సల్మాన్‌ సినిమాతో ఎంట్రీ.. బాలీవుడ్‌ను ఏలేశారు | Sajid Wajid Super Hit Films In Bollywood | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ సినిమాతో పరిచయం.. ఆపై ఎన్నో హిట్లు

Published Mon, Jun 1 2020 4:21 PM | Last Updated on Mon, Jun 1 2020 7:43 PM

Sajid Wajid Super Hit Films In Bollywood - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ ఫేమస్‌ సంగీత ద్వయం సాజిద్‌-వాజిద్‌లలో ఒకరైన వాజిద్‌ ఖాన్‌ ఆదివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా మారడంతో ముంబయిలోని కోకిలాబెన్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ వాజిద్‌ ప్రాణాలు విడిచారు. స‌ల్మాన్ ఖాన్ హీరోగా 1998లో వ‌చ్చిన ‘ప్యార్ కియా తో డ‌ర్‌నా క్యా’  చిత్రంతో సాజిద్-వాజిద్ ద్వ‌యం బాలీవుడ్‌కి  పరిచయం అయ్యారు. దాదాపు 20 ఏళ్ల సినీ ప్రయాణంలో వీరిద్దరు ఎన్నో సూపర్‌హిట్‌ పాటలకు సంగీతం అందించారు. వాటిలో బాగా ప్రసిద్ధి చెందిన కొన్ని పాటల వివరాలు...

ప్యార్‌ కియాతో డర్నా క్యా(1998)
సల్మాన్‌ హీరోగా వచ్చిన ఈ చిత్రం ద్వారా సాజిద్‌-వాజిద్‌ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో అర్భాజ్‌ ఖాన్‌పై తెరకెక్కించిన తేరి జవానీ సాంగ్‌ను సాజిద్‌-వాజిద్‌ ద్వయం కంపోజ్ చేశారు. ఈ సినిమా నుంచే సల్మాన్ ఖాన్‌కు‌, వాజిద్‌కు మధ్య స్నేహం కుదిరింది. 

హలో బ్రదర్‌(1999)
మరుసటి ఏడాదే సాజిద్‌-వాజిద్‌, సల్మాన్‌ హీరోగా నటించిన హలో బ్రదర్‌ చిత్రానికి.. హిమేష్ రేషమ్మియాతో పాటు సంగీతం అందించారు. ఈ చిత్రంలో ‘ఏరియా కా హీరో’, ‘హతా సావన్ కి ఘాటా’, ‘చుప్కే సే కోయి’తో పాటు హలో బ్రదర్‌‌ టైటిల్ ట్రాక్‌తో కలిపి మొత్తం నాలుగు పాటలకు సాజిద్‌-వాజిద్‌ సంగీతం అందించారు. 

తుమ్‌కో నా భూల్ పాయెంగే (2002)
1999 నుంచి 2002 కాలంలో కొన్ని హిట్‌ ట్రాక్‌ల తర్వాత సాజిద్-వాజిద్‌ ద్వయం మరోసారి సల్మాన్ చిత్రానికి సంగీతం అందించారు. సుస్మితా సేన్‌, దియా మీర్జా హీరోయిన్లుగా, సల్మాన్‌ హీరోగా నటించిన తుమ్‌కో నా భూల్ పాయెంగే చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘ముబారక్ ఈద్ ముబారక్’ పాట బాగా ప్రాచుర్యం పొందింది.

తేరే నామ్ (2003)
సల్మాన్ ఖాన్ కెరీర్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘తేరే నామ్’ ఒకటి. ఈ సినిమాకు కూడా సాజిద్-వాజిద్‌ ద్వయం, హిమేష్ రేషమ్మియాతో కలిసి సంగీతం సమకూర్చారు. చిత్రంలోని ‘సాథ్‌ జో మేరా చోడా’ పాట బాగా ప్రసిద్ధి చెందింది. 

ముజ్‌సే షాదీ కరోగి, గర్వ్ (2004)
2004 సంత్సరం భాయిజాన్‌తో పాటు సాజిద్‌-వాజిద్‌లకు కూడా బాగా కలసి వచ్చింది. ఆ ఏడాది సల్మాన్‌ నటించిన ముజ్‌సే షాదీ కరోగి, గర్వ్‌ చిత్రాలు రెండు బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. ఈ రెండు చిత్రాల్లోని మొత్తం 12 పాటలకు సాజిద్‌-వాజిద్‌ ద్వయం సంగీతం అందించారు. ‘గర్వ్’‌ చిత్రంలోని ‘హమ్ తుమ్‌కో నిగహోన్ మెయిన్’, ‘దమ్ మస్త్‌ మస్త్’‌, ‘సోనియే తో సోనీ’, ‘ఫరియాద్ క్యా కరే హామ్’, ‘తేరే హై దివానా దిల్’ పాటలకు సంగీతం అందించారు.  అలానే ‘ముజ్‌సే షాదీ కరోగి’ చిత్రంలో ‘రబ్ కరే, ‘ముజ్సే షాదీ కరోగి’, ‘ఆజా సోనియే’, దాని రీమిక్స్ వెర్షన్లు, ‘లాహూ బాంకే అన్సూన్’, ‘కార్ డూన్ కమల్’‌, ‘లాల్ దుపట్టా’తో కలిపి మొత్తం ఏడు పాటలకు సంగీతం సమకూర్చారు. 

