
చెన్నై , పెరంబూరు: శృంగార తార షకీలాకు రాజకీయాలపై మనసు మళ్లింది. ఈ భామ ఒకప్పుడు మలయాళ చిత్రసీమలో అక్కడి సూపర్‌స్టార్స్‌కే దడ పుట్టించారు. షకీలా చిత్రం విడుదలవుతుందంటే ప్రముఖ స్టార్స్ తన చిత్రాల విడుదలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి నటిని మలయాళ చిత్ర పరిశ్రమ అంతా కలిసి అణగదొక్కిందనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం చిన్న పాత్రలకే పరిమితమైన షకీలా బయోపిక్ బాలీవుడ్‌లో తెరకెక్కుతుండడం విశేషం.
అయితే తాజాగా షకీలాకు రాజకీయాలపై ఆసక్తి కలిగింది. నటుడు కమలహాసన్ పార్టీ మక్కళ్ నీది మయ్యంలో చేరాలనుకుంటున్నట్లు తెలిపింది. కమలహాసన్ నటన అంటే చాలా ఇష్టమని, ఇంట్లో ఖాళీగా ఉన్న సమయాల్లో అతను నటించిన చిత్రాలనే చూస్తుంటానని తెలిపింది. కొత్త ఆలోచనలతో ఆయన ప్రవేశ పెట్టనున్న పథకాలు తనను ఎంతగానో ఆకర్షించాయని చెప్పింది. అందుకే ఆయన పార్టీలో చేరి పని చేయాలనుకుంటున్నట్లు నటి షకీలా ఒక భేటీలో పేర్కొంది.