హిట్ ట్రాక్ ఎక్కేశావంటున్నారు
‘‘హిట్ ట్రాక్ ఎక్కేశావ్ సాయి. ఇప్పట్నుంచీ నీ అసలు సిసలైన సక్సెస్ జర్నీ స్టార్ట్ అవుతుంది చూడ’ని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు సాయిరామ్ శంకర్. ఆయన హీరోగా సుదర్శన్ శైలేంద్ర దర్శకత్వంలో వంశీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీకాంత్‌రెడ్డి నిర్మించిన ‘నేనో రకం’ శుక్రవారం విడుదలైంది. ఈ థ్రిల్లింగ్ కిడ్నాప్ డ్రామాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని సాయిరామ్ శంకర్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘చాలా రోజులుగా ఇంత మంచి హిట్ కోసం వెయిటింగ్. ప్రతి ఏరియా నుంచి సూపర్‌హిట్ టాక్ వచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదిది.
ఓ సందేశం ఇస్తూ, థియేటర్లలో చివరి వరకూ ఉత్కంఠగా కూర్చోబెట్టడమనేది ప్రేక్షకులకు నచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో నాకూ, శరత్‌కుమార్‌గారికి మధ్య వచ్చే సీన్లు వాళ్లకు బాగా నచ్చాయి. రిలీజ్‌కు ముందే అన్నయ్య (పూరి జగన్నాథ్)కు సినిమా చూపించా. ‘సెకండాఫ్ చాలా బాగుంది. ప్రతి సీన్ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తించింది’ అన్నారాయన. ప్రేక్షకులూ అదే అంటుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘డేంజర్’, ‘హాలో ప్రేమిస్తా’ వంటి థ్రిల్లర్స్, కొత్త తరహా చిత్రాలను సాయిరామ్ శంకర్ పదేళ్ల క్రితమే చేశారు.
అటువంటి సినిమాలు చేయడం ప్రజెంట్ ట్రెండ్. ఆ సినిమాలను ఎర్లీగా చేశాననుకుంటున్నారా? అని సాయిరామ్ శంకర్‌ని అడగ్గా... ‘‘అంతే కదా! నా కెరీర్ ఎలా ఉండాలని నేననుకున్నానో అలాంటి ట్రెండ్ ఇప్పుడు మొదలైంది. ‘బంపర్ ఆఫర్’ తర్వాత సక్సెస్ జర్నీ కంటిన్యూ కావల్సింది. మధ్యలో చేసిన కొన్ని సినిమాల వల్ల కుదరలేదు. ఇకపై ట్రెండ్‌కి తగ్గట్టుండే సినిమాలు చేస్తా. ప్రస్తుతం చేస్తున్న ‘వాడు నేను కాదు’ ట్రెండీ సినిమానే. నాలుగు భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా 70 శాతం పూర్తయింది. ఇది కాకుండా రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. రీజనబుల్ బడ్జెట్‌లో న్యూ కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేయాలనుంది’’ అన్నారు.