దోస్త్ మేరా దోస్త్
ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ ఇంటర్వ్యూ
కలిసి చాయ్ తాగేవాళ్లు... కమ్మని కబుర్లు చెప్పేవాళ్లు... ఫ్రెండ్స్ అంటే వీళ్లేనా?
ఊహూ... ఎనీ టైమ్ నీకు నేనున్నా అని భరోసా కలిగించేవాళ్లు... అలాంటి ఫ్రెండ్ ఒక్కరు దొరికినా లక్కీయే
హీరో నితిన్... డిజైనర్ కోన నీరజ లక్కీ పీపుల్... ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్...
ఈ ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు...
• సమంత, రకుల్, నితిన్.. ఇలా మీ ఫ్రెండ్స్ లిస్ట్ చాలానే ఉంటుందేమో?
నీరజ: అవునండి. యాక్చువల్‌గా చిత్ర పరిశ్రమలో మంచి స్నేహితులు దొరకడం చాలా కష్టం. ఈ విషయంలో నేను చాలా లక్కీ. నాకు గొప్ప స్నేహితులు దొరికారు. అందులో నితిన్ ఒకడు. వెరీ డౌన్ టు ఎర్త్. ఓ హీరోలా అనిపించడు. పక్కింటి కుర్రాడిలానే ఉంటాడు. చాలా మంచోడు.
• మీరు తొలిసారి కలిసింది ఎప్పుడు?
‘గుండెజారి గల్లంతయ్యిందే’ కాస్ట్యూమ్ డిస్కషన్స్ టైమ్‌లో కలిశాను. నేను ఓ కాస్ట్యూమ్ డిజైనర్, తను ఓ హీరో.. ఫస్ట్‌లో మా రిలేషన్ అంతే. ఎక్కువగా మా డిస్కషన్‌లో సినిమా విషయాలు మాత్రమే ఉండేవి.
• మరి... మంచి స్నేహితులు ఎప్పుడయ్యారు?
మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. గ్యాంగ్ అందరూ ఒక్కటే. షూటింగ్ ఉన్నా.. లేకున్నా.. స్నేహితులు అందరం కలుస్తూ ఉండేవాళ్లం. అలా మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం.
• మీ ఇద్దరికీ కామన్‌గా ఉండే ఇష్టాల గురించి?
ఫుడ్ అండ్ ట్రావెలింగ్. సరదగా కబుర్లు చెప్పుకోవడం. షాపింగ్.. ఏం చేయకుండా ఖాళీగా ఉండడం అన్నా ఇష్టమే.
• ‘ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్’ అంటారు కదా. మీ ఫ్రెండ్‌షిప్?
అలాంటిదే.. నాకు అవసరమైన ప్రతి సందర్భంలోనూ నితిన్ అండగా నిలబడతాడు. సలహాలు ఇస్తుంటాడు.
• పెళ్లైన తర్వాత మరో అబ్బాయితో స్నేహం సాధ్యమేనా? మీ భర్త ఏమంటారు?
ఎందుకు సాధ్యం కాదు? పెళ్లయినంత మాత్రన వేరే అబ్బాయితో స్నేహం చేయకూడదా? మనం పెరిగిన సంస్కృతి, సంప్రదాయాల వల్ల ఆడ, మగ స్నేహం అంటే అదో వింతగా అనిపించడం సహజం. మిగతావారు ఏం ఆలోచిస్తారో అర్థం చేసుకోగలను. కానీ, మా స్నేహం ఇటువంటి విషయాలకు అతీతమైనది. నా పెళ్లికి ముందే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఆ తర్వాత మా స్నేహం బలపడింది. పెళ్లి తర్వాత నా స్నేహితుల్లో మా ఆయన ఒకరు అయ్యారు. మేం ముగ్గురం కలిస్తే సందడికి కొదవ ఉండదు.
• నితిన్ ప్లస్ అండ్ మైనస్‌లు ఏంటి?
ప్లస్ పాయింట్స్ ఏంటంటే.. జాలి ఎక్కువ. మైనస్.. చాలా మొండిఘటం.
• వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నితిన్ భవిష్యత్ ఎలా ఉండాలనుకుంటున్నారు?
హీరోగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను. వ్యక్తిగతంగా పెళ్లి చేసుకుని జీవితంలో ఓ ఇంటివాడైతే చూడాలనుంది. తనకు సరిజోడి ఎప్పుడు వెతుక్కుంటాడా? అని ఎదురుచూస్తున్నాను.
• నీరజతో మీ ఫ్రెండ్‌షిప్ గురించి?
నితిన్: నీరూ.. నీరజ కోనను నేనలాగే పిలుస్తాను. మా పరిచయం అయిన కొన్నాళ్లకు మేము ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. మా ఇద్దరి మధ్య ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్‌లో నీరూ ఒకటి.
• మీది ప్రొఫెషనల్ ఫ్రెండ్‌షిప్పా?
రీల్ అండ్ రియల్.. నీరూ, నేను గుడ్ ఫ్రెండ్స్. రీల్ లైఫ్ స్టైలిస్ట్.. రియల్ లైఫ్‌లో కూడా బెస్ట్ ఫ్రెండ్ అయితే చాలా అడ్వాంటేజ్.
• మీ ఫ్రెండ్స్‌లో చాలామంది అబ్బాయిలున్నారు. వాళ్లకీ, నీరజాకీ డిఫరెన్స్?
ఏం లేదని అనుకుంటున్నాను. మేమంతా కలసి పార్టీలు చేసుకుంటాం. సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం. అబ్బాయిలతో నేనెంత సరదాగా ఉంటానో.. నీరూతో కూడా అంతే సరదాగా ఉంటాను.
• ఓ ఫ్రెండ్‌గా నీరజ భవిష్యత్తు ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?
ప్రొఫెషనల్‌గా ఇంకా ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నా. ఫ్యాషన్ డిజైనింగ్ వైజ్‌గా ఓ సొంత బ్రాండ్ ప్రారంభించాలన్నది తన లక్ష్యం. అది నెరవేరాలని ఆశిస్తున్నా. నీరూ వ్యక్తిగత జీవితం చాలా బాగుంది. నీరూ కొడుకు అన్ష్ చాలా క్యూట్‌గా ఉంటాడు. కొడుకుతో చాలా ఎంజాయ్ చేస్తుంది. ఆ ఆనందం ఎప్పటికీ అలా కొనసాగాలి.
• పెళ్లయిన అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ సాధ్యమేనా? నీరజ భర్తతో మీ అనుబంధం గురించి?
ఫ్రెండ్‌షిప్ అనేది ఒకరి వైవాహిక జీవితంతో ముడి పడి ఉండదు. యాక్చువల్‌గా నీరూకి థ్యాంక్స్ చెప్పాలి. తనతో పాటు నాకు మరో మంచి ఫ్రెండ్‌ని కూడా ఇచ్చింది. అతనే అజయ్, నీరజ భర్త. నాకు చాలా మంచి స్నేహితుడు. మా ఫ్రెండ్స్ సర్కిల్ అంతటికీ తను కూడా క్లోజ్ అయ్యాడు. మాతో ఆయన వేవ్‌లెంగ్త్ బాగా కుదిరింది.
• నీరజ ఎలాంటి అమ్మాయి?
చాలా క్రియేటివ్ పర్సన్. తెలివైన అమ్మాయి
• మీ టఫ్ టైమ్‌లో తన సలహాలు తీసుకుంటారా?
తప్పకుండా. ఇప్పటికి అలానే ఉన్నాం. ఎప్పటికీ అలా ఉండాలని కోరుకుంటున్నాను.
• మీ ఫ్రెండ్‌లో ఉన్న ప్లస్సులు, మైనస్సులు?
ఎదుటి వ్యక్తి చెప్పేది కాదనకుండా వింటుంది. ప్లస్ పాయింట్ అదే. మైనస్ పాయింట్ ఏంటంటే.. ఎవరినైనా ఈజీగా నమ్మేస్తుంది.