
సుమారు దశాబ్ద కాలం తర్వాత సీనియర్ నటి విజయశాంతి ‘సరి లేరు నీకెవ్వరు’ తో రీఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్‌లో తన నటన, డ్యాన్స్‌లతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న నాటి అగ్రనటి రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమాలకు దూరమయ్యారు. నాయుడమ్మ(2006) తర్వాత మళ్లీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు రాబొతున్న విజయశాంతి తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత హీరోయిన్లలో సినిమా పట్ల శ్రద్ద కొరవడిందని విమర్శించారు.
‘గతంలో మేము ఏడాదికి 17-18 సినిమాల్లో నటించేవాళ్లం. రోజుకు ఆరు షిఫ్టుల్లో పనిచేసేవాళ్లం. ఒక్కొసారి ఉదయం ఐదు గంటలకు షూటింగ్‌కు వెళితే మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకు ఇంటికి వచ్చే వాళ్లం. అంతలా క్రమశిక్షణ, నిబద్ధతతో సినిమాలు చేసేవాళ్లం. అప్పట్లో అందరు డైరెక్టర్లు, నిర్మాతలు మాకు విజయశాంతే కావాలనేవారు. నేను మాత్రం ఎన్ని సినిమాల్లో నటించగలను. చాలా సినిమాలు డేట్స్ కుదరక వదిలేశాను. ఇక ప్రస్తుత హీరోయిన్లు జనాలను ఆకట్టుకునే విధంగా నటించడం లేదు’అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. ఇక ‘మహర్షి’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాం విడుదల కానుంది.