నంది అవార్డుల వివాదం ప్రధానంగా నాలుగు సినిమాల చుట్టూనే తిరుగుతున్న విషయం తెలిసిందే. లెజెండ్, మనం, రేసుగుర్రం, రుద్రమదేవి సినిమాల పేర్లే ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్నాయి. రుద్రమదేవి సినిమాకు అవార్డుల ఎంపికలో అన్యాయం జరిగిందని దర్శకుడు గుణశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై స్పదించిన జ్యూరీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు రకరకాలుగా మాట్లాడటంపై గుణశేఖర్ మరోసారి స్పందించారు. మీడియాతో వివాదం గురించి మాట్లాడారు.
ముఖ్యంగా రుద్రమదేవి సినిమాకు పన్ను రాయితీ రాకపోవడానికి గుణశేఖర్ సక్రమంగా ప్రయత్నించకపోవటమే కారణమన్న వాదనపై ఆయన వివరణ ఇచ్చారు. తాను నిబంధనల ప్రకారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయిన వెంటనే అక్టోబర్ 8న తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు పన్ను మినహాయింపు కోసం అప్లై చేశానన్నరు. అయితే తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించినా.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మూడు నెలల పాటు కాలయాపన చేసి, తరువాత తన ఫైల్ క్లోజ్ చేశారని తెలిపారు.
ఈ విషయంపై మంత్రి అయ్యన్న పాత్రుడ్ని కలిస్తే ఆయన నేను అమరావతి వెళ్లాక మీ విషయం మాట్లాడతానని చెప్పి తరువాత ఫోన్ ఎత్తటం మానేశారన్నారు. మెసేజ్ లకు కూడా స్పందించకపోవటంతో, మరో మంత్రి గంటా శ్రీనివాసరావును సంప్రదించానని తెలిపారు. ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు విషయమై ప్రత్యేక క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, అక్కడ మీ విషయం ప్రస్తావిస్తానన్నారని కానీ తరువాత గంటా కూడా స్పందించలేదని.. ఇక ప్రయత్నించటం వృథా అని భావించి వదిలేశానని తెలిపారు.
అదే సమయంలో అవార్డు కమిటీ నిర్ణయాలను ప్రశ్నిస్తే మూడేళ్ల పాటు వారిని అవార్డుల ఎంపిక నుంచి బహిష్కరిస్తామనే నిబంధన సరైంది కాదన్నారు. ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుందన్న గుణశేఖర్, ఈ నిబంధన కారణంగా చిన్న చిన్న సాంకేతిక నిపుణులు, నటీనటులు తమ ఆవేదనను బయటకు చెప్పుకోలేకపోతున్నారన్నారు.
రుద్రమదేవి సినిమా విషయంలో 2015 నంది అవార్డుల జ్యూరీ చైర్మన్ జీవిత రాజశేఖర్ స్పందించిన తీరును కూడా ఆయన తప్పుబట్టారు. ముందు బాహుబలితో పోటి పడ్డప్పుడు రుద్రమదేవి వెనకపడిందన్న కమిటీ కనీసం రెండో సినిమాగా అయిన అవార్డు ఇవ్వాలి కదా అని భావించాను.. కానీ అవార్డులు సాధించిన ఏ సినిమాతోనూ రుద్రమదేవి పోటి పడలేకపోయిందని చెప్పటం బాధకలిగించిందన్నారు. అవార్డులు ప్రకటించిన తరువాత జీవిత రాజశేఖర్ చంద్రబాబు పాలన రాకింగ్ అంటూ కామెంట్ చేయటంతో ఆమె విశ్వసనీయతను కోల్పోయారన్నారు. జ్యూరీలో అంతా సినిమా వాల్లే ఉండటం కరెక్ట్ కాదని, అదే సమయంలో రాజకీయ లబ్ధి ఆశించే వారికి జ్యూరీలో స్థానం కల్పించటం వల్ల నష్టం జరుగుతుందన్నారు.
కొంత మంది జాతీయ అవార్డులతో నంది అవార్డులను పోలుస్తున్నారని అది సరికాదని తెలిపారు. జాతీయ అవార్డుల గైడ్ లైన్స్ కు.. నంది అవార్డుల గైడ్ లైన్స్ కు చాలా తేడా ఉంటుందని మన అవార్డులను మన ప్రాంతీయత, సంస్కృతి ఆధారంగా నిర్ణయిస్తారని తెలిపారు. జాతీయ అవార్డుల్లో రుద్రమదేవికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు రానందుకు బాధలేదని.. రుద్రమదేవి కన్నా కంచె సినిమాకు అవార్డు సాధించేందుకు అన్ని రకాలుగా అర్హత ఉందని అందుకే ఆ సినిమాను అవార్డు వరించిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment