సినిమా ఎలా తీయకూడదో నేర్చుకున్నాను | Ruler Movie Director KS Ravikumar Interview | Sakshi
Sakshi News home page

సినిమా ఎలా తీయకూడదో నేర్చుకున్నాను

Published Thu, Dec 19 2019 12:06 AM | Last Updated on Thu, Dec 19 2019 12:06 AM

Ruler Movie Director KS Ravikumar Interview - Sakshi

కేయస్‌ రవికుమార్‌

‘‘చేసే పనిపై ఏకాగ్రతతో ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు. ఆ ఏకాగ్రతే క్రమశిక్షణ, అంకితభావం, నిజాయతీలను అలవరుస్తుంది’’ అన్నారు కేయస్‌ రవికుమార్‌. బాలకృష్ణ హీరోగా ఆయన దర్శకత్వంలో సి. కల్యాణ్‌ నిర్మించిన ‘రూలర్‌’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా కేయస్‌ రవికుమార్‌ చెప్పిన విశేషాలు.

► ముందుగా ‘రూలర్‌’ సినిమాకు వేరే కథ అనుకున్నమాట వాస్తవమే. కానీ పరుచూరి మురళి  చెప్పిన కథ నచ్చడంతో కొన్ని చిన్న మార్పులతో ‘రూలర్‌’ సినిమా చేశాం. మొదట అనుకున్న కథను వద్దనుకోవడానికి పెద్ద కారణాలు లేవు.   ఉత్తరప్రదేశ్‌లోని తెలుగువారికి చెందిన కథ ఇది.  సినిమాలోని ఈ సినిమా బాలకృష్ణగారి అభిమానులకే కాదు... ఇతర ప్రేక్షకులకూ నచ్చుతుంది. ‘జై సింహా’ తర్వాత వెంటనే నేను బాలకృష్ణగారితో ‘రూలర్‌’ చేశాను. ఈ సినిమా కోసం బాలకృష్ణగారు బరువు తగ్గారు. ఉదయాన్నే 3 గంటలకు నిద్రలేచి వర్కౌట్స్‌ చేసేవారట.
 
► నా కెరీర్‌లో ముందుగా చిన్న సినిమాలు చేసి, ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం హీరో ఇమేజ్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కిస్తున్నాను. ‘రూలర్‌’ సినిమాని బాలకృష్ణగారి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకునే చేశా. తన అసిస్టెంట్లు తప్పు చేసినప్పుడు మాత్రమే బాలకృష్ణగారు సెట్‌లో కోప్పడతారు. అది కూడా అన్ని సందర్భాల్లో కాదు. ప్రణాళిక ప్రకారం అన్నీ జరగకపోతే సెట్‌లో నేనూ షార్ట్‌ టెంపరే.

► నా కెరీర్‌ మొదట్లో దాదాపు పదేళ్లు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. అప్పుడు సినిమా ఎలా తీయాలి? అనే దానికంటే కూడా... ఒక సినిమా ఎందుకు ఫెయిల్‌ అవుతుంది? సినిమాను ఎలా తీయకూడదు? ఏం తప్పులు చేయకూడదు? అనే అంశాలనే ఎక్కువగా నేర్చుకున్నాను.

► ప్రీ–ప్రొడక్షన్, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను పక్కాగా ప్లాన్‌ చేసుకుంటే పెద్ద స్టార్స్‌తో సినిమా లను కూడా త్వరగా పూర్తి చేయవచ్చు. ‘రూలర్‌’ సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేశాం. గతంలో చిరంజీవిగారి ‘స్నేహాంకోసం’ సినిమాను 45 రోజుల్లోనే పూర్తి చేశాను. ఆ సినిమా చేసేటప్పుడే రజనీకాంత్‌గారి ‘నరసింహా’ సినిమాకి డైలాగ్స్‌ రాసుకున్నాను. పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేసేప్పుడు ఈగో ఉండకూడదు. హీరో ఇమేజ్‌ని డైరెక్టర్‌ గౌరవించాలి. డైరెక్టర్‌ను హీరో గౌరవించాలి. నటీనటులకు లొకేషన్‌లో నటించి చూపిస్తాం కాబట్టి దర్శకులకు కూడా నటన వచ్చేస్తుంది. ప్రస్తుతం నేను కొన్ని తమిళ సినిమాల్లో నటిస్తున్నాను. తెలుగులో రవితేజ సినిమాలో ఓ పాత్ర చేయాల్సింది. కానీ కుదర్లేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement