
ఈ సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తున్నా.. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ ఎఫ్2, సూపర్‌స్టార్ రజనీకాంత్ పేట కూడా రంగంలోకి దిగడానికి సిద్దమయ్యాయి. అయితే వీటిలో ఏ సినిమాలకు ప్రేక్షకులు పట్టంకడతారో చూడాలి.
ఎన్టీఆర్ జీవిత చరిత్రగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ కథానాయకుడిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక బోయపాటి శ్రీను సినిమా అంటే మాస్‌కు పండుగే. భారీయాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన వినయ విధేయ రామపై మాస్‌లో భారీ హైప్ క్రియేట్ అయింది. వినోధ భరితంగా రాబోతోన్న ఎఫ్2, రజనీ తనదైన స్టైల్, మ్యానరిజంతో నటిస్తూ వస్తున్న పేట ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
అయితే వీటిలో ఎలాంటి కట్‌లు లేకుండా ఎన్టీఆర్ కథానాయకుడు మూవీకి యూ.. పేటా, ఎఫ్2లకు యూ/ఏ సర్టిఫికేట్‌లు లభించాయి. ఇక వినయ విధేయ రామ చిత్రం సెన్సార్ పూర్తి కావాల్సిఉంది. కథానాయకుడు అన్నింటికంటే ముందుగా (జనవరి 9న) విడుదల కానుండగా.. పేట జనవరి 10న, వినయ విధేయ రామ జనవరి 11న, ఎఫ్2 జనవరి 12న విడుదల కానున్నాయి.