కరోనా పోరాటంలో మేము సైతం అంటూ ఫేస్‌బుక్ వేదికగా "ఐ ఫర్ ఇండియా" వర్చువల్ కన్సర్ట్‌లో పాల్గొంటున్నారు పలువురు సెలబ్రిటీలు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, దర్శకురాలు జోయా అక్తర్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. దీని ద్వారా వచ్చే డబ్బును కోవిడ్ రెస్పాన్స్ ఫండ్ కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు గివ్ ఇండియా సంస్థ పేర్కొంది. ఈ కార్యక్రమంలో హాలీవుడ్‌తోపాటు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ లిస్టులో స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. అయితే షారుఖ్ లైవ్ కన్సర్ట్‌లో పాల్గొంటున్న సమయంలో ఓ గమ్మత్తైన విషయం చోటు చేసుకుంది. షారుక్ పాట అందుకున్న కాసేపటికే కొడుకు అబ్‌రామ్ ఖాన్ చేరాడు. ఇంకేముందీ.. తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఆనందంగా స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. (కరోనాకి అంత సీన్ లేదు!)
ఈ పాట మొత్తం కూడా లాక్‌డౌన్‌లో ఏం జరుగుతుందో వివరిస్తూ సాగుతుంది. ఇక సాంగ్ పూర్తవగానే అబ్‌రామ్‌ను గట్టిగా హత్తుకుని లాలనగా ముద్దు పెట్టుకుంటాడు. అనంతరం మరో పాట పాడతానని రెడీ అవుతుండగా ఆ బుడ్డోడు వచ్చి పప్పా, ఇక చాలు ఆపుతావా.. అని చెప్పాడు. దీంతో ఎందుకొచ్చిన తంటాలే అని హీరో సైతం తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్‌ను షారుఖ్ ట్విటర్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలో హీరో "అంతా బాగవుతుంది.." అని చెప్పిన వ్యాఖ్యలు నిజమవుతాయంటూ ఆయన అభిమానులు ఆశాభావంతో కామెంట్లు చేస్తున్నారు. నిజానికైతే సైనీ రాజ్ రచించిన ఈ పాటను మనీ హేస్ట్ అద్భుతంగా ఆలపించాడు. దీనికి ర్యాపర్ బాద్‌షా సంగీతం రూపొందించాడు. "ఐ ఫర్ ఇండియా" లైవ్ కన్సర్ట్‌లో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమం ద్వారా మూడున్నర కోట్లకు పైగా విరాళాలను సేకరించారు. (అడ్డు తప్పుకోండి: అబ్‌రామ్ అసహనం!)
Comments
Please login to add a commentAdd a comment