
సంజయ్‌దత్
హీరోగా సంజయ్‌దత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. కానీ కొన్ని అనుకోని సంఘటనలు ఆయన జీవితాన్ని మరింత పాపులర్ అండ్ ఇంట్రస్టింగ్‌గా చేశాయి. అందుకే ఆయన బయోగ్రఫీ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆల్రెడీ రణ్‌బీర్ సింగ్ హీరోగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో సంజయ్‌దత్ జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ ఏడాది విడుదల కానుంది. కానీ ఇంతలోనే సంజయ్‌దత్ బయోగ్రఫీ అంటూ ‘‘ది క్రేజీ అటోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ సంజయ్‌దత్’’ అనే టైటిల్‌తో ఓ బుక్ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ బుక్ గురించి సంజయ్‌దత్ స్పందించారు. ‘‘మార్కెట్‌లో ఉన్న నా బయోగ్రఫీ బుక్‌కి, నాకు ఎలాంటి సంబంధం లేదు.
ఆ బుక్‌ని ప్రచురించినవాళ్లు నా అనుమతి తీసుకోలేదు. మా లాయర్స్ సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించడం జరిగింది. పబ్లిక్ డొమైన్‌లో లభించిన సమాచారం ఆధారంగా ఈ పుస్తకం రాయబడిందని సంబంధిత పుస్తక ప్రచురణ సంస్థ పేర్కొంది. కానీ వాటిలో ఉన్న విషయాలు నా పాత ఇంటర్వ్యూస్‌లోనివని తెలిసింది. అందులో అన్నీ నిజాలు లేవు. కొన్ని గాసిప్స్, చెప్పుడు మాటలు కూడా ఉన్నాయి’’ అని అన్నారు. ఆయన ఇంకా చెబుతూ– ‘‘ఇక ఏ ఇతర రచయితలు నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందిపెట్టరని భావిస్తున్నాను. నా అఫీషియల్ బయోగ్రఫీని త్వరలోనే విడుదల చేస్తాం. అందులో ఉన్న సంగతులే వాస్తవమైనవి’’ అన్నారు.