డబ్బు చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమా.. ఎందుకు? | A special story about movies being made on Money | Sakshi
Sakshi News home page

డబ్బు చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమా.. ఎందుకు?

Published Fri, Aug 18 2023 12:51 AM | Last Updated on Fri, Aug 18 2023 10:09 AM

A special story about movies being made on Money - Sakshi

పైసా మే పరమాత్మ అంటారు. ఒక్క చిన్న మార్పు. ఇప్పుడు ‘పైసా మే సినిమా’ అనాలి. ఎందుకంటే రిలీజ్‌ తర్వాత సాధించే పైసా వసూల్‌ కోసం పైసల చుట్టూ కథలు అల్లి కొన్ని సినిమాలు తీస్తున్నారు. ‘పైసా మే సినిమా’... అంటూ పైసల మీద తీస్తున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.

వినోదం.. సందేశం
వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రాలు ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’. భార్యాభర్తల అనుబంధాలతో అల్లుకున్న ‘ఎఫ్‌ 2’ అయినా.. వారసత్వం నేపథ్యంతో సాగిన ‘ఎఫ్‌ 3’ అయినా.. ఈ రెండు సినిమాల్లో అంతర్లీనంగా ఉన్న ప్రధానాంశం డబ్బుతో కూడుకున్న అవసరాలేనని ప్రేక్షకులకు అనిపిస్తుంది. ‘ఎఫ్‌ 3’లో అయితే జీవితంలో డబ్బు చాలా ముఖ్యమంటూ ‘లబ్‌ డబ్‌.. లబ్‌ డబ్‌.. డబ్బూ..’ అనే పాట కూడా ఉంది. ఈ చిత్రం ఎండింగ్‌లో ‘ఎఫ్‌ 4’ ఉంటుందన్నట్లుగా పేర్కొన్నారు. వచ్చే ఏడాది ‘ఎఫ్‌ 4’ సినిమా ఆరంభం కానుందట. ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ల మాదిరిగానే ‘ఎఫ్‌ 4’ ప్రధాన కథాంశం డబ్బే అయ్యుంటుందని ఊహించవచ్చు.  



ఖరీదైన భవనాలు.. నోట్ల కట్టలు
దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కించే చిత్రాలు వినోదంతో పాటు సందేశాత్మకంగానూ ఉంటాయి. ఇక శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందనున్న తాజా సినిమాలో ధనుష్‌ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌. నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇటీవలే ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ పోస్టర్‌లో ఒకవైపు అత్యంత ఖరీదైన భవనాలు, మరోవైపు మురికి వాడలు.. మధ్యలో నోట్ల కట్టలు కనిపిస్తుంటాయి. సో.. ఈ సినిమా ప్రధాన కథాంశం డబ్బు నేపథ్యంలో ఉంటుందని, సమాజంలో నెలకొన్న అసమానతల కోణంలో కథనం సాగుతుందని ఊహింవచ్చు. వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.



జూదం
వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా పీరియాడికల్‌ ఫిల్మ్‌ ‘మట్కా’. ఈ పాన్‌ ఇండియన్‌ సినిమాకు ‘పలాస’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్, టైటిల్‌ని బట్టి ‘మట్కా’ కథ అంతా డబ్బు చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ‘మట్కా’ను తెరకెక్కిస్తున్నట్లు, వైజాగ్‌ నేపథ్యంలో 1958 – 1982 టైమ్‌ పీరియడ్‌లో ఈ సినిమా కథనం ఉంటుందన్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.



సామాన్యుడి కథ
నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథగా రూపొందనున్న సినిమా ‘లక్కీ భాస్కర్‌’. దుల్కర్‌ సల్మాన్‌ టైటిల్‌ రోల్‌లో నటించనున్న సినిమా ఇది. ‘లక్కీ భాస్కర్‌’ టైటిల్‌ను గమనిస్తే టైటిల్‌లో డాలర్‌ సింబల్‌ స్పష్టంగా కనిపిస్తుంది. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన వ్యక్తి కథ అంటూ చిత్ర యూనిట్‌ పేర్కొంది. సో..‘లక్కీ భాస్కర్‌’ కథలోని ప్రధానాంశం డబ్బే అని తెలుస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.



డాలర్‌ కుమార్‌
‘బిగ్‌ బాస్‌’ షో ఫేమ్‌ వీజే సన్నీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సౌండ్‌ పార్టీ’. ఏ ట్విస్టెడ్‌ ఫ్యామిలీ స్టోరీ అనేది ఉపశీర్షిక. హ్రితికా శ్రీనివాస్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంజయ్‌ శేరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డాలర్‌ కుమార్‌ అనే పాత్రలో నటిస్తున్నారు వీజే సన్నీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‌లో డబ్బు కనిపిస్తుండటం ‘సౌండ్‌ పార్టీ’ ప్రధాన కథాంశం డబ్బేఅని స్పష్టం చేస్తోంది.
డబ్బే ప్రధానాంశంగా సాగే మరికొన్ని సినిమాలు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement