సంతానంతో సాయిపల్లవి రొమాన్స్? | Sai Pallavi to Romance Santhanam in Selvaragavan Direction | Sakshi
Sakshi News home page

సంతానంతో సాయిపల్లవి రొమాన్స్?

Published Mon, Oct 17 2016 2:26 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

సంతానంతో సాయిపల్లవి రొమాన్స్?

సంతానంతో సాయిపల్లవి రొమాన్స్?

తలచినదే జరిగినదా దైవం ఎందులకు.. అన్న జీవిత సత్యాన్ని ఒక పాటలో చెప్పారో మహాకవి. అలాగే చేతి వరకూ వచ్చి నోటి దాకా రాలేదంటారు. నటి సాయి పల్లవి ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే కోలీవుడ్‌లో ఎదుర్కొంటున్నారు. మలయాళ చిత్రం ప్రేమమ్ ఘన విజయం అందులో నటించిన కథానాయికలకు పెద్ద వరంగా మారిందనే చెప్పాలి. అందులో ముఖ్యంగా మలర్ పాత్రలో టీచర్‌గా నటించిన సాయి పల్లవి నటనకు ప్రశంసలు వర్షం కురిపించారు. దీంతో సహజంగానే ఆ చిత్ర హీరోయిన్లు ముగ్గురిపై కోలీవుడ్ దృష్టి పడింది.
 
 అయితే సాయిపల్లవి మినహా ఇతర భామలు మంజిమామోహన్, మడోనా సెబాస్టియన్‌లకు ఇప్పటికే కోలీవుడ్‌లో అవకాశాలు వరుస కట్టాయి. ఇక సాయి పల్లవికి ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారి పోయింది. కార్తీకి జంటగా కాట్రు వెలియిడై చిత్రంలో నటించాల్సింది. చివరి క్షణంలో బాలీవుడ్ భామ అతిథిరావు వచ్చి చేరింది. మణిరత్నం చిత్రం మిస్ అవ్వడం సాయిపల్లవికి పెద్ద దెబ్బే. చాలా నిరాశకు గురైనట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో అవకాశం తలుపు తట్టిందన్నది కోలీవుడ్ టాక్. సంచలన దర్శకుడుగా పేరొందిన సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానంతో రొమాన్స్ చేయడానికి సాయి పల్లవి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
 
  ప్రస్తుతం ఎస్‌జే.సూర్య హీరోగా నెంజం మరప్పదిల్లై చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సెల్వరాఘవన్ తదుపరి సంతానం హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో నాయకిగా సాయి పల్లవిని నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అయితే ఈ సారి అయినా సాయి పల్లవికి కోలీవుడ్‌కు లైన్ క్లియర్ అవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. సంతానం ప్రస్తుతం వీటీవీ ప్రొడక్షన్స్ పతాకంపై సేతురామన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం కూడా ఆయన తాజా చిత్రానికి సమాంతరంగా చిత్రీకరణ జరుపుకోనున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement