S/O Satyamurthy
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చైల్డ్ ఆర్టిస్ట్
ఇప్పుడు తగ్గిపోయారు గానీ ఒకప్పుడు తెలుగులో దాదాపు ప్రతి సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్టులుగా ఉండేవారు. హీరోహీరోయిన్లలానే వీళ్లు కూడా మంచి క్రేజ్ సంపాదించేవారు. అలా 'సన్నాఫ్ సత్యమూర్తి' మూవీలో స్వీటీగా యాక్ట్ చేసిన బేబీ వర్ణిక ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఏకంగా 'పుష్ప 2' పాటకు స్టెప్పులేసి అదరగొట్టేసింది. ఇంతకీ ఇప్పుడెలా ఉందో తెలుసా?(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)బేబి వర్ణిక గురించి పెద్దగా డీటైల్స్ అయితే తెలియవు. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా తర్వాత నాన్నకు ప్రేమతో, బంగారు బాబు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత చదువు కోసం పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు పుష్ప కపుల్ సాంగ్‌కి అదిరిపోయే డ్యాన్స్ చేసింది.చిన్నప్పుడు చబ్బీగా బూరె బుగ్గలతో ఉన్న వర్ణిక కాస్త ఇప్పుడు టీనేజ్‌లోకి వచ్చేసింది. ఒడ్డు పొడుగు చూస్తే హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గలేదు. స్టెప్పులు అవి చూస్తుంటే త్వరలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేస్తుందేమో అనిపిస్తుంది. మరి బేబీ వర్ణిక లేటెస్ట్ వీడియో మీరు చూసేయండి.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ) View this post on Instagram A post shared by Doe Cinema (@thedoecinema)S/O satyamurthy kid Vernika got transformed into a grown up one and is looking like this now!!#Pushpa2TheRule #Pushpa2 pic.twitter.com/Nm8jEMxtZ5— Vamc Krishna (@lyf_a_zindagii) June 13, 2024 -
ఈ ప్రేమాగీమా వద్దు...ఇప్పుడప్పుడే పెళ్లి కూడా వద్దు!
నేను డాటరాఫ్ ప్రభు... మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్... నేనంతే.. ఏదనుకుంటే అది బయటికి చెప్పేస్తా... ఈ ప్రేమలూ గీమలూ వద్దండి బాబూ... వ్యాపారవేత్తతో నాకు పెళ్లి కుదిరిందా... అలీగారు ఆ కామెంట్ ఎందుకు చేశారో నాకు తెలుసు... ఇలా బోల్డన్ని కబుర్లు చాలా ఓపెన్‌గా చెప్పారు సమంత. అల్లు అర్జున్ సరసన ఆమె నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదల రోజున ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించడం షాక్‌కి గురి చేసిందని సమంత అన్నారు. మరిన్ని విశేషాలను ఇంటర్వ్యూలో ఈ విధంగా పంచుకున్నారు. డాటరాఫ్ ప్రభు... ఓసారి మీ నాన్నగారి గురించి చెబుతారా? మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. ఆయన స్కూల్ టీచర్‌గా చేసేవారు. ఎలా పడితే అలా ఉంటే ఆయనకు నచ్చేది కాదు. ఇవాళ నేనింత క్రమశిక్షణగా ఉన్నానంటే ఆయన పెంపకమే కారణం. బాల్యంలో మన తల్లిదండ్రులు ఎలా పెంచితే, భవిష్యత్తులో మనం అలా ఉంటాం. సో.. ప్రభుగారికి కూతుర్ని అయినందుకు ఆనందం, గర్వం.. రెండూ ఉన్నాయి. ఇక, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ గురించి చెప్పండి? నిస్సందేహంగా ఈ చిత్రం విజయం సాధించడం ఖాయం అనుకున్నా. కానీ, మొదటిరోజు వచ్చిన మిశ్రమ స్పందన, రివ్యూలు నన్ను షాక్‌కి గురి చేశాయి. ఈ సినిమాకు కూడా ఇలా జరుగుతుందా? అనిపించింది. కానీ, రెండో రోజుకే మంచి స్పందన మొదలైంది. మూడో రోజు మరింత మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రం మంచి వసూళ్లు రాబడుతూ ముందుకు సాగుతోంది. అల్లు అర్జున్ సరసన సినిమా అనగానే ఎలా అనిపించింది? ముందు కాస్ట్యూమ్స్ గురించి శ్రద్ధ తీసుకోవాలనుకున్నాను. ఎందుకంటే బన్నీ (అల్లు అర్జున్) చాలా స్టయిలిష్‌గా ఉంటాడు. తన సరసన నేను పనిమనిషిలా ఉండకూడదు కదా (నవ్వుతూ). కొంచెం సన్నబడినట్లుగా కూడా అనిపిస్తోంది? అవును. ఇది కూడా బన్నీ కోసమే. స్లిమ్‌గా ఉంటాడు కాబట్టి, తన ముందు నేను పెద్దదానిలా కనిపించకూడదు కదా. అందుకే కొంచెం తగ్గా. ఆ సంగతలా ఉంచితే బన్నీ మంచి డాన్సర్. లక్కీగా ఈ చిత్రంలో నాకు పెద్దగా స్టెప్స్ లేకపోవడంతో తప్పించుకున్నా. బన్నీ చాలా ఎనర్జిటిక్. ఎంతో అంకితభావం, క్రమశిక్షణతో పని చేస్తాడు. నేను కూడా క్రమశిక్షణగానే ఉంటాను. కానీ, తను ఇంకా అన్నమాట. నేను దాదాపు సీనియర్ హీరోలతో ఎక్కువగా సినిమాలు చేస్తుంటాను. బన్నీ, నాదీ దాదాపు ఒకే వయసు కాబట్టి, షూటింగ్ సరదా సరదాగా చేశాం. ‘అత్తారింటికి దారేది’ తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో సినిమా చేయడం..? నేను త్రివిక్రమ్ అభిమానిని. మనం ఏదైనా సందేహాలు అడిగితే ‘నేనుండగా భయమేల’ అని ఆ దేవుడు అభయమిచ్చినట్లుగా చెబుతారు. అందుకే తను నాకు గురువు అంటే కరెక్ట్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో డయాబెటిక్ పేషెంట్‌గా నటించినందుకు మీ అభిమానులు ఫీలవుతున్నారు? ఈ పాత్ర ఎందుకు చేశారు? అని కొంతమంది అడిగారు. అసలు లోపం లేని వ్యక్తులు ఉంటారా? అలాగే ఈ చిత్రంలో సమీరా (సమంత చేసిన పాత్ర)కు డయాబెటిస్ ఉంటుంది. రెండేళ్ల క్రితం నాకు లో షుగర్ ఉండేది. అంటే.. అది డయాబెటిస్ కాదనుకోండి. ఆ సంగతలా ఉంచితే.. ఈ చిత్రంలో సమీరా పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ పాత్రను చాలా ఎంజాయ్ చేశాను. ఈ చిత్రంలో నిత్యామీనన్, అదాశర్మతో కలిసి నటించారు కదా.. ఇద్దరు, ముగ్గురు నాయికలున్న చిత్రాలు చేయడం మీకిష్టమేనా? ప్రేక్షకులకు ఒక్క హీరోయిన్ సరిపోవడంలేదు కదా. ఇద్దరు, ముగ్గురు ఉండాలనుకుంటున్నారు. వాళ్ల ఇష్టమే నా ఇష్టం. నాకు ఇతర నాయికలతో పని చేయడం ఇబ్బంది లేదు. ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు అదాశర్మ మొదటిరోజు నటన చూసి, ఆశ్చర్యపోయాను. అంత బాగా నటించింది. చాలా మంచి అమ్మాయి కూడా. అందుకే, అదాశర్మకి మంచి పాత్రలు రావాలని కోరుకుంటున్నాను. ఇక, నిత్యామీనన్ అయితే మంచి నటి. తనంటే నాకు చాలా గౌరవం. అదేంటి.. చేతి మీద ఏదో చిన్న గాయం కనిపిస్తోంది? ఇది ఓ తమిళ సినిమా తాలూకు తీపి గుర్తు. ఆ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు అయిన గాయం. ఈ సినిమాలో నేనిప్పటివరకూ చేయనంత క్లిష్టమైన పాత్ర చేస్తున్నా. ‘ఒకవేళ ఏదైనా కష్టమైన పాత్ర వస్తే మనం నటించగలమా? అసలు మనం మంచి నటేనా?’ అని నన్ను నేను ప్రశ్నించుకుంటే, దానికి సమాధానంగా ఈ సినిమాని చెప్పుకుంటా. నా పాత్ర అంత బాగుంటుంది. నాలో మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. విక్రమ్ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదలవుతుంది. తెలుగు సినిమాలు తగ్గించినట్లున్నారు? ఇక్కడికొచ్చి ఐదేళ్లయ్యింది. ఈ ఐదేళ్లల్లో గ్లామరస్ రోల్స్ చాలానే చేశాను. ఇప్పుడూ అవే చేస్తే, ఇక మజా ఏముంటుంది? అందుకే నటనకు అవకాశం ఉన్న పాత్రలే చేయాలనుకుంటున్నా. తమిళంలో అలాంటి వచ్చాయి కాబట్టి, అక్కడ వరుసగా సినిమాలు ఒప్పుకున్నా. నాకు కథ, దర్శకుడు ముఖ్యం. ఆ రెండూ బాగా కుదిరితే అప్పుడు హీరో గురించి ఆలోచిస్తా. అవునూ.. ఎవరో వ్యాపారవేత్తతో మీకు పెళ్లి కుదిరిందట? అవునా? ఆ వ్యాపారవేత్త ఎవరో చెప్పి పుణ్యం కట్టుకోండి. ఆయనేం వ్యాపారం చేస్తున్నారో కూడా చెప్పండి. నాకు భాగస్వామిని వెతుక్కునే బాధ తప్పుతుంది. ఆర్టిస్ట్‌తో ముడిపెట్టనందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే, నేను సినిమా ఆర్టిస్ట్‌ని పెళ్లి చేసుకోను. వ్యాపారవేత్త అంటే ఇష్టమే. అందుకే, ఆయన ఫోన్ నంబర్ ఇవ్వండి... మాట్లాడుకుంటా. అదేంటి?ఎందుకులెండి? ఈ ప్రేమా గీమా అవన్నీ వద్దు. ఇప్పుడప్పుడే పెళ్లి కూడా వద్దండీ బాబు. సామాజిక మాధ్యమం ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదాల్లో నిలుస్తుంటారు.. అయినప్పటికీ ఇంకా అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారా? తప్పకుండా చేస్తా. నా మనసుకి ఏది అనిపిస్తే అది నిర్భయంగా బయటకు చెప్పేస్తా. మనిషి వెనుక మాట్లాడే మనస్తత్వం కాదు నాది. నేనెంత ముక్కుసూటిగా ఉంటానో నాతో పరిచయం ఉన్నవాళ్లకి బాగా తెలుసు. ఆ మధ్య అలీ మీ నడుముని ‘బెంజి సర్కిల్’ అని కామెంట్ చేశారు.. దానికి మీ స్పందన? నవ్వుకున్నా. అలీ నాకు మంచి స్నేహితుడు. తను ఆ కామెంట్‌ని సరదాగా చేసి ఉంటాడని నాకు తెలుసు. అందుకే, కనీసం ఫోన్ కూడా చేసి అడగలేదు. నిర్మాతగా మారాలనుకుంటున్నారట? అంత పని చేయను. నేను నటించిన సినిమా హిట్టవుతుందా? లేదా? అనే ఒత్తిడితోనే చచ్చిపోతుంటాను. ఇక, డబ్బులు పెడితే ఒకేసారి చచ్చిపోవడం కాదు.. కోమాలోకి వెళ్లిపోతాను. హీరోయిన్గా మీ నంబర్ ఏంటో తెలుసా? నంబర్ గేమ్‌లోకి నన్ను లాగొద్దండి. ఈ శుక్రవారం నా సినిమా హిట్టయితే నేనే నంబర్ వన్. వచ్చే వారం వేరే హీరోయిన్. ఒకవేళ నా సినిమా ఫ్లాప్ అయ్యిందనుకోండి.. అప్పుడు అంతకు ముందు నా హిట్ సినిమాలన్నింటినీ మర్చిపోతారు. ఒక్కసారిగా నన్ను మేడ మీద నుంచి కిందకు తోసేస్తారు (నవ్వుతూ). అందుకే జయాపజయాలను, నంబర్లను నెత్తికి ఎక్కించుకోకూడదు. -
మా మధ్య...గొడవలు పెట్టకండి బాబూ!
‘మాటల మాంత్రికుడు’... మంచి మనిషి... మనవైన విలువలను తెరపై చూపెట్టే దర్శకుడు... సంక్లిష్టంగా కాకుండా సరళంగా జీవితాన్ని జీవించమనే సినీ తాత్త్వికుడు... త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఎవరి నిర్వచనం వారిది. ఆయన మాత్రం ఎవరేమన్నా... అవేవీ పట్టించుకోనట్లే ఫకాలున నవ్వేసి... చేయి కలిపి, పక్క నుంచి ముందుకెళ్ళిపోయే పాదరసం. ‘స్వయంవరం’తో స్వతంత్ర సినీ రచయితగా మొదలుపెట్టి, ‘నువ్వే - నువ్వే’తో దర్శకుడైన ఈ భీమవరం బుల్లోడు ఇప్పటికి అరడజను సినిమాలను దర్శకుడిగా అందించారు. మనుషుల మధ్య అనుబంధాలు, మనవైన విలువలను తెరపై ఆవిష్కరించి, మనల్ని మనకే గుర్తుచేసే ఈ దిట్ట అల్లు అర్జున్‌తో తన తాజా ఏడో చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’లోనూ ఆ పనే విజయవంతంగా చేశారు. ఏణ్ణర్ధం క్రితం పవన్‌కల్యాణ్‌తో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ ‘అత్తారింటికి దారేది’ అందించిన త్రివిక్రమ్ తాజా రిలీజ్‌పై సంధించిన ప్రశ్నల పరంపరకిచ్చిన జవాబులు... ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి స్పందన అంచనాలకి తగ్గట్టే ఉందా? ప్రతి సినిమాకూ నేను కోరుకునేది ఒకటే - సినిమా కొను క్కున్న బయ్యర్లకు వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చేయాలని. మాట్లాడకుండా చూసేసే మల్టీప్లెక్స్ జనం కన్నా, నవ్వుతూ, ఈలలేస్తూ, తెర మీది కథ నచ్చిందో నచ్చలేదో తమ స్పందన ద్వారా చెప్పేసే సింగిల్ థియేటర్లోనే నేనెప్పుడూ సినిమా చూస్తా. హైదరాబాద్ సుదర్శన్‌లో చూశా. సామాన్య ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తోంది. ప్రాథమికంగా ‘సన్నాఫ్...’ మాస్ సినిమా కాదు కాబట్టి, క్రమంగా కుటుంబ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుంది. మరి కొద్ది రోజులైతే కానీ వాణిజ్య పరంగా సినిమా స్థాయి ఏమిటో తెలియదు. ఇక, నా వరకు అంటారా? కథ రాసి, సినిమా తీయడమే తప్ప, ప్రత్యేకించి అంచనాలు పెట్టుకోను. గత చిత్రాలతో పోలిస్తే, ఇందులో వినోదం తగ్గిందని.. (మధ్యలోనే అందుకుంటూ...) కేవలం వినోదాత్మక కథలే కాక, వేరే కథలు కూడా చెబుతూ ఉండాలి కదా. నేను రాసుకున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కథను నిజాయతీగా తెర కెక్కించడానికి ప్రయత్నించా. ఆ క్రమంలో ఏ మేరకు కుది రితే అంతే వినోదం ఉంది. ఏవేవో ఐటమ్ ఇరికించలేదు. అంటే... హీరోలకు తగ్గట్లు కథలు రాయనంటారు... ఆ మాటంటే అబద్ధం. ఒక కథ అనుకున్నాక, ఆ కథలో చేసే హీరోకు తగ్గట్లు కొంత సర్దడం సహజం. కథను నిజాయతీగా తెరకెక్కిస్తూనే, వాణిజ్యపరంగా పెట్టుబడి తిరిగొచ్చేలా డిజైన్ చేస్తుంటాం. అదే సమయంలో నా మటుకు నేను చెప్పాలనుకున్న విలువల గీత దాటకుండా చూసుకుంటా. కానీ, హీరో పాత్రను 300 కోట్లొదులుకొనే మంచివాడిగా చూపడం... మంచివాళ్ళ కథలు బోరింగ్‌గా ఉంటాయని మనకు అపనమ్మకం. కానీ, ఈ భూమండలంపై అతి మంచివాడిగా కనిపించే రామాయణంలో రాముడి కథే చూడండి - అది ఇప్పటికి ఎన్నో భాషల్లో వచ్చింది. ఎన్నోసార్లు తెరకెక్కింది. ఒక మంచి వాణ్ణి హీరోగా పెట్టుకొని, అతనికి ఎదురయ్యే సవాళ్ళను అతనెదు ర్కొన్న తీరుతో, కథను ఆసక్తికరంగా, ఇష్టపడేలా చెప్పాలని ప్రయత్నించా. ఈ చిత్రకథకూ, మీ నిజజీవితానికీ సంబంధం ఉందా? నా వ్యక్తిగతం కాదు కానీ, చాలామంది జీవితాల్లో జరిగిన విషయాలు, నా స్నేహితులు, బంధువుల కుటుంబాల్లో జరిగిన కొన్ని ప్రధాన ఘటనల్ని సినిమాకు తగ్గట్లు నాటకీయంగా మలుచుకొని చేశా. ఎమ్మెస్ నారాయణ, రావు రమేశ్‌ల ఘట్టం పశ్చిమగోదావరి జిల్లాలోని వేగేశ్వరపురం అనే చిన్న ఊరులోని మా అమ్మ మేనమామల జీవితం నుంచి ప్రేరణ పొంది తీసుకున్నా. అన్న ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టిన తమ్ముడు, ఆస్తుల గురించి పట్టించుకోకుండా మూడు తరాలుగా కలిసుంటున్న ఆ కుటుంబాల స్ఫూర్తితో ఆ ఘట్టాన్ని సినిమాకు తగ్గట్లుగా మలిచా. తండ్రీ కొడుకులు ప్రకాశ్‌రాజ్, బన్నీల మధ్య ఇంకా సీన్లు పెట్టాల్సిందేమో? ఈ కథలో తండ్రి గొప్పతనం గురించి చెప్పాలనుకున్నా కానీ, ఆ పాత్రతోనే కథ నడపాలనుకోలేదు. కొడుకుకూ, తండ్రికీ మధ్య సీన్లతో ఆ గొప్పతనం చెప్పా లనుకోలేదు. తండ్రి, ఆస్తి ఉండగా కొడుకు గొప్పగా మాట్లాడే కన్నా, రెండూ పోయాక, తండ్రి గొప్పతనం కోసం కొడుకు పాటుపడడం గొప్పే కదా! కానీ, ‘మాటల మాంత్రికుడి’ పంచ్‌లు లేవనీ, బన్నీ ఎనర్జిటిక్‌గా లేరనీ... (నవ్వేస్తూ...) ‘మాటల మాంత్రికుడ’ని మీరంటారు కానీ, అదేమీ నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా... ఆ కథకు, ఆ సన్నివేశానికి అనిపించిన మాటలు రాయడమే. తండ్రి చనిపోయాక ఆ బాధలో ఉన్న హీరో వెంటనే పంచ్ డైలాగులు మాట్లాడితే బాగుండదు కదా! ఇక, ‘జులాయి’, ‘రేసుగుర్రం’ లాంటి చిత్రాల్లో ఉరికే జలపాతంలో ఉత్సాహంగా ఉండే బన్నీని చూశాం. మళ్ళీ అదే పద్ధతిలో కంఫర్ట జోన్లో వెళ్ళకుండా, హుందాగా, బాధ్యతతో కూడిన పాత్రలో ఆయనను చూపాలని కావాలనే నిర్ణయించుకున్నాం. ఒక మెయిన్‌స్ట్రీమ్ సిన్మాలో సమంతను డయాబెటిక్‌గా చూపడం విచిత్రమేనే? హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలని మనం ఒక మూసలో పడ్డాం. ఏం? నల్లగా ఉన్నవాళ్ళు, ఆరోగ్య సమస్యలున్న అమ్మాయిలు కథలో హీరోయిన్ పాత్ర కాకూడదా? అయినా ఇవాళ ప్రపంచాన్నీ, అందులోనూ మన దేశాన్నీ పట్టిపీడిస్తున్న మహమ్మారి డయాబెటిస్. అది వచ్చినవాళ్ళను మనం జాలిగా చూస్తుంటాం. కానీ, కమలహాసన్, యాంకర్ గౌరవ్ కపూర్, క్రికెటర్ వసీం అక్రం లాంటి విజయసాధకులు డయాబెటిక్స్. అందుకే, అలాంటి ఆరోగ్య సమస్య ఉన్న వ్యక్తిని అందరూ ప్రేమించేలా, ఇష్టపడేలా చూపాలని హీరో యిన్‌ను అలా చూపించాం. మొదట మా యూనిట్‌లోనూ భిన్నాభిప్రాయా లొచ్చాయి. తీరా చూశాక, ముఖ్యంగా సూట్‌కేస్ ఫైట్, అక్కడి కామెడీ చూశాక, అంతా ఇష్టపడ్డారు. సినిమా టైటిల్‌పైనా అలాంటి చర్చే జరిగింది. ‘సన్నాఫ్...’లో భారత, రామాయణాల్ని ఎక్కువ ప్రస్తావించారు. కారణం? నా దృష్టిలో రామాయణ, భారతాలను మించిన అద్భుత సాహిత్యం ఎవరూ రాయలేదు. వాటిలో స్పృశించని అంశం లేదు. అందుకే, వాటిని సందర్భాను సారంగా ప్రస్తావించా. అందులో తప్పేం లేదు కదా. బలమైన విలన్ లేరనీ, హీరోతో అతణ్ణి చంపించలేదనీ కూడా ఒక విమర్శ? నిజానికి, ఈ కథలో నటుడు ఉపేంద్ర విలన్ కాదు. బయట ఏం చేసినా, భార్య ఎదుట మంచిగా ఉండాలనుకొనే వ్యక్తి. ప్రాథమికంగా ఈ కథలో ఉపేంద్రను చంపాలని చూసే సంపత్‌రాజ్ విలన్. కానీ, అతనికీ, హీరోకూ నేరుగా ఘర్షణ లేదు. పైగా, హీరోతో, విలన్‌ను చంపించడమనే కాన్సెప్ట్‌కు నేను కొంత వ్యతిరేకిని. ‘వాదనల ద్వారా అభిప్రాయాలు మారవు, వ్యక్తులను చంపడం ద్వారా వ్యవస్థ మారదు’ అని నా నమ్మకం. అందుకే, ‘అతడు’, ‘జల్సా’ - ఇలా దాదాపు నా ప్రతి సినిమాలో ఊహించని పరిస్థితులు, ఘటనల్లో విలన్ చనిపోతాడు తప్ప, హీరో చంపడు. ఇందులోనూ అంతే! ‘సన్నాఫ్...’పై సినీవర్గాల్లో కొంత మిశ్రమ స్పందన వినిపిస్తోంది... మనం ఏ ట్రేడ్‌లో ఉంటే అందులో తెలియకుండానే కొంత స్టిఫ్ అయిపోతుం టాం. సినీరంగంలోనూ అంతే. సామాన్య ప్రేక్షకుల్లాగా నవ్వొస్తే నవ్వి, ఏడు పొస్తే ఏడవం. బాగుందో, బాగాలేదో ఒక్క ముక్కలో చెప్పలేం. ఫస్టాఫ్ బాగున్నా సరే, సెకండాఫ్ ఎలా తీశాడో చూడాలంటూ ఇంటర్వెల్లో వ్యాఖ్యా నిస్తాం. హాలులో కూర్చున్నా, చూస్తున్న సినిమాను ఆస్వాదించకుండా క్షణ క్షణానికీ అప్డేట్లు వాట్సప్‌లో, ట్విట్టర్లో ఇస్తాం. ఇది మనందరి బలహీనత. నా ఒక్క సినిమానే ఆడాలి, ఇతరులెవరివీ ఆడకూడదనుకుంటే తప్పు. అందరి సినిమాలూ పోతే, మనతో మళ్ళీ సినిమా తీయడానికి మిగిలేదెవరు? ఈ సినిమా నిర్మాణంలో మీరూ భాగస్వామి అని ఒక టాక్ నడుస్తోంది... (గట్టిగా నవ్వుతూ...) మా నిర్మాత రాధాకృష్ణ గారు, నేను బాగున్నాం. మా మధ్య గొడవలు పెట్టకండి బాబూ! ఇప్పటి దాకా ఏ సినిమాలోనూ నేను పైసా పెట్టుబడి పెట్టలేదు. భాగస్వామినీ కాలేదు. కాకపోతే, బడ్జెట్ నియంత్రణ లాంటి విషయాల్లో నిర్మాతకు మన వైపు నుంచి వీలైనంత సాయం చేస్తుంటాం. ఇవాళ సినిమాలపై పణంగా ఒడ్డుతున్న సొమ్ము పెద్దది కాబట్టి, నిర్మాత క్షేమం కోసం యూనిట్ తన వంతు పాత్ర పోషిస్తుంది. అంతే. మీరు తీసిన సినిమా మీరే చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? ఏ క్రియేటర్‌కీ తన సృష్టి తనకు పూర్తిగా నచ్చదు. ఇంకా ఏదో, మెరుగ్గా చేయాలనిపిస్తూ ఉంటుంది. మనకున్న పరిమిత సమయం, బడ్జెట్లో ఉన్నంతలో బాగా తీస్తాం. తీరా అంతా అయ్యాక, బయటివాళ్ళకు తెలియకపోయినా మన లోటుపాట్లు మనకు తెలుస్తుంటాయి. అందుకే తీయడమైపోయాక, నా సినిమా కూడా నేను చూడలేను. నేను తీసింది నాకే నచ్చదు. ఆ సృజనాత్మక తృష్ణతో ఎప్పటికప్పుడు ఇంకా నేర్చుకొని, మరింత మంచి సినిమా తీయాలనుకుంటా. పాటలకూ, భోజనం సీన్‌కూ పేరొచ్చింది! కథ, సందర్భాలు చెప్పగానే దేవిశ్రీ చాలా మంచి పాటలిచ్చాడు. ‘కమ్ టు ది పార్టీ’ పాటకైతే, సీతా రామశాస్త్రి గారు పల్లవి రాశాక ట్యూన్ కట్టాడు. ‘సూపర్ మచ్చీ’ పాట మొదటి ట్యూన్ నచ్చలేదంటే, మరునాటికల్లా తానే పాట పల్లవి రాసి మరీ అద్భుతమైన ట్యూన్‌తో వచ్చాడు. ఇలా ఎన్నో! ఇక, ఉపేంద్ర ఇంట్లో భోజనం సీన్లో ఒక పాత్రకు భయం, మరోపాత్రకు ఆశ్చర్యం, వేరొక పాత్రకు జరిగిందేమిటో తెలియని తనం - ఇలా రకరకాల ఎమో షన్‌స ఉంటూనే, ప్రేక్షకు డికి మాత్రం వినోదం కలిగించాలి. అది రాయడం, తీయడం చాలా కష్టమైంది. అలాగే, అందరితో కటువుగా, భార్య వస్తుంటే మాత్రం మంచిగా ఉండే ఉపేంద్ర పాత్రలోని రెండు పార్శ్వాలను చూపే సీన్ కూడా! ఇలాంటివి బాగా రాశాక, దానితో కలిగే ఆనందం వేరు. అందుకే నేను తుది ఫలితం కన్నా, ఆ పని చేసే క్రమాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తా. మీ తదుపరి చిత్రం? ఇంకా ఏదీ ఖరారవలేదు. పవన్ కల్యాణ్, మీరు తీస్తామన్న ‘కోబలి’? ఉంది. అది ఒక రకంగా ప్యారలల్ సినిమా. అందుకే, మేమే తీయాలను కున్నాం. సాంకేతికంగా క్లిష్ట మైన, ఉన్నత ప్రమా ణాలున్న ఆ చిత్రం కోసం విదేశీ నిపు ణుల్నీ సంప్రతిం చాం. అందుకే కొన్ని లక్షలు ఖర్చు చేశాం. త్వరలోనే చేస్తాం. ఆడియో ఫంక్షన్లో అన్నట్లు పవన్ మీకు దేవుడా? అంతకు మించా? మంచి మిత్రుడు. అంతే. రాజమౌళి హీరోలతో మీరు, మీ హీరో లతో ఆయన చేయరని వెబ్సైట్ల కథనం... (నవ్వేస్తూ...) కథకు తగ్గట్లు కుది రిన హీరోలతో చేస్తాం తప్ప, ఫలానా వాళ్ళతో చేయకూడదని ఎవరూ అను కోరు. ఎన్టీఆర్, రామ్ చరణ్... ఇలా అందరితో చేయాలని ఉంది. కథ, డేట్లు కుదరాలిగా! ఏమైనా ఈ వార్త నాకు కొత్త. నేను వెబ్సైట్లు చదవను. టీవీ పెద్ద చూడను. దాని వల్ల జీవితం ఎంత సుఖంగా ఉందో చూడండి (నవ్వులు...). రాజమౌళిలా మీరూ మన సినిమాను ఇతర భాషల్లోకి తీసుకెళ్ళి, మార్కెట్ పెంచే కథలతో సినిమా తీయచ్చుగా? ‘ఈగ’, ‘బాహుబలి’ లాంటివి అలాంటి అద్భుత ప్రయ త్నాలు. నిజాయతీగా మన దగ్గరా అలాంటి కథ ఉంటే చేయాలి తప్ప, ఆయన చేస్తున్నారని మనమూ చేయాలనుకోవడం తప్పు. -
రెండు రోజుల్లో రూ.33.5 కోట్ల వసూళ్లు
అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి రికార్డు వసూళ్లతో థియేటర్లలో హల్చల్ చేస్తోంది. ఈ సంవత్సరం రిలీజైన సినిమాల్లో మంచి ఓపెనింగ్స్ సాధించింది. గురువారం బన్నీ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఈ రెండురోజుల్లోనే రూ. 33.35 కోట్లు రాబట్టిందని సినీ ఎనలిస్టుల తాజా కబురు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ కుటుంబ కథా చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదా శర్మ, రాజేంద్రప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ప్రధానంగా త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి. ఇక దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, రొటీన్ కు భిన్నంగా తెరకెక్కిన ఈ చిత్రం రాబోయే వారం రోజుల్లో మరింత వసూళ్లను సాధించి పెద్ద హిట్‌గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. -
ఆ హీరోయిన్ల నుంచి...ఎంతో నేర్చుకున్నా!
బుధవారం మధ్యాహ్నం 3 గంటల వేళ... హైదరాబాద్‌లో సూర్య ప్రతాపంతో వీధులు వేడెక్కి ఉన్నాయి. ఉదయం నుంచి పుట్టినరోజు హంగామా... ‘ట్విట్టర్’ రంగప్రవేశపు ఆర్భాటం... ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా రిలీజు హడావిడి... వీటన్నిటి మధ్య హీరో అల్లు అర్జున్‌కు క్షణం తీరిక లేదు. ‘గీతా ఆర్ట్స్’ కార్యాలయం బయట పెద్ద సంఖ్యలో వేచి ఉన్న అభిమానులను ఆత్మీయంగా పలకరిస్తూ, తరువాతి చిత్రాల తాలూకు కథల గురించి ఇద్దరు ప్రముఖ దర్శకులతో చర్చకు సిద్ధమవుతూనే, సినిమా రిలీజు వేడి... పత్రికల్లోని వార్తల వాడిని తట్టుకుంటూ, వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారీ స్టైలిష్ స్టార్. మనసు పెట్టి చేసిన భారీ బడ్జెట్ చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మొదలు ‘రుద్రమదేవి’లో ముఖ్య పాత్ర, సినిమాతో నేర్చుకున్న అంశాల దాకా అనేక విష యాలపై మనసులోని మాటలను పంచుకున్నారు. ముఖ్యాంశాలు... ‘అత్తారింటికి దారేది-2’ అంటూ ‘సన్నాఫ్..’పై వ్యాఖ్య వినిపిస్తోంది. ఇంటర్నెట్లో ఏవేవో రాస్తుంటారు. దానికీ, దీనికీ పోలికే లేదు. ‘అత్తారింటికి’లానే ఇదీ సకుటుంబ వినోద తరహా చిత్రం కావడంతో పోలిక తెస్తున్నారు. మంచి కథ కుదిరింది. చేశాం. అంతే. మరి, సన్నాఫ్ సత్యమూర్తికీ, సన్నాఫ్ అరవింద్‌కీ పోలికలు, తేడాలు? సన్నాఫ్ సత్యమూర్తికీ, సన్నాఫ్ అల్లు అరవింద్‌కీ పెద్ద తేడా లేదు. నిజం చెప్పాలంటే, ‘ఖుషి’ సూపర్‌హిట్ తర్వాత పవన్‌కల్యాణ్ గారిని కలిసినప్పుడు ‘నువ్వేంటో నీ సినిమా అదే’ అని నాతో అన్నారు. అప్పటికి నా ‘ఆర్య’ సినిమా వచ్చింది. నాకూ, దానికీ పోలిక లేదే అనుకున్నా. తరువాత నాకు అర్థమైంది ఏమిటంటే, మన భావోద్వేగాలు, ఆలోచన లకు తగ్గ కథలనే మనం ఏరుకుంటామని. ‘ఆర్య’ కథకు నా వయసు, ‘రేసుగుర్రం’ కథకు మా ఇంట్లోని అన్నదమ్ముల బంధం, ఇప్పుడీ సినిమాకు నాన్నతో కొడుకు అనుబంధం లాంటివి కనెక్టయ్యాయి. ఇందులో కొంత మా ఇంట్లోనే చిత్రీకరించాం. త్రివిక్రమ్ అడగగానే, తాముండే గ్రౌండ్ ఫ్లోర్‌లోనే షూటింగ్‌కు నాన్న గారు ఒప్పుకున్నారు. మీ గత చిత్రాల్లో కన్నా ఈ సారి బాగా స్టైల్ పెంచినట్లున్నారు! (నవ్వేస్తూ...) ఇటీవల వచ్చిన ‘ఇద్దరమ్మాయిలతో...’ సినిమాలో రాక్ గిటార్ ప్లేయర్‌గా చేశాను. ‘రేసు గుర్రం’లో మధ్యతరగతి అబ్బాయిగా చేశాను. వాటితో పోలిస్తే, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’లో నాది కొంత డిగ్నిటీ ఎక్కువున్న పాత్ర. హుందాతనం నిండిన ఆ పాత్రలో కూడా వస్త్రధారణలో ఒక స్టైల్ తెచ్చేందుకు ప్రయత్నించాం. పైగా, నేనెప్పుడూ ఒకటికి నాలుగు అలంకరణలతో నిండిన వస్త్రధారణ చేస్తుంటా. కానీ, పాటలు వదిలేస్తే, ఈ సినిమాలో కావాలనే అవన్నీ వదిలించుకొని, సింపుల్‌గా, సింగిల్ పీస్‌లో ఉండేలా చూశా. దాంతో, నేను కొత్తగా కనిపిస్తాను. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ముగ్గురు హీరోయిన్లున్నారు. అప్పుడు ‘ఇద్దరమ్మాయిలతో...’ అయితే, ఇప్పుడు ‘ముగ్గురమ్మాయిలతో’నా? (నవ్వేస్తూ...) ఏకకాలంలో ముగ్గురమ్మాయిలతో షూటింగ్ లేదు. ఉండి ఉంటే, ఆ షాట్ ఎప్పటికీ తెమలదేమో! (మళ్ళీ నవ్వేస్తూ...) జోక్‌గా అలా అంటున్నాను కానీ, ఇప్పుడొస్తున్న యువ కథానాయికలు చాలా ప్రొఫెషనల్. నిజానికి, ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు ఎక్కువ కనిపిస్తారు. వారితో పోలిస్తే, అదా శర్మ కనిపించేది తక్కువే. ఈ ముగ్గురు హీరోయిన్ల ప్రత్యేకత ఏమిటో? సినిమాలో ముగ్గురివీ ముఖ్యపాత్రలే. నిజజీవితంలో ఈ ముగ్గురు హీరోయిన్లకూ ఎవరి వ్యక్తిత్వం వారికుంది. సమంతలో ఒక విలక్షణ లక్షణం ఉంది. ఆమె ఇటు ఎంతో అందంగా కనిపిస్తూనే, అటు మంచి అభినయం పండించగలదు. ఇక, నిత్యామీనన్లోని అద్భుతమైన గుణం ఏమిటంటే, తనకు ఇవ్వజూపిన పాత్ర బాగుందా, లేదా అని మాత్రమే ఆలోచిస్తుంది. అంతేతప్ప, తనదే సినిమాకు ప్రధాన పాత్ర కావాలనీ, అలా మెయిన్ క్యారెక్టర్ కాకపోతే తన ఇమేజ్ పోతుందనీ భయపడదు. వెనుకాడదు. ఇక, అదాశర్మ ప్రతిభావంతురాలు. ఈ చిన్న వయసులోనే ఎంతో అద్భుతంగా అవతలివాళ్ళను అనుకరిస్తుంది. అంత మిమిక్రీ చేయగల అమ్మాయిని తొలిసారి చూశా. వీళ్ళతో వర్క వల్ల ఎంతో నేర్చుకున్నా. నిజంగానా? ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నారేమిటి? నా దగ్గర పనిచేసేవాళ్ళను నేను బాగా చూసుకుంటూ ఉంటా. కానీ, సమంతను చూశాక, మన దగ్గర పనిచేసే సిబ్బందిని తనంత బాగా చూసుకోవాలని నేర్చుకున్నా. నిత్యా మీనన్‌ను చూశాక ఏ విషయంలోనైనా తగినంత మేరకు సరైన భయం పెట్టుకోవాలే తప్ప, అనవసరపు భయం పెట్టుకోకూడదని అర్థం చేసుకున్నా. ఉదాహరణకు, ఒక స్టెప్ వేయాలంటే నేర్చుకోకుండా కెమేరా ముందుకు వెళితే భయపడాలి. అది సరైన భయమే. కానీ, అంతా నేర్చుకొని వెళ్ళాక, సరిగ్గా చేస్తానో, లేదో అనే భయం అనవసరం. ఆత్మవిశ్వాసంతో వెళ్ళి, నేర్చుకున్నది అద్భుతంగా చేసేయడమే! ఇక, చాలా చిన్న వయసు అమ్మాయైన అదాశర్మను చూశాక, ఏ విషయంలో అయినా సరే వేగంగా నిర్ణయం తీసుకొనే ఆ వయసులోని లక్షణాన్ని ఎప్పటికీ వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. కొన్నేళ్ళ క్రితం దాకా నేనూ అలాగే ఉండేవాణ్ణి. త్రివిక్రమ్ పనితీరు ఎలా అనిపించింది? త్రివిక్రమ్ తో సినిమా అంటే చాలు నేను ఒప్పేసుకుంటా. ఆ తరువాతే స్క్రిప్టు వింటా. మా కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘జులాయి’ సమయంలోనే ఆ మాట చెప్పా. దానికే, ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. సెట్స్‌లో ఆయన ఎక్కువగా ఏదీ చెప్పరు. కాకపోతే, షూటింగ్‌కు వెళ్ళడానికి ముందే కథ, పాత్రల గురించి మాట్లాడతారు. ఆ పాత్రను అలా చేయాలి, ఇలా చేయాలని బాగా మాట్లాడుకుంటాం. సెట్స్ మీద పైకి కనపడని హోవ్ువర్క ఆయనది. ప్రపంచ సినిమా మీద ఆయనకున్న జ్ఞానం అపారం. ‘జులాయి’తో పోలిస్తే, ఇప్పుడు నేను, ఆయన ఎదిగాం. మునుపటి కన్నా ఆయనలో వేగం, పరిణతీ పెరిగాయి. దర్శకత్వంలో అది స్పష్టంగా అర్థమైంది. ఇంతకీ, దర్శకుణ్ణి ఎంచుకొనేటప్పుడు మీరు చూసేది? ఆ దర్శకుడి మైండ్‌సెట్. అది చాలా ముఖ్యం. అతను మనతో సినిమా తీస్తున్నది డబ్బు కోసమా, ఖాళీ లేకుండా చూసుకోవడానికా, మరో దానికా అన్నది చూస్తాను. సరైన మైండ్‌సెట్‌తో వస్తే ఓ.కె.చెప్పేస్తా. నిజం చెప్పాలంటే, దర్శకులు రెండు రకాలు. మన నుంచి రాబట్టుకొనేవారు ఒక రకం. మనకు ఎంతో ఇన్పుట్స్ ఇచ్చేవారు రెండో రకం. త్రివిక్రవ్‌ు రెండో రకం దర్శకుడు. ‘జులాయి’కి ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ ఎంతో ఉపయోగపడ్డాయి. అప్పటి నుంచి నటుడిగా క్రమంగా ఒక్కో పొరనూ చీల్చుకుంటూ, బాగా బయటకు వస్తున్నా. ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్ చేశారనీ...? (మధ్యలోనే అందుకుంటూ) అదేమీ లేదు. ‘ఆర్య-2’, ‘వరుడు’, ‘వేదం’ చిత్రాల్లో నేను గతంలో చేశా. కానీ, దానివల్ల యువతరానికే దగ్గరవుతాను తప్ప, పిల్లలకూ, కుటుంబ ప్రేక్షకులకూ దూరమవుతున్నా. వెరసి, ఈ లిప్‌లాక్‌ల వల్ల వచ్చే లాభం కన్నా, కలిగే నష్టం ఎక్కువగా ఉంది. కథకు నిజంగా అవసరమైతే అవి చేయడం పెద్ద విషయం కాదు. అలా కానప్పుడు అనవసరమని లిప్‌లాక్‌లకు దూరంగా ఉండదలిచా. ఇంతకీ ఈ సినిమా ద్వారా మీరు పొందిందేమిటి? పోగొట్టుకున్నదేంటి? కొద్దిగా బరువైతే పెరిగాను. (నవ్వులు...). వస్త్రధారణతో సహా అనేక అంశాల్లో కొన్ని అనవసర భయాలు, ఆందోళనలు, అలవాట్లు వదిలేశాను. పెద్ద హీరో అయ్యుండీ ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డిగా చేస్తున్నారే? ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లాంటివి తెలుగు సినిమా ప్రమాణా లనూ, వాణిజ్య పరిమాణాన్నీ - రెంటినీ పెంచుతాయి. శంకర్ లాంటి వారు అలా చేయబట్టే, తమిళంలో వంద కోట్ల పెట్టుబడితో సినిమాలు తీయగలుగుతున్నారు. మనం కూడా ఇతర భాషా పరిశ్రమల మార్కెట్‌ను కూడా సంపాదించాలి. అందుకు మనకు ‘మగధీర’, ‘ఈగ’ లాంటివి దోవ చూపాయి. రానున్న ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ అలాంటివే. అవి బాగా ఆడాలి. అందుకే, నా వంతుగా గోన గన్నారెడ్డి పాత్ర చేశా. ఎవరెవర్నో దాటి ఆ పాత్ర మీకొచ్చినట్లుంది? దర్శక - నిర్మాత గుణశేఖర్‌తో నా కాంబినేషన్లో ‘వరుడు’ చిత్రం ఫ్లాపైనా, ఆయనపై నాకు అపారమైన గౌరవం ఉంది. ‘వరుడు’ ఆడలేదంటే దానికి కారణం - మా పొరపాటే తప్ప, నిర్లక్ష్యం కాదు. ‘రుద్రమదేవి’ 3-డి సినిమా. మన చరిత్రను చెప్పే సినిమా. అలాంటి 3డి చిత్రాలు ఆడితే, తెలుగు సినిమా సైజ్ కనీసం మరో 40 శాతం పెరుగుతుంది. ‘రుద్రమదేవి’ కథలో కీలకమైన గోన గన్నారెడ్డి పాత్ర ఎవరైనా పెద్ద హీరో చేస్తే బాగుంటుందనీ, అదనపు మార్కెట్ వస్తుందనీ ఆగింది. అది తెలిసి, నేనే ఆయనను సంప్రతించాను. నాకు తగ్గట్లు పాత్రను మలచగలనేమో ఆలోచించి చెబుతానన్నారు. కొద్దిరోజులాగి, అప్పుడు సరేనన్నారు. నేనూ ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేశా. ‘నేను తెలుగు భాష లెక్క... అక్కడా ఉంటా, ఇక్కడా ఉంటా’ అని దాన్లో డైలాగ్. మీ ఉద్దేశం రెండు రాష్ట్రాలనా? అటు అడవిలోనూ, ఇటు కోటలోనూ అని కథా పరంగా అర్థం. (నవ్వేస్తూ...) రెండు తెలుగు రాష్ట్రాలనీ అనుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులంతా నాకు కావాల్సినవాళ్ళే! మలయాళంలో డబ్బింగ్‌తో మీరు 3 రాష్ట్రాల్లో ఉన్నారు... మనం, మన సినిమా ఒక మెట్టు ఎక్కడమంటే అదే! ‘సన్నాఫ్...’ మలయాళ డబ్బింగ్ కూడా రెండు వారాల్లో రిలీజవుతోంది. నాకు నేరు మలయాళ చిత్రాలూ చేయాలని ఉంది. సరైన కథ, దర్శకుడొస్తే చేస్తా. హిందీలోనూ అంతే. ‘ఏబీసీడీ’లో చిన్న పాత్రకు అడిగారు కానీ చేయనన్నా. ‘సన్నాఫ్..’ ఆడియోలో చిరంజీవిని దాసరి ప్రస్తావిం చకపోవడం అనేక వ్యాఖ్యలకు తావిచ్చింది? సహజంగానే బయట విమర్శలు వస్తాయి కదండీ! ఎన్టీఆర్, ఏయన్నార్ తర్వాత పవన్ కల్యాణ్ ప్రత్యేక స్టయిల్ తెచ్చారని ఆయన అన్నారు. కొన్నిసార్లు వేదికపై కొన్ని పేర్లు చెప్పడం మర్చిపోతుంటాం. ఒకసారి ఆడియో వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పడం నేనే మర్చిపోయా. దాసరి గారు అలాగే మర్చిపోయి ఉండవచ్చు. అది కావాలని జరిగిందో, అనుకోకుండా జరిగిందో నాకు తెలియదు. ఏమైనా, దాసరిగారు మా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన్ని మేము గౌరవించాలి. అంతే! దానికి వచ్చిన విమర్శల వల్లనేనా మీరు వరంగల్‌లో ‘రుద్రమదేవి’ ఆడియోలో చిరంజీవి పేరు తెచ్చి, ఆ చెట్టు నీడన పెరిగామన్నారు? అవును. కచ్చితంగా అందుకే అన్నాను. ఆ మాట నిజమే కదా! తకాలానికి ట్విట్టర్లో ఖాతా తెరవడమెలా ఉంది? అభిమానులకు దగ్గరవడం ఆనందంగా ఉంది. కానీ, రావడమే చాలా ఆలస్యమైంది. మా తమ్ముడు అల్లు శిరీష్ నన్ను మొదటి నుంచి బలవంతం చేస్తున్నా ఇవాళ్టికి కుదిరింది. చాలామందిలా మీ ట్విట్టర్‌ను వేరెవరో హ్యాండిల్ చేస్తారా? నా విషయాలు, ఫోటోలు పంచుకోవడానికి ట్విట్టర్ వేదిక. నా పేరు మీద వచ్చేది కాబట్టి, స్వయంగా నేనే చూసుకుంటా. మీ అబ్బాయి అయాన్‌కు ఈ మధ్యే ఏడాది నిండింది కదా. తండ్రి బాధ్యతల్లో ఎలా ఉన్నారు? పిల్లవాడు పుట్టాక సహజంగానే నాలో కొంత మార్పు వచ్చింది. మా వాడి మొదటి పుట్టినరోజుకని ఈ మధ్యే సింగపూర్‌కు కుటుంబ సమేతంగా వెళ్ళాం. అక్కడే సరదాగా గడిపి, వచ్చాం. మీ తదుపరి చిత్రం ఏమిటి? దర్శకుడు బోయపాటి శ్రీనుతోనేనా? చర్చల్లో ఉన్నాం. కొలిక్కిరాగానే తక్షణ చిత్రమేంటో చెబుతా. త్రివిక్రమ్‌లో మీకు బాగా నచ్చిన విషయం? ‘నేను అనుకున్నది, చెప్పినది, రాసినదే జరగాలి’ అంటూ దాన్నే పట్టుకొని కూర్చొనే రకం కాదాయన. అవతలివాళ్ళు చెప్పింది వింటారు. ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తారు. అవసరమైతే తాను అప్పటి దాకా అనుకున్నది మార్చేసుకుంటారు. ఆ ఓపెన్ మైండ్ ఆయనలోని గొప్ప లక్షణం. అది నాకు బాగా నచ్చుతుంది. ఆయన ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఆయనలోని విద్వత్తును నటీనటులందరూ ఎంతో గౌరవిస్తారు. -
నాన్నే సూపర్ హీరో
చెన్నై : యువతలో చాలా మందికి వాళ్ల నాన్నే సూపర్ హీరో అని ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బుధవారం చెన్నైలో అన్నారు. ఇటీవల వస్తున్న చాలా చిత్రాలలో కుటుంబ సభ్యులతో తల్లికి ఉన్న అనుబంధాన్ని చూపిస్తున్నారన్నారు. కానీ కుటుంబ సభ్యులతో తండ్రికి గల అనుబంధాన్ని తెలిపే చిత్రాలు లేవన్నారు. కుటుంబంలో తండ్రి పాత్ర ఎంతో కీలకమైందని చెప్పారు. తండ్రీ కొడుకుల మధ్య అనుంబంధాన్ని... తండ్రిని పూజించమని చెప్పే చక్కని కథాంశంతో సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాన్ని తెరకెక్కించినట్లు త్రివిక్రమ్ తెలిపారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా అల్లు అర్జున్, సమంత, నిత్యమీనన్, ఆదాశర్మ నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 9వ తేదీన విడుదల కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. వారిద్దరి కాంబినేషన్లో జులాయి చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. -
సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో సక్సెస్ మీట్
-
'సన్నాఫ్ సత్యమూర్తి' ఫస్ట్ లుక్
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ తెరకెక్కుతున్న 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలైయ్యాయి. ఇందుల్లో స్టైలిష్ స్టార్ వెరైటీగా కన్పిస్తున్నాడు. తన మార్కు శైలి కనిపించేలా పోస్టర్ లో బన్నీ ఉన్నాడు. 'సన్నాఫ్ సత్యమూర్తి' ఫస్ట్ లుక్ లో బన్నీ సూపర్ గా ఉన్నాడని సమంత ట్వీట్ చేసింది. ఈ సినిమా ఆడియోను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 'సన్నాఫ్ సత్యమూర్తి' ఏప్రిల్ 12న విడుదలయ్యే అవకాశముందని సమాచారం.