ది కిల్లర్ (2006)
ఇమ్రాన్ హష్మి నటించిన ‘ది కిల్లర్’.. సాజిద్-వాజిద్ సోలోగా సంగీతం అందించిన చిత్రం. ఈ సినిమా సంగీతం, పాటలు చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇన్ని రోజులు సల్మాన్ ఖాన్ చిత్రాలకు మాత్రమే పని చేస్తారనే విమర్శను ఈ చిత్రం తుడిచేయడమే కాక ఇండస్ట్రీలో వారి స్థానాన్ని సుస్థిరం చేసింది. 

పార్టనర్‌(2007)
ఈ చిత్రంలోని పాటలు ఇప్పుడు విన్నా.. మనకు తెలియకుండానే కాళ్లు కదుపుతాం. ఈ సినిమాతో సాజిద్‌-వాజిద్‌ కీర్తి రెట్టింపు అయ్యింది. ఇదే ఏడాది సాజిద్‌-వాజిద్‌ ద్వయం, అక్షయ్‌ కుమార్‌, అనిల్‌ కపూర్‌, కత్రినా కైఫ్‌ నటించిన ‘వెల్‌కమ్‌’ చిత్రంలోని ఓ పాటకు సంగీతం అందించారు.

వాంటెడ్‌(2009)
సల్మాన్‌ ఖాన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి సాజిద్‌-వాజిద్‌లే సంగీతం సమకూర్చారు. మరోసారి ఈ ముగ్గురి మ్యాజిక్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 

దబాంగ్‌(2010)
దబాంగ్‌, దాని తర్వాత వచ్చిన ఈ చిత్ర సీక్వెల్స్‌‌ అన్నింటికి సాజిద్‌-వాజిద్‌ ద్వయమే సంగీతం సమకూర్చారు. దబాంగ్‌ చిత్రంలోని ‘మున్ని బద్నామ్‌ హూయి’ పాట దేశ వ్యాప్తంగా ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

హౌస్‌ఫుల్‌ 2, రౌడీ రాథోడ్‌ (2012)
2012 ఏడాది అక్షయ్‌ కుమార్‌తో పాటు సాజిద్‌-వాజిద్‌లకు కూడా బాగా కలసి వచ్చింది. ఒక్క ఏడాదిలో అక్షయ్‌ రెండు బాక్సాఫీస్‌ హిట్‌ చిత్రాలను విడుడదల చేస్తే ఈ రెండు చిత్రాలకు సాజిద్‌-వాజిద్‌లే సంగీతం సమకూర్చారు. 

దబాంగ్‌ 2, ఏక్‌ థా టైగర్‌(2012)
దబాంగ్‌ 2 చిత్రంతో సాజిద్‌-వాజిద్‌లిద్దరు గేయ రచయితలుగా మారారు. ‘ఫెవికల్‌ సే’ పాటను ఇద్దరు రచించగా.. వాజిద్‌ మరో అడుగు ముందుకు వేసి.. గాయకుడి అవతారం ఎత్తారు. చిత్రంలో ‘పాండే జీ సీతి’, ‘ఫెవికోలస్‌ సే’ పాటలను వాజిద్‌ పాడారు. అలానే  సల్మాన్‌ ‘ఏక్‌ థా టైగర్‌’‌ చిత్రంలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ మాషల్లా పాటకు  వీరు సంగీతం సమకూర్చారు. 

మే తెరా హీరో, హీరోపంటి (2014)
2014 వచ్చే సరికి సాజిద్‌-వాజిద్‌లు బాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందిన ప్రతి అల్బామ్‌లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ క్రమంలో వరుణ్‌ ధావన్‌ హీరోగా వచ్చిన మే తేరా హీరో, టైగర్‌ ష్రాఫ్‌ హీరోపంటి చిత్రానికి సంగీతం సమకూర్చారు. అలానే ఇదే ఏడాది విడుదైలన సల్మాన్‌ ‘జయహో’ చిత్రానికి వీరు మ్యూజిక్‌ అందించారు. అయితే సినిమా విజయం సాధించకపోయినప్పటికి.. పాటలు మాత్రం బాగా ప్రసిద్ది చెందాయి. 

జుడ్వా (2017)
సల్మాన్‌ ఖాన్‌ ద్విపాత్రిభినయంలో కరిష్మా కపూర్‌, రంభ జంటగా వచ్చిన ‘జుడ్వా’ చిత్రానికి రిమేక్‌గా ‘జుడ్వా 2’ తెరకెక్కింది. వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి అను మాలిక్‌తో పాటు సాజిద్‌-వాజిద్‌లు కూడా సంగీతాన్ని అందించారు.

దబాంగ్‌ 3(2019)
ఏడు సంవత్సరాల తర్వాత సల్మాన్‌ చుల్‌బుల్‌ పాండేగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తనతో పాటు సంగీత ద్వయం సాజిద్‌-వాజిద్‌లను కూడా తీసుకొచ్చాడు. ఈ చిత్రానికి వీరిద్దరే సంగీతం సమకూర్చారు. ఈ చ్రితంలో ‘హుద్‌ హుద్‌ దబాంగ్‌’, ‘మున్నీ బద్నామ్‌’కు కొత్త వర్షన్‌ ‘మున్నా బద్నాం’ పాటలు బాగా  పాపులర్‌ అయ్యాయి. ఇవేకాక లాక్‌డౌన్‌లోనూ హీరో స‌ల్మాన్ ఖాన్ "భాయ్ భాయ్" పాట‌‌కు వాజీద్‌ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement