మెసేజ్‌లతో చంపేశారు..
బాలీవుడ్ విలన్ శక్తికపూర్‌ను కొందరు ఆకతాయిలు మెసేజ్‌లతో ‘చంపేశారు’. వెండితెరపై ప్రేక్షకులను గడగడలాడించిన విలన్ కాస్తా మెసేజ్‌ల తాకిడికి బిక్కచచ్చిపోయాడు. ఇంతకూ ఏం జరిగిందంటే, ఖండాలా వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో శక్తికపూర్ దుర్మరణం చెందాడని కొందరు ఆకతాయిలు ‘వాట్సప్’లో మెసేజ్ పుట్టించారు. ఈ మెసేజ్ శరవేగంగా బాలీవుడ్ అంతటా పాకింది. దీంతో శక్తికపూర్ ఫోన్‌కు శనివారం వేకువ జామునే సంతాప సందేశాల వెల్లువతో పాటు, సన్నిహితుల నుంచి ఫోన్‌కాల్స్ మొదలవడంతో అందరికీ పేరు పేరునా తాను క్షేమంగానే ఉన్నట్లు చెప్పుకోవడానికి నానా తంటాలు పడ్డాడు.