Third Part of the Upcoming Sequel Films in Tollywood Movies - Sakshi
Sakshi News home page

ఈ సినిమాలకు ముందుంది మూడో భాగం

Published Tue, Aug 1 2023 1:11 AM | Last Updated on Tue, Aug 1 2023 2:26 PM

Third part of the upcoming sequel films in Tollywood movies - Sakshi

ఫస్ట్‌ పార్ట్‌ హిట్‌... సెకండ్‌ పార్ట్‌ కూడా హిట్‌.. మరి ఆ హిట్‌ కంటిన్యూ అవ్వాలి కదా. అవ్వాలంటే కథ ఉండాలి. కొన్ని చిత్రాల కథలకు ఆ స్కోప్‌ ఉంది. ఎన్ని భాగాలైనా తీసేంత కథ ఉంటుంది. అలా తెలుగులో కొన్ని చిత్రాల కథలు ఉన్నాయి. ఆ కథల తొలి, మలి భాగాలు వచ్చాయి. ఇప్పుడు మూడో భాగానికి కథ రెడీ అవుతోంది.  ‘ముందుంది మూడో భాగం’ అంటూ రానున్న సీక్వెల్‌ చిత్రాల గురించి తెలుసుకుందాం.

ఒకే కాంబినేషన్‌.. రెండు చిత్రాల సీక్వెల్‌
సీక్వెల్‌ చిత్రాలు రావడం ఇప్పుడు కామన్‌ అయింది. అయితే ఒకే కాంబినేషన్‌లో రెండు చిత్రాల సీక్వెల్స్‌ రావడం అరుదు. అల్లు అర్జున్‌–సుకుమార్‌ల కాంబినేషన్‌ ఈ కోవలోకే వస్తుంది. ‘ఆర్య’ (2004)తో ఈ ఇద్దరి కాంబినేషన్‌ మొదలైంది. ఆ చిత్రం హిట్‌తో హిట్‌ కాంబినేషన్‌ అనే పేరొచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ ‘ఆర్య 2’ (2009) తెరకెక్కించారు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ‘ఆర్య 3’ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ (2021) పాన్‌ ఇండియా స్థాయిలో సూపర్‌ హిట్టయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప 2’ నిర్మాణంలో ఉంది. ‘పుష్ప 3’ కూడా ఉంటుంది. ‘ఆర్య’, ‘పుష్ప’... ఇలా సౌత్‌లో రెండు చిత్రాల సీక్వెల్స్‌ తెచ్చిన కాంబినే షన్‌ బన్నీ–సుకుమార్‌లదే అవు తుంది.  


ఎఫ్‌ 4
వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తెరకెక్కిన తొలి మల్టీస్టారర్‌ చిత్రం ‘ఎఫ్‌ 2: ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ ’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్‌ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా 2019 జనవరి 12న విడుదలై నవ్వులు పూయించడంతో పాటు బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆ మూవీకి సీక్వెల్‌గా ‘ఎఫ్‌ 3: ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ తెరకెక్కించారు అనిల్‌. ఈ మూవీలోనూ వెంకటేశ్‌–తమన్నా, వరుణ్‌ తేజ్‌–మెహరీన్‌ హీరో హీరోయిన్లు. 2022 మే 27న విడుదలైన ‘ఎఫ్‌ 3’ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ‘ఎఫ్‌ 4’ కూడా ఉంటుందని హింట్‌ ఇచ్చింది చిత్ర యూనిట్‌.   

 హిట్‌ 3  
‘హిట్‌’ సినిమా ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు భాగాలు విడుదల కాగా మూడో భాగం కోసం డైరెక్టర్‌ శైలేష్‌ కొలను సన్నాహాలు చేస్తున్నారు. విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’ సినిమా 2020 ఫిబ్రవరి 28న విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘హిట్‌ 2: ది సెకండ్‌ కేస్‌’ తీశారు శైలేష్‌ కొలను. అయితే ఈ మూవీలో హీరో మారారు.. అడివి శేష్‌ హీరోగా నటించారు. 2022 డిసెంబరు 2న రిలీజైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. హిట్‌ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలు ఉంటాయని శైలేష్‌ స్పష్టం చేశారు. ‘హిట్‌ 2’ లానే ‘హిట్‌ 3’లోనూ హీరో మారారు. ‘హిట్‌ 1’, ‘హిట్‌ 2’ సినిమాలు నిర్మించిన హీరో నాని ‘హిట్‌ 3’లో లీడ్‌ రోల్‌ చేయనున్నారు. ఇందులో అర్జున్‌ సర్కార్‌ అనే పోలీస్‌ ఆఫీసర్‌గా నాని కనిపించనున్నారు. ‘హిట్‌ 2’ క్లయిమాక్స్‌లోనే నాని కనిపించి, ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. అటు నాని, ఇటు శైలేష్‌ కొలను తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. మరి ‘హిట్‌ 3’కి కొబ్బరికాయ కొట్టేదెప్పుడో తెలియాలంటే వెయిట్‌ అండ్‌ సీ.  

కేజీఎఫ్‌ 3
కన్నడ చిత్ర పరిశ్రమను, యశ్‌ను పాన్‌ ఇండియా స్థాయిలో నిలబెట్టిన చిత్రం ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 1’. యశ్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు. 2018 డిసెంబరు 21న ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత యశ్‌తోనే ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ని తెరకెక్కించారు ప్రశాంత్‌ నీల్‌. 2022 ఏప్రిల్‌ 14న రిలీజైన ఈ సినిమా కూడా హిట్‌గా నిలిచింది. ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 3’ కూడా ఉంటుందని హింట్‌ ఇచ్చారు మేకర్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement