
బెంగాల్ టైగర్ హ్యాట్రిక్‌తో మరింత బాధ్యత పెరిగింది
►యువ దర్శకుడు సంపత్‌నంది
ఈ రోజుల్లో వరుసగా మూడు సినిమాలు సక్సెస్ చేయడమంటే మాటలు కాదు. అది కూడా ఒకదాన్ని మించి ఒకటి హిట్ చేయడం. యువ దర్శకుడు సంపత్ నంది సాధించిన క్రెడిట్ అది. వరుణ్ సందేశ్‌తో ‘ఏమైంది ఈవేళ’ చేసి తొలి హిట్టు సాధించిన సంపత్ నంది, రెండో సినిమానే రామ్‌చరణ్‌తో బాక్సాఫీస్ దగ్గర ‘రచ్చ’ చేశాడు. ఇటీవలే రవితేజను ‘బెంగాల్‌టైగర్’గా ప్రెజెంట్ చేసి భేష్ అనిపించుకు న్నాడు. ఈ హ్యాట్రిక్ విజయాల గురించి సంపత్ నంది ‘సాక్షి’తో ముచ్చటించారు.
‘బెంగాల్‌టైగర్’తో హ్యాపీయేనా?
ఫుల్ హ్యాపీ అండీ. నేనే కాదు, మా హీరో రవితేజ, మా నిర్మాత రాధామోహన్, మా టీమ్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. రవితేజ గారు నన్ను నమ్మి ఈ ప్రాజెక్టు అప్పగించారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టగలిగాను.రవితేజగారికి ఇలాంటి విజయాలు కొత్త కాదు. కానీ, నైజామ్‌లో మాత్రం ఆయనకు ఇదే హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా. భవిష్యత్తులో మళ్లీ ఆయనతో కలిసి పనిచేయాలని ఉంది. ‘బెంగాల్ టైగర్’తో నేను మాస్ ఎంటర్‌టైనర్స్ తెరకెక్కిస్తానని ఓ బ్రాండ్ వచ్చేసింది.
అయితే ఇకపై కూడా మాస్ ఎంటర్‌టైనర్స్ చేస్తారా?
అవునండీ. స్టార్స్ ఇమేజ్‌కనుగుణంగా అభిమానులను, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమంటే అంత ఈజీ కాదు.
నాక్కూడా పర్శనల్‌గా మాస్ ఎంటర్‌టైనర్స్ చేయడమంటేనే ఇష్టం.
మీలాంటి యువ దర్శకులు కూడా ప్రయోగాలు చేయకుండా ఇలా మాస్‌కే పరిమితం కావడం ఎంతవరకూ కరెక్ట్?
ఇదంతా కోట్ల రూపాయలతో కూడిన వ్యవహారం. అందుకే చాలా జాగ్రత్తగా బాక్సాఫీస్ సూత్రాల కనుగుణంగా డీల్ చేయాల్సిందే. ఇక ప్రయోగాలంటారా? నిర్మాతగా అలాంటి సినిమాలు చేస్తాను.
ఇంతకూ మీ నెక్స్ట్ సినిమా ఏంటి? ఓ టాప్ హీరోతో అని వార్తలొస్తున్నాయి?
సంక్రాంతి వరకూ ఆగండి. వాళ్ల దగ్గర నుంచే అధికారికంగా వార్త తెలుస్తుంది. ఇకపై కచ్చితంగా ఏడాదికి ఒక సినిమా చేస్తాను. ఇప్పటికే నా దగ్గర మూడు స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి. బ్రహ్మాండమైన మాస్ ఎంటర్‌టైనర్‌తో త్వరలోనే మీ ముందుకొస్తాను. ‘బెంగాల్ టైగర్’ హ్యాట్రిక్‌తో నా పై మరింత బాధ్యత పెరిగింది. అది గుర్తు పెట్టుకునే సినిమాలు చేస్తాను.