మేకింగ్ కూడా చరిత్రే! | Rudramadevi Movie Making details | Sakshi
Sakshi News home page

మేకింగ్ కూడా చరిత్రే!

Published Fri, Oct 9 2015 4:58 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

మేకింగ్ కూడా చరిత్రే!

మేకింగ్ కూడా చరిత్రే!

దర్శకుడు గుణశేఖర్ తన చిన్ననాటి కలను ఎట్టకేలకు నిజం చేసుకున్నారు. కాకతీయ సామ్రాజ్యపు సామ్రాజ్ఞి  ‘రుద్రమదేవి’ కథను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. ఈ చారిత్రక కథా చిత్రం కోసం స్వయంగా నిర్మాత అవతారం కూడా ఎత్తారాయన. విశేషం ఏమిటంటే, తానే నిర్మాత అయినా ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గుణశేఖర్ వినియోగించడం! తెలుగు వారందరి చరిత్ర అయిన ‘రుద్రమదేవి’ జీవితాన్ని ఆయన స్టీరియోస్కోపిక్ 3డీలో తీశారు. అలాగే, ‘డాల్టీ - ఎట్మాస్’ అనే శబ్ద సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. మన దేశంలో తయారైన ‘ఫస్ట్ హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డీ ఫిల్మ్’ ఇదే!

స్టీరియోస్కోపిక్ 3డీ ఫిల్మ్ అంటే?
3డీ ఫిల్మ్ మేకింగ్‌లో కీలకమైన అంశం - ‘స్టీరియోగ్రఫీ’. సాధారణంగా రెండు రకాల 3డీ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి - మనం మామూలుగా చూసే సినిమాల లాగా రెగ్యులర్ 2డీ పద్ధతిలో సినిమా తీసి, ఆ తరువాత దాన్ని పోస్ట్ ప్రొడక్షన్‌లో 3డీలోకి మార్చడం. ఎక్కువ భాగం మనం చూస్తున్న 3డీ సినిమాలు ఇలాంటివే. మహా అయితే, కొన్ని కీలక దృశ్యాలను మాత్రం 3డీలో తీస్తారు. మిగతాదంతా 2డీ నుంచి 3డీకి కన్వర్షనే! ఇక, రెండోది - సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే మొత్తం 3డీలోనే చిత్రీకరించడం. ఈ రెండో పద్ధతి వల్ల అసలు సిసలైన 3డీ అనుభూతి కలుగుతుంది. ‘రుద్రమదేవి’ని ఇలా రెండో పద్ధతిలో, షూటింగ్ చేస్తున్నప్పుడే మొత్తం 3డీలో చిత్రీకరించారు. అందుకే, భారతదేశంలో చారిత్రక కథాంశంతో వచ్చిన మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ ఫిల్మ్ అనే కీర్తి కిరీటం ఈ సినిమాకు దక్కింది.

నిజజీవితంలో మనం కుడి, ఎడమ కళ్ళతో ఎదురుగా ఉన్న వస్తువులనూ, మనుషులనూ ఎలా చూస్తామో అచ్చంగా అలాగే వెండితెరపై దృశ్యాలను చూసే థ్రిల్లింగ్ అనుభూతిని ‘స్టీరియోస్కోపిక్ 3డీ’ ఇస్తుంది. ఇలా సినిమా తీయాలంటే, ఏకకాలంలో 2 కెమేరాలతో చిత్రీకరించాలి. సామాన్య పరిభాషలో చెప్పాలంటే, ఒక కెమేరా ఏమో మన కుడి కన్నులా, రెండో కెమేరానేమో ఎడమ కన్నులా పనిచేస్తాయన్నమాట. మన రెండు కళ్ళ మధ్య ఉన్న దూరం లాగానే, ఈ రెండు కెమేరాల లెన్స్‌లనూ, రెండు ఫ్రేమ్‌లనూ నిర్ణీత దూరంలో ఫిక్స్ చేసి, ఒకే దృశ్యంగా తీయాలి. దీని వల్ల లొకేషన్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడే 3డీలో ఎలా వస్తోందో చూడవచ్చు.

