మూవీరివ్యూ: శమంతకమణి
మల్టీ స్టారర్ మూవీ అంటే తెలుగు సినీపరిశ్రమ లాంటి చోట సాహసమే. వెంకీ, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు మల్టీ స్టారర్ చేసి సక్సెస్ అయినా ఆ బాటలో నడిచేందుకు పెద్దగా దర్శకులు ఆసక్తి కనబరచలేదు. అయితే తాజాగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య నలుగురు అప్ కమింగ్ హీరోలను తీసుకుని ఒక ఇన్వెస్టిగేషన్ కథతో చేసిన ప్రయత్నమే శమంతకమణి. టాలీవుడ్‌లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నలుగురు హీరోలతో తెరకెక్కింది ఈ సినిమా.
నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్, ఆది. ఇలా నలుగురు యంగ్ హీరోస్ కలిసి చేసిన సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. వీళ్లకి తోడు నలుగురు హీరోయిన్ల సందడి.. ఇంకోవైపు, రాజేంద్రప్రసాద్, సుమన్. ఇలా.. భారీ కాస్టింగ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం.
నలుగురు యువకుల జీవితాలతో కథ మొదలవుతుంది. కృష్ణ (సుధీర్ బాబు), శివ(సందీప్ కిషన్), కార్తీక్ (ఆది), సి.ఐ రంజిత్‌గా నారా రోహిత్‌లు ఎవరి జీవితాలు, ఎవరి గోలలో వాళ్లుంటారు. అలాంటి పరిస్థితుల్లో కృష్ణ(సుధీర్‌బాబు) ఓ పెద్ద పార్టీ ఇస్తాడు. అయితే పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లడానికి పార్కింగ్‌లోకి వచ్చిన కృష్ణకు అక్కడ ఉండాల్సిన ఐదు కోట్ల విలువచేసే తన కారు శమంతకమణి చోరీ అయ్యిందని తెలుస్తుంది.
ఎవరు దొంగిలించారో తెలుసుకోవడానికి ఫిర్యాదు చేసిన తర్వాత ఆ కేసును సిఐ రంజిత్‌కుమార్ డీల్ చేయడం మొదలుపెడుతాడు. కేసు విచారణలో భాగంగా కృష్ణ ఇచ్చిన పార్టీకి వచ్చిన వారిలో అనుమానంగా కనిపించిన శివ, కార్తీక్, రాజేంద్రప్రసాద్‌లను విచారిస్తాడు. అయితే వాళ్లలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతూ ఉండడంతో ఆ కారు ఎవరు దొంగలించారన్న దానిపై స్పష్టత పోతుంది. అయితే ఆ కారును ఏం చేశారు? దేనికోసం 5కోట్ల విలువచేసే కారును తీసుకెళ్లారు? ఆ కారుకి వీళ్లకి సంబంధం ఏంటి? అసలు రంజిత్ కుమార్‌కు ఆ కారుకు ఉన్న సంబంధం ఏంటి? మరి ఈ నలుగురిలో కారు ఎవరు దొంగలించారన్నదే ‘శమంతకమణి’ స్టోరీ.
నటీనటులు
నటుల పరంగా ఎవరిని ఎత్తి చూపడానికి లేదు. ఈ సినిమాకున్న అతి పెద్ద బలం నలుగురు కథానాయకులు. ఎవరికి బలమైన ఇమేజ్ లేకపోవడమే పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. స్టార్ ఇమేజ్ బ్రాండ్ ఒక్కరికి ఉన్నా కూడా తేడాలు కనిపించేవి కాని అందరు ఒకే రేంజ్ కాబట్టి ఆ సమస్య రాలేదు. ఒకపాత్రతో వేరేదానికి పోలిక లేకపోవడం వల్ల ఎవరికి వారు బాగా బాగా పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి అవకాశం దక్కింది. కానీ వీళ్ల టాలెంట్ ని పూర్తిగా వాడుకోవడంలోనే దర్శకుడు బాగానే సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ స్పేస్ అందరికి సమానంగా రావాలి అనే ప్రయత్నంలో ట్రాక్ కొద్దిగా తప్పడం సెకండ్ హాఫ్ లో స్పష్టంగా కనిపిస్తుంది.
అందరిలోకి ఎవరు బాగా చేసారు అంటే చెప్పటం కష్టమే. సుధీర్ బాబు ఆ పాత్రకు సరిపోయాడు కాని సందీప్ కిషన్, నారా రోహిత్ పాత్రలతో పోలిస్తే అతని స్పాన్ తక్కువే. రాజేంద్ర ప్రసాద్ తన భుజాలపై మోయడానికి మాగ్జిమం ట్రై చేసాడు. అంతవరకు మెచ్చుకోవచ్చు. హీరొయిన్లు కైరా దత్, అనన్య సోని, చాందిని జస్ట్ గ్లామర్ డోస్ కోసమే కానీ నటనపరంగా పెద్దగా ఆకట్టుకోలేదు. సుమన్ చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ లో ఆశ్చర్యపరుస్తాడు. ఇతని పాత్రే కీలకం. తనికెళ్ల భరణి, బెనర్జీ, ఇంద్రజ, హేమ, కృష్ణతేజ అవసరమైనప్పుడు వచ్చి అనవసరం అనేది లేకుండా మేనేజ్ చేసారు.
సాంకేతికవర్గం
నలుగురు యువకులను ప్రధానంగా తీసుకుని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య శమంతకమణి కథను తయారు చేసుకున్నాడు. మొదట్లో ట్రైలర్ లో చూపించినట్టే సినిమా కథ మొత్తం శమంతకమణి కారు చుట్టూనే ఉంటుంది. సినిమా మొదలై ఎండ్ వరకు కారునే ప్రధాన పాత్ర పోషించింది. అయితే క్రైమ్ త్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించాలని డైరెక్టర్ అనుకున్నాడు. అయితే మనకు ట్రైలర్ లో కనిపించిన క్యూరియాసిటీ సినిమాలో కనబడదు. ఒక కారు ఎంతో విలువైంది కాబట్టే దాన్ని దొంగలు కొట్టెయ్యడంం. దాన్ని పోలీస్ లు కనిపెట్టడం వంటిది ఎన్నో సినిమాల్లో వచ్చేసింది. కథ పరంగా కొత్తగా శమంతకమణిలో మనకేం కనబడదు.
అసలు కారు చుట్టూ కథను అల్లినపుడు కారు గురించి ప్రేక్షకులకు ఎటువంటి థ్రిల్లింగ్ కలగదు. అసలా కారు స్పెషాలిటీ ఏమిటనేది క్లారిటీ ఇవ్వలేదు దర్శకుడు.ఇక మ్యూజిక్ విషయానికొస్తే మణిశర్మ సినిమాకు తగ్గ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. సినిమాలో ఉన్నది ఒకటే పాట. ఆ పాట ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు మరో పెద్ద ప్లస్. సీన్స్ కి తగ్గట్లుగా స్టైలిష్ విజువల్స్ తో సమీర్ రెడ్డి మెప్పించాడు. ఇక నిర్మాణ విలువలు విషయంలో కాస్త అసంతృప్తే కనబడుతుంది. – సాక్షి స్కూల్ ఎడిషన్