
అక్కడ కూడా పోటీనే
పోటీ అనేది అన్ని రంగాల్లోనూ ఉంటుంది. ఒక రంగంలో పోటిపడేవారు మరో రంగంలో పోటీ పడ కూడదనేమీ లేదు. అలా సినిమా రంగంలో నువ్వా? నేనా? అనేంతగా పోటీపడుతున్న కాజల్ అగర్వాల్, సమంత ఆస్తులు కొనుగోలు చేయడంలోను పోటీ పడుతున్నారట. ఇప్పటికే కోట్ల పారితోషికం పొందుతున్న ఈ భామలు ఆ సంపాదనను స్థిరాస్తులుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఆవిర్భవిస్తుండడంతో టాలీవుడ్ తారల్లో కలకలం రేగుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో చెన్నై చిన్నది సమంత, ఉత్తరాది భామ కాజల్ అగర్వాల్‌లు సీమాంధ్రలో ఆస్తులు పెంచుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారన్నది తాజా సమాచారం.
ఆంధ్రాలో ఆస్తులను కొనుగోలు చేయడానికి ముద్దు గుమ్మలు ఇద్దరు పోటీ పడుతున్నారట. ఇళ్లయినా, ఎకరాల లెక్కన స్థలాలయినా సరే కొనేస్తున్నారట. ఇందుకు స్థల బ్రోకర్‌లను రప్పించుకుని మరి ప్రాంతాల వివరాలను రాబట్టుకుంటున్నారట. అదే విధంగా శర్వానంద్, తరుణ్, అల్లరి నరేష్ వంటి యువ నటులతో ఇప్పటికే హైదరాబాద్‌లో రెస్టారెంట్, బార్లు వంటి వ్యాపారాల్లోకి దిగారని సమాచారం. ఇప్పుడు వాళ్లు కూడా సీమాంధ్రలో స్థిరాస్తులను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డట్టు వార్తలు ప్రచారం అవుతున్నాయి.