ఇంకాస్త వివరంగా చెప్పాలంటే - మన రెండు కళ్ళూ ఎదుటి వస్తువులను చూస్తున్న అనుభూతి కలిగించినట్లే, రేపు హాలులో తెరపై కూడా ఆ ఎఫెక్ట్ రావడానికి - ఆ రెండు కెమేరాలను కూడా ఎలైన్‌మెంట్ చేసి, రెండు కెమేరాల్లోని దృశ్యాల్ని కన్వర్జెన్స్ చేయాలి. ఆ పని ‘స్టీరియోగ్రాఫర్’ది. 3డీలో ‘నెగటివ్ స్పేస్’ (ఎదురుగా ఉన్న వస్తువు తెరపై ముందుకు పొడుచుకు వచ్చినట్లు కనిపించడం)నూ, ‘పాజిటివ్ స్పేస్’ (తెర మీద దృశ్యం తాలూకు ఇన్నర్ డెప్త్)నూ సరిగ్గా ఎలైన్‌మెంట్ చేయాలి. ఆ పని కూడా స్టీరియోగ్రాఫర్ నిపుణులే చేస్తారు. అలా సరిగ్గా అనుసంధానం చేసినప్పుడే ప్రత్యేకమైన కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తున్నప్పుడు మనకి చక్కటి 3డీ దృశ్యానుభూతి కలుగుతుంది. ఒక 3డీ చిత్రం షూటింగ్ అంటే ఇంత తతంగం ఉంటుంది కాబట్టే, ‘రుద్రమదేవి’ నిర్మాణానికి చాలా సమయం పట్టింది. బాగా డబ్బు ఖర్చయింది.

మామూలుగా తీసే 2డీ సినిమాల్లో తీస్తున్న షాట్‌ను బట్టి కెమేరాకున్న లెన్సులు మార్చడం 4 నిమిషాల్లో పూర్తవుతుంది. కానీ, ఈ ‘స్టీరియోస్కోపిక్ 3డీ’ చిత్రీకరణకు ఒక్కసారి లెన్స్ మార్చాలంటే 45 నిమిషాల దాకా పడుతుంది. ఒక్కో షాట్‌కీ ఇంత టైమ్ పడుతున్నా, నటీనటులు చాలా ఓపిగ్గా నిరీక్షించడమే కాకుండా, ఆ పాత్ర, ఆ సన్నివేశం తాలూకు మూడ్‌ను నిలుపుకోవాల్సి ఉంటుంది. అందుకే, ఇలాంటి సినిమా దర్శక, నిర్మాతలు, టెక్నీషియన్లకే కాదు... నటీనటులకు కూడా సవాలే!

‘డాల్బీ- ఎట్మాస్’ అంటే?
‘డాల్బీ - ఎట్మాస్’అనేది ఇటీవలి కాలంలో తెలుగు సినిమాకు విస్తరించిన సినీ శబ్ద సాంకేతిక విధానం. ఒకప్పుడు ‘6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్’, ఆ తరువాత ‘డి.టి.యస్’, అటుపైన ‘డాల్బీ’లాగా - వాటి తరువాత ఆధునిక సాంకేతిక విజ్ఞానం. తెర మీద దృశ్యంలో కనిపిస్తున్న వాతావరణం (ఎట్మాస్‌ఫియర్) తాలూకు శబ్దాలను కూడా స్పష్టంగా, థియేటర్‌లో వినేలా చేయడం ఈ పద్ధతిలో ప్రత్యేకత. ఇటీవల వచ్చిన ‘బాహుబలి’, ఇప్పుడు ‘రుద్రమదేవి’ఈ డాల్బీ - ఎట్మాస్ పద్ధతిలో థియేటర్లలో కొత్త శబ్దానుభూతిని కలిగిస్తున్నాయి. ఈ డాల్బీ -ఎట్మాస్ విధానంలో సినిమాను ప్రదర్శించేందుకు వీలుగా రాష్ట్రంలోని పలు థియేటర్లు ఇప్పుడు అధునాతన పరికరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.

మరిన్ని విశేషాలు

* సర్వసాధారణంగా సినిమాను 2డిలో చిత్రీకరించి, 3డిలోకి మారుస్తుంటారు. కానీ, ‘రుద్రమదేవి’ని పూర్తిగా 3డీలోనే తీయడం విశేషం.

* భారతదేశంలోనే మొట్టమొదటి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి ఫిల్మ్ ఇది. ఈ 3డి చిత్రీకరణ కోసం హాలీవుడ్ స్టీరియోగ్రాఫర్లు, లాస్ ఏంజెల్స్ నుంచి టెక్నీషియన్లు ఇండియాకు వచ్చి పనిచేశారు.

* గతంలో ‘ట్రాన్స్‌ఫార్మర్- ఏజ్ ఆఫ్ ఎక్స్‌టిన్‌క్షన్’, ‘డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ఏప్స్’, ‘ది ఎమేజింగ్ సై్పడర్‌మ్యాన్’ లాంటి హాలీవుడ్ చిత్రాలకు లీడ్ స్టీరియోగ్రాఫర్‌గా పనిచేసిన మార్కస్ లాంక్సింజర్ ‘రుద్రమదేవి’ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.

* లండన్‌లోని ‘ది ఏంజెల్ స్టూడియో’లో ప్రపంచ ప్రసిద్ధ ఫిల్‌హార్మోనియా ఆర్కెస్ట్రాతో ‘రుద్రమదేవి’ నేపథ్య సంగీతాన్ని రికార్డ్ చేశారు ఇళయరాజా. హాలీవుడ్ ఫిల్మ్ ‘టైటానిక్’ నేపథ్య సంగీతం కూడా ఈ స్టూడియోలోనే రికార్డయింది.

* చారిత్రకంగా పక్కాగా ఉండడం కోసం ఢిల్లీ మ్యూజియమ్‌లోని చారిత్రక ఆధారాలను పరిశీలించి మరీ ఈ సినిమాలోని రుద్రమదేవి, ప్రతాపరుద్రుల కిరీటాలను డిజైన్ చేశారు.

* చెన్నైకి చెందిన ఎన్.ఎ.సి. వాళ్ళు ప్రత్యేకంగా డిజైన్ చేసిన అసలైన బంగారు నగల్ని ‘రుద్రమదేవి’ షూటింగ్‌లో వాడారు. ఆ నగల విలువ దాదాపు రూ. 5 కోట్లు.

* ఈ చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 80 కోట్లు. భారతదేశంలో ఇప్పటి వరకు తయారైన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో అత్యధిక బడ్జెట్ సినిమా ఇదే.

* ‘లగాన్’ సినిమాలో కథాకథనానికి అమితాబ్ బచ్చన్ నేపథ్య గళమందిస్తే, ఇప్పుడీ ‘రుద్రమదేవి’కి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు.

* ఈ కథలో కీలకమైన బందిపోటు గోన గన్నారెడ్డి పాత్రను హీరో మహేశ్‌బాబు, చిన్న ఎన్టీయార్ లాంటి వాళ్ళు చేస్తారని మొదట్లో ప్రచారమైంది. చివరకు ‘వరుడు’ సినిమా షూటింగ్ టైమ్ నుంచే ‘రుద్రమదేవి’ స్క్రిప్ట్, ఈ పాత్ర గురించి తెలిసిన అల్లు అర్జున్ అన్‌కండిషనల్‌గా ఆ పాత్ర చేయడానికి ఉత్సాహంగా ముందుకొచ్చారు.

* రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రుడిగా ఈ సినిమాలో రానా 30 సార్లకు పైగా కాస్ట్యూమ్స్ మార్పులున్నాయి. దాదాపుగా ప్రతిరోజూ ఒక కొత్త కాస్ట్యూమ్స్‌లో ఆయన షూట్ చేసేవారట!

* ‘బాహుబలి’ షూటింగ్‌లో రానాకు గాయమవడంతో, ‘రుద్రమదేవి’ దర్శక - నిర్మాతలు ఏకంగా ఒక షెడ్యూల్ మొత్తం వాయిదా వేశారు.

* ఈ సినిమాలో బాల నటులు కూడా పలువురు ఉన్నారు. ముఖ్యంగా, పలువురు సినీ ప్రముఖుల వారసులు ఈ బాల పాత్రలు పోషించడం విశేషం. హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ 16 ఏళ్ళ చాళుక్య వీరభద్రుడిగా, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ సచ్‌దేవ్?? 12 ఏళ్ళ గోన గన్నారెడ్డిగా నటించారు. ఇక, 9 ఏళ్ళ బాల రుద్రమదేవిగా హీరో శ్రీకాంత్ కూతురు మేధ తెరపైకి వచ్చింది. ఇంకా 14 ఏళ్ళ వయసు రుద్రమదేవిగా ఉల్క, 9 ఏళ్ళ మహదేవుడిగా యశ్వంత్ చేశారు.

-రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement