బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ సాహో. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీన్స్‌తో ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను సాహో అందుకుందా..? బాహుబలి తరువాత మరోసారి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ప్రూవ్ చేసుకున్నాడా..? కేవలం ఒక సినిమా అనుభవంతో సుజీత్, సాహో లాంటి మెగా ప్రాజెక్ట్‌ను ఎలా డీల్ చేశాడు..?
అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే దుమ్ము రేపిన సాహో, ఓవర్‌సీన్‌లో ప్రీమియర్స్‌తో మంచి వసూళ్లను సాధించింది. ఇక సినిమా విషయానికి వస్తే బాహుబలిగా ఆకట్టుకున్న ప్రభాస్, సాహోతో మరోసారి మెస్మరైజ్ చేశాడంటున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్, యాక్షన్ సీన్స్‌లో ప్రభాస్ ఈజ్ సూపర్బ్ అన్న టాక్ వినిపిస్తోంది. సినిమా కథ ఏంటి అన్నది దాదాపు ట్రైలర్‌లోనే చెప్పేశారు. కోట్ల డబ్బు, చాలా మంది విలన్స్ వారి మధ్య ఆదిపత్యపోరు. ఈ యుద్ధాన్ని సూపర్ హీరోలాంటి ఒక్క ఆఫీసర్ ఎలా ఆపాడు? విలన్స్ ఆట ఎలా కట్టించాడు? అన్నదే కథ.
(పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి : సాహో)
చెప్పడానికి సింపుల్‌గానే అనిపించినా దర్శకుడు సుజీత్ తన స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో సినిమాను ప్రేక్షకుడి ఊహకందని రీతిలో నడిపించాడు. ప్రారంభ సన్నివేశాలతోనే సినిమాను యాక్షన్ మూడ్‌లోకి తీసుకెళ్లిన దర్శకుడు ఆకట్టుకున్నాడు. తొలి షాట్‌లోనే సినిమా స్కేల్ ఎలా ఉండబోతుంది అన్నది చూపించిన యూనిట్, ప్రతీ సీన్ ది బెస్ట్ అనే స్థాయిలో రూపొందించారు. అయితే కథ పరంగా తొలి అర్ధభాగంలో చెప్పడానికి ఏమీ లేకపోవడంతో ప్రధాన పాత్రల పరిచయం, గ్రాండ్ విజువల్స్‌తో సరిపెట్టాడన్న టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా రెగ్యులర్ సినిమాల స్టైల్‌లోనే ఉందంటున్నారు ఓవర్‌సీస్ ఆడియన్స్. శ్రద్ధా కపూర్ క్యారెక్టర్ కూడా ఆశించిన స్థాయిలో లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ లోపాలన్నింటినీ ప్రభాస్ తన స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కవర్ చేశాడంటున్నారు ఫ్యాన్స్.
ఇక ఇతర పాత్రల విషయానికి వస్తే ప్రభాస్ వన్‌మేన్ షో కావటంతో భారీ స్టార్ కాస్ట్ ఉన్నా సినిమాలో ఎవరికీ పెద్దగా పర్ఫామెన్స్‌కు స్కోప్ దక్కలేదు. ఉన్నంతలో ఒక్క చంకీ పాండే మాత్రం తన మార్క్ చూపించారు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. పాటలు, వాటి పిక్చరైజేషన్ అద్భుతంగా ఉన్నా కథనంలో స్పీడు బ్రేకర్లలా మారాయి. కామెడీ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ద్వితీయార్థం ఆసక్తికరంగానే ఉన్నా సినిమా మీద ఉన్న అంచనాలను అందుకునే స్థాయిలో మాత్రం లేదంటున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ సినిమాకు మేజర్ డ్రా బ్యాక్‌గా చెపుతున్నారు. ఓవరాల్‌గా సాహో విజువల్ గ్రాండియర్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో అలరించినా బలహీనమైన కథ, కథనంలోని లోపాల కారణంగా అక్కడక్కడా కాస్త నిరాశపరుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment