
ఈ ప్రపంచ కప్‌కి ‘లా.. లా.. లా’
ఫుట్‌బాల్ క్రీడలో ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్డ్ కప్‌కు నాలుగేళ్ల క్రితం క్రీడాకారులను ఉత్సాహపరిచే విధంగా పాప్‌స్టార్ షకీరా ‘వాకా వాకా..’ పాట చేసిన విషయం తెలిసిందే. మొత్తం ప్రపంచాన్ని ఈ పాట ఉర్రూతలూగించింది. ఈ ఏడాది వరల్డ్ కప్ కోసం కూడా షకీరా ఓ పాట తయారు చేశారు. ‘డేర్... లా.. లా.. లా...’ అనే పాటను రికార్డ్ చేశారు. ఇటీవలే ఈ పాట విడుదలైంది.
దీనికి ఇతర రచయితలతో కలిసి తను కూడా సాహిత్యం సమకూర్చానని షకీరా పేర్కొన్నారు. ఈ వీడియో సాంగ్‌లో షకీరా వేసిన స్టెప్పులు కనువిందుగా ఉన్నాయని హలీవుడ్ టాక్. ఇందులో ఆమె తనయుడు మిలన్ కూడా కనిపించడం ఓ ప్రత్యేక ఆకర్షణ. దాని గురించి షకీరా మాట్లాడుతూ - ‘‘ఈ పాట బాగా రావాలనే ఆలోచనతో ఈ మధ్య నేను స్టూడియోలో ఎక్కువగా గడిపాను. తిండి, నిద్ర మర్చిపోయి మరీ పని చేశాను. ఓ రోజు మా అబ్బాయి మిలన్ స్టూడియోకి వచ్చాడు. నా ఒళ్లో కూర్చుని, పాట మొత్తం విన్నాడు. ఈ పాటలో తను కూడా కనిపించడం నాకో ప్రత్యేకమైన అనుభూతి ’’ అన్నారు.