‘‘నేను ప్రేమకథా చిత్రాలు చేయనంటే కేవలం వాణిజ్య అంశాలతో కూడుకున్న సినిమాలే చేస్తానని కాదు. ‘టాక్సీవాలా’ (2018) లాంటి ప్రేమకథ చిత్రం వస్తే చేస్తానేమో. ప్రేమే ప్రధానాంశంగా ఉన్న ‘అర్జున్‌రెడ్డి’ (2017), ‘డియర్ కామ్రేడ్’ (2019) వంటివి చేయకూడదనుకుంటున్నాను. ప్రస్తుతం కెరీర్‌లో ఓ మార్పు కోరుకుంటున్నాను. పూరీగారితో సినిమా చేస్తున్నాను కాబట్టి నాలో కాన్ఫిడెన్స్ పెరిగి ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని కాదు. చిన్నతనం నుంచే నాది ఓవర్ కాన్ఫిడెన్స్’’ అన్నారు విజయ్ దేవరకొండ. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఈ నెల 14న రిలీజవుతోంది. ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు.
నేను సినిమాల్లోకి వద్దామనుకుంటున్నప్పుడు... ‘మీ నాన్నగారికి కుదర్లేదు కదా. సక్సెస్ ఉండదు. డబ్బులు రావు’ అన్నారు. సో.. మెంటల్‌గా భయంగానే ఉంటుంది. ఇప్పటికీ నాకు ఆ భయం ఉంటుంది. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని మనల్ని మనం నిరూపించుకోవాలి. లేకపోతే భయంలోనే కొట్టుకుంటూ పోతాం. కొత్త తరం మారాలి. అందుకు నా వంతు డ్యూటీ చేస్తాను.
► స్క్రిప్ట్ పరంగా ఈ సినిమాలో మూడు ప్రేమకథలు ఉన్నాయి. వీటిలో సీనయ్య, సువర్ణల ప్రేమకథ ఒకటి. ఒక చిన్న ఊర్లో పెద్దగా చదువు లేని భార్యాభర్తల మధ్య సాగే కథ. ఇందులో సీనయ్య పాత్రకు బాధ్యతలు ఎక్కువ. ఈ పాత్రకు రిఫరెన్స్‌గా మా నాన్నగారిని తీసుకున్నాను. మరోవైపు బాధ్యత అనేదే తెలియకుండా సౌకర్యంగా ప్యారిస్‌లో జీవితాన్ని గడిపే ఓ యువకుడి లవ్‌స్టోరీ. ఇంకోటి కొత్తగూడెంలోని ఓ కాలేజీ ప్రేమకథ. ఈ లవ్‌స్టోరీకి కాస్త ‘అర్జున్ రెడ్డి’ టచ్ ఉండొచ్చు. మూడు ప్రేమకథలకు సినిమాలో రిలేషన్ ఉంది. అదేంటో ప్రేక్షకులు వెండితెరపై చూడాలి.
►ఈ సినిమా కోసం మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా కష్టపడ్డాను. కొత్తగూడెం లవ్‌స్టోరీకి మీసాలు పెట్టి, చిన్న జుట్టు ఉన్న హెయిర్‌స్టైల్‌తో కనిపించాలి. ప్యారిస్ కథకు కొంచెం ఫ్యాషన్‌గా కనిపించాలి. కాలేజ్ కథకు ఆ స్పెషల్ టచ్ ఉండాలి. ఇలా క్యారెక్టర్స్ కోసం శ్రమించాల్సి వచ్చింది. క్రాంతి (చిత్రదర్శకుడు క్రాంతి మాధవ్) బలం రైటింగ్. నా నటనను పక్కనపెడితే మిగతా క్రెడిట్ ఆయనకు, కెమెరామేన్ జయకృష్ణ గుమ్మాడి, నిర్మాత కేఎస్ రామారావుగారికి దక్కుతుంది.
► నేను యాక్షన్ సినిమాకి గెడ్డం పెంచినా, ఓ సైన్స్‌ఫిక్షన్ సినిమాకి గెడ్డం పెంచినా ‘అర్జున్‌రెడ్డి’యే అంటారు. అది నాకు తప్పదు. ఒక ఫ్లాప్ సినిమాతో కంపేర్ చేస్తే అది నన్ను బాధపెడుతుంది. కానీ ‘అర్జున్‌రెడ్డి’ లాంటి క్రేజీ హిట్ మూవీతో పోల్చడం బాగానే ఉంది.
► ‘వరల్డ్ ఫేమస్...’ ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చినవారిని (ఫ్యాన్స్) చూసి ఆశ్చర్యపోయాను. వారితో నాకు ఏ అనుబంధం లేకపోయినా ఇంతమంది ఎందుకు వస్తున్నారు అనుకున్నా! టికెట్ బుకింగ్స్ చూసి షాకయ్యాను. వారి ప్రేమ, అభిమానం గొప్పవి. అందుకే మా ఆడియన్స్‌కు నా బెస్ట్ వెర్షన్ సినిమాలను ఇవ్వాలనుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు శక్తివంచన లేకుండా కష్టపడాలనుకుంటున్నాను.
► ‘వరల్డ్ ఫేమస్ లవర్’ నా తొమ్మిదో సినిమా. వీటిలో ఆరు సినిమాలు కొత్త దర్శకులతో తెరకెక్కినవే. మొదట్లో సర్వైవల్ కోసం సినిమాలు చేశాను. ఇప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. రాబోయే రెండేళ్లు యాక్టర్‌గా నా కెరీర్‌లో న్యూ ఫేజ్ అనుకుంటున్నాను. కొత్త రకం కథలను ప్రయత్నించాలనుకుంటున్నాను.
► నిజానికి ప్రేమ కాన్సెప్ట్ నాకు ఒకప్పుడు నాన్సెన్స్‌లా తోచింది. ప్రేమలో కూడా చాలా దశలు ఉంటాయి. ఒక అబ్బాయి ముందు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. నాది ట్రూ లవ్ అంటాడు. అనుకోని కారణాల వల్ల అది బ్రేకప్ అయినప్పుడు వేరే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అది కూడా ట్రూ లవ్ అంటాడు. అసలు ఎవరితోనూ ప్రేమలో లేనప్పుడు... మొదట ప్రేమించిన అమ్మాయి, రెండోసారి ప్రేమించిన అమ్మాయి ఒకేసారి కనిపిస్తే, ఎవరితో ముందుగా ప్రేమలో పడతాడు? అనే అయోమయంలో ఉండేవాడిని. ఇప్పుడు అలా లేదు. జీవితంలో లవ్ అనే స్ట్రాంగ్ ఎమోషన్ ఉండాలనే ఆలోచన ఉన్న ఫేజ్‌లో ఉన్నాను. ట్రూ లవ్ ఉంటుందనే అనుకుంటున్నాను.
► పెళ్లి చేసుకుంటాను. పెళ్లి అనేది బాధ్యతతో కూడుకున్నది. ఆ బాధ్యత తీసుకోవడానికి ప్రస్తుతం నేను మానసికంగా సిద్ధంగా లేను. నాకు 30 ఏళ్లు వచ్చాయి. కొన్ని విషయాల్లో పెద్దవాణ్ని అయిపోయాననిపిస్తుంది. కానీ పెళ్లి అనగానే నేను ఇంకా పిల్లోణ్నే అనిపిస్తుంది.
► నా గురించి వ్యతిరేక వ్యాఖ్యలు, పోస్ట్‌లు చేసేవారు ఉంటారు. వారు నా గురించి అంతగా ఆలోచిస్తున్నారు అంటే వారికి నేనంటే ఎంతో ప్రేమ ఉండి ఉంటుంది. వారు నిద్రపోయేప్పుడు కూడా నేనే గుర్తుకు వస్తానేమో. విమర్శలను ఇష్టపడతాను. కానీ విలువైన విమర్శలనే తీసు కుంటాను.
Comments
Please login to add a commentAdd a comment