కొన్నాళ్ల పాటు మల్టీస్టారర్స్ చేయను!
‘‘ఇప్పటివరకూ నచ్చిన సినిమాలు చేసుకుంటూ వచ్చా. ఏదీ ప్లాన్ చేసుకుని చేయలేదు. కానీ, ఈ సిన్మా తర్వాత ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు ఎంపిక చేసుకోవాలనుకుంటున్నా’’ అన్నారు సందీప్ కిషన్. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆదీ సాయికుమార్ హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్ నిర్మించిన ‘శమంతకమణి’ రేపు విడుదలవుతోంది. సందీప్ చెప్పిన సంగతులు...
♦ ఇందులో లవ్‌లో ఫెయిలైన కోటిపల్లి శివ అనే యువకుడి పాత్ర చేశా. ఓ పల్లెటూరిలో థియేటర్ నడిపే శివకు, కారుకు సంబంధం ఏంటనేది తెరపైనే చూడాలి. కొన్నిసార్లు పాత్రలు బాగున్నా... సినిమా అంతా ఉండవు. కానీ, ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. శివ పాత్ర అలాంటిదే. ఇందులో ఊర మాస్ సీనుంది. లుంగీ కట్టుకుంటే సీన్ బాగుంటుందని నేనూ, దర్శకుడు డిస్కస్ చేసుకుని ఈ లుక్ డిజైన్ చేశాం.
♦ శ్రీరామ్ ఆదిత్య తొలి సినిమా ‘భలే మంచిరోజు’ టేకింగ్ నాకు బాగా నచ్చింది. మనిషిగానూ నచ్చాడు. నలుగురు హీరోలం శ్రీరామ్ ఆదిత్యను కలసినప్పుడు చాలా సింపుల్‌గా కథ చెప్పాడు. అందరికీ ఎగై్జటింగ్‌గా అనిపించి ఓకే చేశాం. ఆదితో ఎప్పట్నుంచో సినిమా చేయాలనుకుంటే ఇప్పటికి కుదిరింది. సుధీర్ నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమాతో రోహిత్ బాగా క్లోజ్ అయ్యాడు. ఒకరి పాత్రతో మరొకరి పాత్రకు పోలిక ఉండదు. ఇందులో రాజేంద్రప్రసాద్‌గారితో నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమా తర్వాత కొన్నాళ్లు మల్టీస్టారర్స్ చేయకూడదనుకుంటున్నా.
♦ ‘నక్షత్రం’ త్వరలోనే విడుదలవుతుంది. కృష్ణవంశీగారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా. తెలుగులో కునాల్ కోహ్లీ దర్శకత్వంలో నేను, తమన్నా జంటగా ఓ సినిమా, మంజులగారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఈ రెండూ కాకుండా తెలుగు, తమిళ భాషల్లో సుసీంద్రన్ దర్శకత్వంలో ‘నా పేరు శివ’కు సీక్వెల్‌గా ‘కేరాఫ్ సూర్య’, తమిళ హిట్ ‘డీ–16’ దర్శకుడు కార్తీక్ నరేన్‌తో ‘నరకాసురుడు’ చేస్తున్నా.
♦ నాగచైతన్య నాకు మంచి ఫ్రెండ్. ‘నరకాసురుడు’కి ముందు తననే అడిగారట. తనెందుకు చేయలేదో నాకు తెలీదు. దర్శకుణ్ణి కూడా నేనింతవరకు అడగలేదు. వరుసగా మంచి దర్శకులతో పనిచేసే అవకాశాలు వస్తుండడం హ్యాపీ. వినోదం పాటు సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు చేయాలనుకుంటున్నా.