ఈ ప్రేమాగీమా వద్దు...ఇప్పుడప్పుడే పెళ్లి కూడా వద్దు! | Samantha exclusive interview | Sakshi
Sakshi News home page

ఈ ప్రేమాగీమా వద్దు...ఇప్పుడప్పుడే పెళ్లి కూడా వద్దు!

Published Mon, Apr 13 2015 10:30 PM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM

ఈ ప్రేమాగీమా వద్దు...ఇప్పుడప్పుడే పెళ్లి కూడా వద్దు!

ఈ ప్రేమాగీమా వద్దు...ఇప్పుడప్పుడే పెళ్లి కూడా వద్దు!

 నేను డాటరాఫ్ ప్రభు...
 మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్...
 నేనంతే.. ఏదనుకుంటే
 అది బయటికి చెప్పేస్తా...
 ఈ ప్రేమలూ గీమలూ వద్దండి బాబూ...
 వ్యాపారవేత్తతో నాకు పెళ్లి కుదిరిందా...
 అలీగారు ఆ కామెంట్ ఎందుకు చేశారో నాకు తెలుసు...

 
 ఇలా బోల్డన్ని కబుర్లు చాలా ఓపెన్‌గా చెప్పారు సమంత. అల్లు అర్జున్ సరసన ఆమె నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదల రోజున     ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించడం షాక్‌కి గురి చేసిందని సమంత  అన్నారు. మరిన్ని విశేషాలను ఇంటర్వ్యూలో ఈ విధంగా పంచుకున్నారు.
 
 డాటరాఫ్ ప్రభు... ఓసారి మీ నాన్నగారి గురించి చెబుతారా?
 మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. ఆయన స్కూల్ టీచర్‌గా చేసేవారు. ఎలా పడితే అలా ఉంటే ఆయనకు నచ్చేది కాదు. ఇవాళ నేనింత క్రమశిక్షణగా ఉన్నానంటే ఆయన పెంపకమే కారణం. బాల్యంలో మన తల్లిదండ్రులు ఎలా పెంచితే, భవిష్యత్తులో మనం అలా ఉంటాం. సో.. ప్రభుగారికి కూతుర్ని అయినందుకు ఆనందం, గర్వం.. రెండూ ఉన్నాయి.
 
 ఇక, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ గురించి చెప్పండి?
 నిస్సందేహంగా ఈ చిత్రం విజయం సాధించడం ఖాయం అనుకున్నా. కానీ, మొదటిరోజు వచ్చిన మిశ్రమ స్పందన, రివ్యూలు నన్ను షాక్‌కి గురి చేశాయి. ఈ సినిమాకు కూడా ఇలా జరుగుతుందా? అనిపించింది. కానీ, రెండో రోజుకే మంచి స్పందన మొదలైంది. మూడో రోజు మరింత మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రం మంచి వసూళ్లు రాబడుతూ ముందుకు సాగుతోంది.
 
 అల్లు అర్జున్ సరసన సినిమా అనగానే ఎలా అనిపించింది?
 ముందు కాస్ట్యూమ్స్ గురించి శ్రద్ధ తీసుకోవాలనుకున్నాను. ఎందుకంటే బన్నీ (అల్లు అర్జున్) చాలా స్టయిలిష్‌గా ఉంటాడు. తన సరసన నేను పనిమనిషిలా ఉండకూడదు కదా (నవ్వుతూ).
 
 కొంచెం సన్నబడినట్లుగా కూడా అనిపిస్తోంది?
 అవును. ఇది కూడా బన్నీ కోసమే. స్లిమ్‌గా ఉంటాడు కాబట్టి, తన ముందు నేను పెద్దదానిలా కనిపించకూడదు కదా. అందుకే కొంచెం తగ్గా. ఆ సంగతలా ఉంచితే బన్నీ మంచి డాన్సర్. లక్కీగా ఈ చిత్రంలో నాకు పెద్దగా స్టెప్స్ లేకపోవడంతో తప్పించుకున్నా. బన్నీ చాలా ఎనర్జిటిక్. ఎంతో అంకితభావం, క్రమశిక్షణతో పని చేస్తాడు. నేను కూడా క్రమశిక్షణగానే ఉంటాను. కానీ, తను ఇంకా అన్నమాట. నేను దాదాపు సీనియర్ హీరోలతో ఎక్కువగా సినిమాలు చేస్తుంటాను. బన్నీ, నాదీ దాదాపు ఒకే వయసు కాబట్టి,  షూటింగ్ సరదా సరదాగా  చేశాం.
 
 ‘అత్తారింటికి దారేది’ తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో సినిమా చేయడం..?
 నేను త్రివిక్రమ్ అభిమానిని. మనం ఏదైనా సందేహాలు అడిగితే ‘నేనుండగా భయమేల’ అని ఆ దేవుడు అభయమిచ్చినట్లుగా చెబుతారు. అందుకే తను నాకు గురువు అంటే కరెక్ట్‌గా ఉంటుంది.
 
 ఈ చిత్రంలో డయాబెటిక్ పేషెంట్‌గా నటించినందుకు మీ అభిమానులు ఫీలవుతున్నారు?
 ఈ పాత్ర ఎందుకు చేశారు? అని కొంతమంది అడిగారు. అసలు లోపం లేని వ్యక్తులు ఉంటారా? అలాగే ఈ చిత్రంలో సమీరా (సమంత చేసిన పాత్ర)కు డయాబెటిస్ ఉంటుంది. రెండేళ్ల క్రితం నాకు లో షుగర్ ఉండేది. అంటే.. అది డయాబెటిస్ కాదనుకోండి. ఆ సంగతలా ఉంచితే.. ఈ చిత్రంలో సమీరా పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది.     ఈ పాత్రను చాలా ఎంజాయ్ చేశాను.
 
 ఈ చిత్రంలో నిత్యామీనన్, అదాశర్మతో కలిసి నటించారు కదా.. ఇద్దరు, ముగ్గురు నాయికలున్న చిత్రాలు చేయడం మీకిష్టమేనా?
 ప్రేక్షకులకు ఒక్క హీరోయిన్ సరిపోవడంలేదు కదా. ఇద్దరు, ముగ్గురు ఉండాలనుకుంటున్నారు. వాళ్ల ఇష్టమే నా ఇష్టం. నాకు ఇతర నాయికలతో పని చేయడం ఇబ్బంది లేదు. ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు అదాశర్మ మొదటిరోజు నటన చూసి, ఆశ్చర్యపోయాను. అంత బాగా నటించింది. చాలా మంచి అమ్మాయి కూడా. అందుకే, అదాశర్మకి మంచి పాత్రలు రావాలని కోరుకుంటున్నాను. ఇక, నిత్యామీనన్ అయితే మంచి నటి. తనంటే నాకు చాలా గౌరవం.
 
 అదేంటి.. చేతి మీద ఏదో చిన్న గాయం కనిపిస్తోంది?
 ఇది ఓ తమిళ సినిమా తాలూకు తీపి గుర్తు. ఆ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు అయిన గాయం. ఈ సినిమాలో నేనిప్పటివరకూ చేయనంత క్లిష్టమైన పాత్ర చేస్తున్నా. ‘ఒకవేళ ఏదైనా కష్టమైన పాత్ర వస్తే మనం నటించగలమా? అసలు మనం మంచి నటేనా?’ అని నన్ను నేను ప్రశ్నించుకుంటే, దానికి సమాధానంగా ఈ సినిమాని చెప్పుకుంటా. నా పాత్ర అంత బాగుంటుంది. నాలో మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. విక్రమ్ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదలవుతుంది.
 
 తెలుగు సినిమాలు తగ్గించినట్లున్నారు?
 ఇక్కడికొచ్చి ఐదేళ్లయ్యింది. ఈ ఐదేళ్లల్లో గ్లామరస్ రోల్స్ చాలానే చేశాను. ఇప్పుడూ అవే చేస్తే, ఇక మజా ఏముంటుంది? అందుకే నటనకు అవకాశం ఉన్న పాత్రలే చేయాలనుకుంటున్నా. తమిళంలో అలాంటి వచ్చాయి కాబట్టి, అక్కడ వరుసగా సినిమాలు ఒప్పుకున్నా. నాకు కథ, దర్శకుడు ముఖ్యం. ఆ రెండూ బాగా కుదిరితే అప్పుడు హీరో గురించి ఆలోచిస్తా.
 
 అవునూ.. ఎవరో వ్యాపారవేత్తతో మీకు పెళ్లి కుదిరిందట?
 అవునా? ఆ వ్యాపారవేత్త ఎవరో చెప్పి పుణ్యం కట్టుకోండి. ఆయనేం వ్యాపారం చేస్తున్నారో కూడా చెప్పండి. నాకు భాగస్వామిని వెతుక్కునే బాధ తప్పుతుంది. ఆర్టిస్ట్‌తో ముడిపెట్టనందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే, నేను సినిమా ఆర్టిస్ట్‌ని పెళ్లి చేసుకోను. వ్యాపారవేత్త అంటే ఇష్టమే. అందుకే, ఆయన ఫోన్ నంబర్ ఇవ్వండి... మాట్లాడుకుంటా. అదేంటి?ఎందుకులెండి? ఈ ప్రేమా గీమా అవన్నీ వద్దు. ఇప్పుడప్పుడే పెళ్లి కూడా వద్దండీ బాబు.
 
 సామాజిక మాధ్యమం ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదాల్లో నిలుస్తుంటారు.. అయినప్పటికీ ఇంకా అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారా?
 తప్పకుండా చేస్తా. నా మనసుకి ఏది అనిపిస్తే అది నిర్భయంగా బయటకు చెప్పేస్తా. మనిషి వెనుక మాట్లాడే మనస్తత్వం కాదు నాది. నేనెంత ముక్కుసూటిగా ఉంటానో నాతో పరిచయం ఉన్నవాళ్లకి బాగా తెలుసు.
 
 ఆ మధ్య అలీ మీ నడుముని ‘బెంజి సర్కిల్’ అని కామెంట్ చేశారు.. దానికి మీ స్పందన?
 నవ్వుకున్నా. అలీ నాకు మంచి స్నేహితుడు. తను ఆ కామెంట్‌ని సరదాగా చేసి ఉంటాడని నాకు తెలుసు. అందుకే, కనీసం ఫోన్ కూడా చేసి అడగలేదు.
 
 నిర్మాతగా మారాలనుకుంటున్నారట?
 అంత పని చేయను. నేను నటించిన సినిమా హిట్టవుతుందా? లేదా? అనే ఒత్తిడితోనే చచ్చిపోతుంటాను. ఇక, డబ్బులు పెడితే ఒకేసారి చచ్చిపోవడం కాదు.. కోమాలోకి వెళ్లిపోతాను.
 
 
 హీరోయిన్‌గా మీ నంబర్ ఏంటో తెలుసా?
 నంబర్ గేమ్‌లోకి నన్ను లాగొద్దండి. ఈ శుక్రవారం నా సినిమా హిట్టయితే నేనే నంబర్ వన్. వచ్చే వారం వేరే హీరోయిన్. ఒకవేళ నా సినిమా ఫ్లాప్ అయ్యిందనుకోండి.. అప్పుడు అంతకు ముందు నా హిట్ సినిమాలన్నింటినీ మర్చిపోతారు. ఒక్కసారిగా నన్ను మేడ మీద నుంచి కిందకు తోసేస్తారు (నవ్వుతూ). అందుకే జయాపజయాలను, నంబర్లను నెత్తికి ఎక్కించుకోకూడదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement