రమదేవి’ సినిమా విషయాన్ని ప్రస్తావిస్తా అన్నారు. ఆ తర్వాత ఆయన్నుంచి కూడా రెస్పాన్స్ లేదు. దాదాపు 70–80 కోట్లతో ‘రుద్రమదేవి’ లాంటి చారిత్రాత్మక సినిమా నిర్మించాను కాబట్టి, ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తే, మంచి సపోర్ట్ అవుతుందని భావించా. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కదా.. ఏపీ కూడా ఇస్తే నాకు సపోర్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతో నా వైపు నుంచి ఎటువంటి తప్పిదం లేకుండా దరఖాస్తు చేశా. నాకు సమాధానం రాలేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా లేఖ రాశా. ఆయన్ని విమర్శించలేదు. నాకు జరిగిన అన్యాయాన్ని వివరించా. ఆ నిబంధన తీసేయాలి నంది అవార్డుల విషయానికొస్తే ప్రతి సంవత్సరం విమర్శలుంటాయి. రానివాళ్లు అసంతృప్తి వెళ్లబుచ్చడం కరెక్టే. కానీ, ఈ ఏడాది.. మా అసంతృప్తిని వెళ్లగక్కడానికి కూడా వీలు లేకుండా ఓ నియమం పెట్టారు. అవార్డు రాకుంటే బహిరంగంగా విమర్శించకూడదనీ, అలా చేస్తే మరో మూడేళ్లు వారు దరఖాస్తు చేసుకోవడానికి కుదరదని దరఖాస్తులో పేర్కొనడం కరెక్ట్ కాదు. అందువల్ల బయటకి వచ్చి మాట్లాడాలంటే భయమేస్తోంది. మాలాంటి వాళ్లకి ఇప్పుడూ అవార్డులు రాక.. తర్వాత మరో మూడేళ్లు అవార్డులు రాకుంటే ఎలా సార్? అని అప్కమింVŠ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ నాతో అన్నారు. అడిగే హక్కు మాకు ఉంటుంది. ప్రతి సంవత్సరం విమర్శలు వస్తుంటాయి. నేను అవార్డు పొందినప్పుడు కూడా ఎవరో ఒక్కరు విమర్శించినవాళ్లే. ఎవరూ కూడా ఒక స్థాయికి మించి విమర్శించరు. ఓ స్థాయికి మించి విమర్శిస్తే సుమోటాగా స్వీకరించి చర్యలు తీసుకోవచ్చు. నాకు రాలేదు, ఎందుకు రాలేదు? అని ఎవరి హద్దులో వారు అడగొచ్చు. అది తప్పుకాదు? మెసేజ్ కనిపించలేదా? ‘రుద్రమదేవి’ సినిమా విడుదలైంది 2015లో. ఆ సంవత్సరం జ్యూరీ చైర్మన్ జీవితాగారు. మా విమర్శలను కొందరు మీడియా మిత్రులు ఆమె వద్ద ప్రస్తావించగా.. ఆవిడ స్పందించారు. ఉత్తమ చిత్రం విభాగంలో ‘బాహుబలి’తో ‘రుద్రమదేవి’ అన్ని విభాగాల్లో పోటీ పడలేకపోయింది. అందువల్ల ‘బాహుబలి’కి ఇచ్చాం అన్నారామె. పోటీ పడ్డప్పుడు ఉత్తమ చిత్రంగా రాకపోతే ఆ పోటీ పడ్డ సినిమా రన్నరప్ కింద అవుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం అవుతుంది కదా అని కొందరంటే.. జ్యూరీ కన్సిడర్ చేయడానికి కూడా చాలా గట్టి పోటీ ఉందని చెప్పారట. అంటే.. జ్యూరీలో ఉన్న సినిమాలకి కూడా మీరు తీసిన చారిత్రాత్మక చిత్రం పోటీ పడలేకపోయిందా? సార్ అని కొందరు నాతో అన్నారు. దర్శకత్వం విభాగంలో పోటీ పడలేదంటే డైరెక్టర్‌గా రాదు. టోటల్ సినిమాలో సమాజానికి మేలు చేసే ఒక మెసేజ్ ఉంది అనుకున్నప్పుడు కచ్చితంగా ఉత్తమ మూడు చిత్రాల విభాగంలో ఏదో ఒకటి ఇస్తారు. దీనికంటే వేరే సినిమాలు గొప్ప మెసేజ్ ఇస్తున్నాయంటే కనీసం జ్యూరీ కింద ఇస్తారు. మరి ‘రుద్రమదేవి’ కంటే మిగతా సినిమాల్లో ఏం సందేశం కనిపించిందో తెలియడం లేదు. జ్యూరీ బాధ్యతగా వ్యవహరించాలి. ఎక్కువ మంది సినిమావాళ్లనే పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. రాజకీయ లబ్ధి పొందేవారు అస్సలు ఉండకూడదు. అవార్డులు ప్రకటించి బయటికొచ్చి ఓ ప్రభుత్వాన్ని జీవితగారు మెచ్చుకున్నారంటే.. ఏదో రాజకీయ లబ్ధి ఆశించే అనుకుంటారు. రాజకీయ ప్రయోజనాల కోసం కళాభిమానుల కష్టాన్ని పణంగా పెట్టొద్దని విన్నవించుకుంటున్నా.అల్లు అర్జున్ విషయంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్లై చేశారని చెప్పారు. సహాయ నటుడిగానే దరఖాస్తు చేశా. సహాయ నటుడిగానే అప్లయ్ చేసినా, ఎస్వీ రంగారావు పేరు మీద ఉంది కదా అని క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇచ్చాం అన్నారు. మేం ఏ కేటగిరీకి దరఖాస్తు చేశామో దాన్ని వారు మార్చడానికి లేదు. రంగారావుగారి పేరు మీద ఉంది కదా అని క్యారెక్టర్ ఆర్టిస్టు అవార్డు ఇచ్చామంటే సహాయ నటుడి అవార్డుని తగ్గించినట్లవుతుంది కదా? ఇప్పుడు చాలామంది జాతీయ అవార్డులని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. జాతీయ అవార్డు గైడ్‌లైన్స్ వేరు.. నంది అవార్డు గైడ్‌లైన్స్ వేరు. మనకి మన ప్రాంతీయత, సంస్కృతిపైన ఆధారపడి ఉంటాయి. అలా ‘రుద్రమదేవి’ విషయానికొస్తే.. కొన్నింటిలో వాళ్లకి కన్వీనెంట్‌గా ఉన్నవి జాతీయ అవార్డులతో కంపేర్ చేసుకుంటున్నారు. కన్వీనెంట్‌గా లేనివి మనది వేరు కదా అంటున్నారు. ‘రుద్రమదేవి’కి జాతీయ అవార్డులో ఉత్తమ ప్రాంతీయ చిత్రం రానందుకు నాకు ఏమాత్రం అసంతృప్తి లేదు. ‘కంచె’ సినిమాకి ఇచ్చారు. ఆ సినిమా నా దృష్టిలో ‘రుద్రమదేవి’ కంటే గొప్ప సందేశం ఇచ్చిన సినిమా. అది కుల వ్యవస్థ మీద పోరాడే, ప్రశ్నించే సినిమా. ‘కంచె’కి అవార్డు రావడంతో తొలుత షాక్ అయ్యా. కథ విన్నాక కరెక్టే అనిపించింది. ‘రుద్రమదేవి’లో తెలుగువారు మరచిపోతున్న చరిత్రను చూపించా. దర్శకత్వమో, మరొకటో నాసిరకంగా కనిపించి ఉండవచ్చు. కానీ, సినిమా ఇచ్చిన సందేశం అందలేదా? అందువల్ల నేను అప్సెట్ అయ్యానే కానీ, ఉత్తమ దర్శకుడి అవార్డు రాలేదనే బాధ లేదు. ‘బాహుబలి’ బెటర్ సినిమానే. రాజమౌళికి అవార్డు ఇచ్చినందకు హ్యాపీ. కానీ, ‘రుద్రమ దేవి’లో సందేశం లేదా? సాటి మహిళ జ్యూరీలో ఉండి కూడా మహిళా సాధికారత మీద తీసిన సినిమాకి న్యాయం జరగలేదంటే ఏమనాలి? ఇండియా కాదు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ అన్నది మేల్ డామినేషన్. అలాంటిది 70–80 కోట్లు పెట్టి ఓ మహిళ మీద సినిమా తీశాడే. చెడగొట్టాడే. అయినా వీడి సందేశం బాగుందే. ప్రయత్నాన్ని చిన్నగా తట్టి ప్రోత్సహిద్దామనుకుంటే నాకు లక్షలు వచ్చేయవు కదా? పన్ను మినహాయింపు గురించి నేనిప్పుడు మాట్లాడింది కూడా అది తిరిగి ఇచ్చేస్తారని కాదు. అది సమాధి అయిపోయింది. కానీ, నాకు జరిగిన అన్యాయం అందరికీ తెలియాలి. -
మూడురోజుల్లో రూ. 32 కోట్ల వసూళ్లు
చెన్నై: 'రుద్రమదేవి' సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లు రాబడుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే సుమారు రూ. 32 కోట్లు వసూలు చేసిందని సినీ ట్రేడ్ పండితుడు త్రినాధ్ వెల్లడించారు. ఇప్పటికే హిందీలోకి కూడా డబ్ అయిన ఈ హిస్టారికల్ మూవీ ఓవర్ సీస్లో మంచి ఓపెనింగ్స్ సాధించింది. మున్ముందు కలెక్షన్లు పెరుగుతాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఓపెనింగ్ వీకెండ్లో తెలుగులో మంచి లాభాలను ఆర్జిస్తున్న 'రుద్రమదేవి'కి విదేశాల్లోకూడా ఆదరణ లభిస్తోందంటున్నారు. 3డిలో తెరకెక్కిన తొలి తెలుగు చారిత్రాత్మక చిత్రం కావడంతో అన్ని చోట్లా ముందుగానే టికెట్లు బుక్ కావడంతో తెలుగులో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా 'రుద్రమదేవి' నిలిచింది. కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క లీడ్ రోల్లో నటించింది. గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రునిగా దగ్గుబాటి రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్య మీనన్ తదితరులు నటించారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయా రాజా సంగీతం అందించిన ఈ చిత్రం అక్టోబర్ 9న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. ఈ త్రీడి సెన్సేషనల్ మూవీ తమిళంలో శుక్రవారం విడుదల కానుంది. -
మేకింగ్ కూడా చరిత్రే!
దర్శకుడు గుణశేఖర్ తన చిన్ననాటి కలను ఎట్టకేలకు నిజం చేసుకున్నారు. కాకతీయ సామ్రాజ్యపు సామ్రాజ్ఞి ‘రుద్రమదేవి’ కథను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. ఈ చారిత్రక కథా చిత్రం కోసం స్వయంగా నిర్మాత అవతారం కూడా ఎత్తారాయన. విశేషం ఏమిటంటే, తానే నిర్మాత అయినా ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గుణశేఖర్ వినియోగించడం! తెలుగు వారందరి చరిత్ర అయిన ‘రుద్రమదేవి’ జీవితాన్ని ఆయన స్టీరియోస్కోపిక్ 3డీలో తీశారు. అలాగే, ‘డాల్టీ - ఎట్మాస్’ అనే శబ్ద సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. మన దేశంలో తయారైన ‘ఫస్ట్ హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డీ ఫిల్మ్’ ఇదే! స్టీరియోస్కోపిక్ 3డీ ఫిల్మ్ అంటే? 3డీ ఫిల్మ్ మేకింగ్‌లో కీలకమైన అంశం - ‘స్టీరియోగ్రఫీ’. సాధారణంగా రెండు రకాల 3డీ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి - మనం మామూలుగా చూసే సినిమాల లాగా రెగ్యులర్ 2డీ పద్ధతిలో సినిమా తీసి, ఆ తరువాత దాన్ని పోస్ట్ ప్రొడక్షన్లో 3డీలోకి మార్చడం. ఎక్కువ భాగం మనం చూస్తున్న 3డీ సినిమాలు ఇలాంటివే. మహా అయితే, కొన్ని కీలక దృశ్యాలను మాత్రం 3డీలో తీస్తారు. మిగతాదంతా 2డీ నుంచి 3డీకి కన్వర్షనే! ఇక, రెండోది - సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే మొత్తం 3డీలోనే చిత్రీకరించడం. ఈ రెండో పద్ధతి వల్ల అసలు సిసలైన 3డీ అనుభూతి కలుగుతుంది. ‘రుద్రమదేవి’ని ఇలా రెండో పద్ధతిలో, షూటింగ్ చేస్తున్నప్పుడే మొత్తం 3డీలో చిత్రీకరించారు. అందుకే, భారతదేశంలో చారిత్రక కథాంశంతో వచ్చిన మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ ఫిల్మ్ అనే కీర్తి కిరీటం ఈ సినిమాకు దక్కింది. నిజజీవితంలో మనం కుడి, ఎడమ కళ్ళతో ఎదురుగా ఉన్న వస్తువులనూ, మనుషులనూ ఎలా చూస్తామో అచ్చంగా అలాగే వెండితెరపై దృశ్యాలను చూసే థ్రిల్లింగ్ అనుభూతిని ‘స్టీరియోస్కోపిక్ 3డీ’ ఇస్తుంది. ఇలా సినిమా తీయాలంటే, ఏకకాలంలో 2 కెమేరాలతో చిత్రీకరించాలి. సామాన్య పరిభాషలో చెప్పాలంటే, ఒక కెమేరా ఏమో మన కుడి కన్నులా, రెండో కెమేరానేమో ఎడమ కన్నులా పనిచేస్తాయన్నమాట. మన రెండు కళ్ళ మధ్య ఉన్న దూరం లాగానే, ఈ రెండు కెమేరాల లెన్స్లనూ, రెండు ఫ్రేమ్లనూ నిర్ణీత దూరంలో ఫిక్స్ చేసి, ఒకే దృశ్యంగా తీయాలి. దీని వల్ల లొకేషన్లో షూటింగ్ చేస్తున్నప్పుడే 3డీలో ఎలా వస్తోందో చూడవచ్చు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే - మన రెండు కళ్ళూ ఎదుటి వస్తువులను చూస్తున్న అనుభూతి కలిగించినట్లే, రేపు హాలులో తెరపై కూడా ఆ ఎఫెక్ట్ రావడానికి - ఆ రెండు కెమేరాలను కూడా ఎలైన్మెంట్ చేసి, రెండు కెమేరాల్లోని దృశ్యాల్ని కన్వర్జెన్స్ చేయాలి. ఆ పని ‘స్టీరియోగ్రాఫర్’ది. 3డీలో ‘నెగటివ్ స్పేస్’ (ఎదురుగా ఉన్న వస్తువు తెరపై ముందుకు పొడుచుకు వచ్చినట్లు కనిపించడం)నూ, ‘పాజిటివ్ స్పేస్’ (తెర మీద దృశ్యం తాలూకు ఇన్నర్ డెప్త్)నూ సరిగ్గా ఎలైన్మెంట్ చేయాలి. ఆ పని కూడా స్టీరియోగ్రాఫర్ నిపుణులే చేస్తారు. అలా సరిగ్గా అనుసంధానం చేసినప్పుడే ప్రత్యేకమైన కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తున్నప్పుడు మనకి చక్కటి 3డీ దృశ్యానుభూతి కలుగుతుంది. ఒక 3డీ చిత్రం షూటింగ్ అంటే ఇంత తతంగం ఉంటుంది కాబట్టే, ‘రుద్రమదేవి’ నిర్మాణానికి చాలా సమయం పట్టింది. బాగా డబ్బు ఖర్చయింది. మామూలుగా తీసే 2డీ సినిమాల్లో తీస్తున్న షాట్‌ను బట్టి కెమేరాకున్న లెన్సులు మార్చడం 4 నిమిషాల్లో పూర్తవుతుంది. కానీ, ఈ ‘స్టీరియోస్కోపిక్ 3డీ’ చిత్రీకరణకు ఒక్కసారి లెన్స్ మార్చాలంటే 45 నిమిషాల దాకా పడుతుంది. ఒక్కో షాట్కీ ఇంత టైమ్ పడుతున్నా, నటీనటులు చాలా ఓపిగ్గా నిరీక్షించడమే కాకుండా, ఆ పాత్ర, ఆ సన్నివేశం తాలూకు మూడ్‌ను నిలుపుకోవాల్సి ఉంటుంది. అందుకే, ఇలాంటి సినిమా దర్శక, నిర్మాతలు, టెక్నీషియన్లకే కాదు... నటీనటులకు కూడా సవాలే! ‘డాల్బీ- ఎట్మాస్’ అంటే? ‘డాల్బీ - ఎట్మాస్’అనేది ఇటీవలి కాలంలో తెలుగు సినిమాకు విస్తరించిన సినీ శబ్ద సాంకేతిక విధానం. ఒకప్పుడు ‘6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్’, ఆ తరువాత ‘డి.టి.యస్’, అటుపైన ‘డాల్బీ’లాగా - వాటి తరువాత ఆధునిక సాంకేతిక విజ్ఞానం. తెర మీద దృశ్యంలో కనిపిస్తున్న వాతావరణం (ఎట్మాస్ఫియర్) తాలూకు శబ్దాలను కూడా స్పష్టంగా, థియేటర్లో వినేలా చేయడం ఈ పద్ధతిలో ప్రత్యేకత. ఇటీవల వచ్చిన ‘బాహుబలి’, ఇప్పుడు ‘రుద్రమదేవి’ఈ డాల్బీ - ఎట్మాస్ పద్ధతిలో థియేటర్లలో కొత్త శబ్దానుభూతిని కలిగిస్తున్నాయి. ఈ డాల్బీ -ఎట్మాస్ విధానంలో సినిమాను ప్రదర్శించేందుకు వీలుగా రాష్ట్రంలోని పలు థియేటర్లు ఇప్పుడు అధునాతన పరికరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. మరిన్ని విశేషాలు * సర్వసాధారణంగా సినిమాను 2డిలో చిత్రీకరించి, 3డిలోకి మారుస్తుంటారు. కానీ, ‘రుద్రమదేవి’ని పూర్తిగా 3డీలోనే తీయడం విశేషం. * భారతదేశంలోనే మొట్టమొదటి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి ఫిల్మ్ ఇది. ఈ 3డి చిత్రీకరణ కోసం హాలీవుడ్ స్టీరియోగ్రాఫర్లు, లాస్ ఏంజెల్స్ నుంచి టెక్నీషియన్లు ఇండియాకు వచ్చి పనిచేశారు. * గతంలో ‘ట్రాన్స్ఫార్మర్- ఏజ్ ఆఫ్ ఎక్స్టిన్క్షన్’, ‘డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ఏప్స్’, ‘ది ఎమేజింగ్ సై్పడర్‌మ్యాన్’ లాంటి హాలీవుడ్ చిత్రాలకు లీడ్ స్టీరియోగ్రాఫర్‌గా పనిచేసిన మార్కస్ లాంక్సింజర్ ‘రుద్రమదేవి’ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. * లండన్‌లోని ‘ది ఏంజెల్ స్టూడియో’లో ప్రపంచ ప్రసిద్ధ ఫిల్హార్మోనియా ఆర్కెస్ట్రాతో ‘రుద్రమదేవి’ నేపథ్య సంగీతాన్ని రికార్డ్ చేశారు ఇళయరాజా. హాలీవుడ్ ఫిల్మ్ ‘టైటానిక్’ నేపథ్య సంగీతం కూడా ఈ స్టూడియోలోనే రికార్డయింది. * చారిత్రకంగా పక్కాగా ఉండడం కోసం ఢిల్లీ మ్యూజియమ్‌లోని చారిత్రక ఆధారాలను పరిశీలించి మరీ ఈ సినిమాలోని రుద్రమదేవి, ప్రతాపరుద్రుల కిరీటాలను డిజైన్ చేశారు. * చెన్నైకి చెందిన ఎన్.ఎ.సి. వాళ్ళు ప్రత్యేకంగా డిజైన్ చేసిన అసలైన బంగారు నగల్ని ‘రుద్రమదేవి’ షూటింగ్లో వాడారు. ఆ నగల విలువ దాదాపు రూ. 5 కోట్లు. * ఈ చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 80 కోట్లు. భారతదేశంలో ఇప్పటి వరకు తయారైన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో అత్యధిక బడ్జెట్ సినిమా ఇదే. * ‘లగాన్’ సినిమాలో కథాకథనానికి అమితాబ్ బచ్చన్ నేపథ్య గళమందిస్తే, ఇప్పుడీ ‘రుద్రమదేవి’కి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. * ఈ కథలో కీలకమైన బందిపోటు గోన గన్నారెడ్డి పాత్రను హీరో మహేశ్‌బాబు, చిన్న ఎన్టీయార్ లాంటి వాళ్ళు చేస్తారని మొదట్లో ప్రచారమైంది. చివరకు ‘వరుడు’ సినిమా షూటింగ్ టైమ్ నుంచే ‘రుద్రమదేవి’ స్క్రిప్ట్, ఈ పాత్ర గురించి తెలిసిన అల్లు అర్జున్ అన్కండిషనల్గా ఆ పాత్ర చేయడానికి ఉత్సాహంగా ముందుకొచ్చారు. * రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రుడిగా ఈ సినిమాలో రానా 30 సార్లకు పైగా కాస్ట్యూమ్స్ మార్పులున్నాయి. దాదాపుగా ప్రతిరోజూ ఒక కొత్త కాస్ట్యూమ్స్‌లో ఆయన షూట్ చేసేవారట! * ‘బాహుబలి’ షూటింగ్లో రానాకు గాయమవడంతో, ‘రుద్రమదేవి’ దర్శక - నిర్మాతలు ఏకంగా ఒక షెడ్యూల్ మొత్తం వాయిదా వేశారు. * ఈ సినిమాలో బాల నటులు కూడా పలువురు ఉన్నారు. ముఖ్యంగా, పలువురు సినీ ప్రముఖుల వారసులు ఈ బాల పాత్రలు పోషించడం విశేషం. హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ 16 ఏళ్ళ చాళుక్య వీరభద్రుడిగా, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ సచ్దేవ్?? 12 ఏళ్ళ గోన గన్నారెడ్డిగా నటించారు. ఇక, 9 ఏళ్ళ బాల రుద్రమదేవిగా హీరో శ్రీకాంత్ కూతురు మేధ తెరపైకి వచ్చింది. ఇంకా 14 ఏళ్ళ వయసు రుద్రమదేవిగా ఉల్క, 9 ఏళ్ళ మహదేవుడిగా యశ్వంత్ చేశారు. -రెంటాల జయదేవ -
అనుష్క నేనే మహారాణి
తమిళసినిమా : ‘మహారాణి అంటే నేనే అని నేనడం లేదు. ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు’ అని ఆనందంతో పొంగిపోతున్నారు మేటి నటి అనుష్క. అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, బాహుబలి-2 అంటూ వరుసగా చారిత్రాత్మక కథా చిత్రాలలో మహారాణి పాత్రలు అనుష్కనే వరించడం అదృష్టమో లేక ఆమె నటనా పఠిమకు నిదర్శమో గానీ ఇప్పుడు రాణి పాత్ర అంటే దర్శక, నిర్మాతలకు కళ్ల ముందు మెదిలేది అనుష్కా రూపమే అన్నంతగా ఇమేజ్ను సంపాధించుకున్నారామె. దీనిపై అనుష్క స్పందిస్తూ ‘మహారాణి పాత్రలకు నేను బాగా నప్పాను. అందుకే సినిమాల్లో మహారాణి పాత్రలంటే అనుష్కనే అన్నంతగా ప్రేక్షకుల మదిలో నిలచిపోయాను. ఆ విధంగా సినిమా మహారాణి నయ్యాననే ప్రశంసలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఈ తరహా పాత్రలకు అరుంధతి చిత్రమే స్ఫూర్తి. బాహుబలి చిత్రంలో నా పాత్ర పరిధి తక్కువే అయినా రెండవ భాగంలో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. రుద్రమదేవి చిత్రంలో మహారాణిగా చాలా పవర్‌పుల్ పాత్ర చేశాను. ఇందులోని రుద్రమదేవి పాత్ర కోసం చాలా కసరత్తులు చేశాను. కత్తిసాము, గుర్రపుస్వారీ నేర్చుకున్నాను. చిత్రంలో వీరోచిత పోరాట సన్నివేశాలు అద్భుతం అనిపించేలా ఉంటాయి. 3డి ఫార్మెట్లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పుడు చారిత్రక కథా చి త్రాలను తీసేందుకు దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.అలాంటి చిత్రాల్లో నటించడానికి నేనూ సిద్ధమే’. -
సెప్టెంబర్ 4న 'రుద్రమదేవి' విడుదల
హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'రుద్రమదేవి' సినిమాను సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నట్టు దర్శకుడు గుణశేఖర్ ప్రకటించారు. ఆయన శుక్రవారం తన కుటుంబ సభ్యులు, హీరోయిన్ అనుష్కతో కలిసి ఆ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నామని చెప్పారు. హిందీలో ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలో చెబుతామన్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందన్నారు. 3డీ సీజీ టెక్నాలజీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. అజయ్ విన్సెంట్ కెమెరా పనితనం, ఇళయరాజా రీరికార్డింగ్ సినిమాకు ప్లస్ అవుతాయని అభిప్రాయపడ్డారు. కథను ఇళయరాజా అద్భుతంగా ఎలివేట్ చేశారన్నారు. గోనా గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ ఒదిగి పోయారని, సినిమాలో ఈ పాత్ర గంటసేపు ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా 'రుద్రమదేవి' ఆండ్రాయిడ్ యాప్ విడుదల చేశారు.